తాడేపల్లి: అమరావతి నిర్మాణానికి 100 ఏళ్లు పడుతుందని ఢిల్లీలోని ట్రిబ్యునల్‌కు నివేదిక ఇచ్చి, ఇక్కడ మాత్రం 2028-29 కల్లా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మండిపడ్డారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించకుండా, కౌన్సిల్‌ను పక్కదారి పట్టిస్తూ తీర్మానాలను నేరుగా పంపిస్తోందని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో జరిగే భూ కుంభకోణాలు, కాంట్రాక్టుల్లో అవినీతి బయటకు వస్తుందనే భయంతోనే కౌన్సిల్‌లో చర్చకు రాకుండా ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మొత్తం రాజధానిని ప్రభుత్వమే కడుతుందనడం కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని విమర్శించారు. ఒకవైపు ఆర్థిక మంత్రి జీతాలకే డబ్బులు సరిపోవడం లేదని అంటుంటే, ముఖ్యమంత్రి మాత్రం లక్షల కోట్లతో రాజధాని కడతామని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. అమరావతిని ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రాంతాల వారీగా, కులాల వారీగా చిచ్చు పెట్టవద్దని హితవు పలికారు. ఆచరణ సాధ్యం కాని అమరావతికి ప్రత్యామ్నాయంగా వైయస్ జగన్ గారు సూచించిన మావిగన్‌కి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. - రాజ్యాంగ వ్యవస్థలను అవహేళన చేస్తున్నారు గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి బిల్లుకు వైయస్ఆర్‌సీపీ సహకరించినట్టు ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు చెప్పారు. కౌన్సిల్‌లో ప్రతి బిల్లుపై చర్చ జరగాలని, అందులోని లోపాలను ఎత్తిచూపి సరిచేసిన తర్వాతే పాస్ చేయడం జరుగుతుందని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించకుండా, కౌన్సిల్‌ను పక్కదారి పట్టిస్తూ తీర్మాణాలను నేరుగా పంపిస్తోందని విమర్శించారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో మూడు రాజధానుల బిల్లు సందర్భంగా టీడీపీ నాయకులు కౌన్సిల్ లో రచ్చ చేసి రాజకీయంగా వాడుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కౌన్సిల్‌ని వాడుకుని అధికారంలోకి వచ్చాక విస్మరిస్తూ చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్‌లో మాత్రం లోక్‌సభ, రాజ్యసభలో ఎందుకు చర్చించారని ప్రశ్నించారు. ఇంతకీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది అమరావతి బిల్లా లేదా తీర్మాణమా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. - అమరావతిపై ఢిల్లీలో అలా.. ఏపీలో ఇలా అమరావతి నిర్మాణానికి 100 ఏళ్లు పడుతుందని ఢిల్లీ లోని ట్రిబ్యునల్‌కు నివేదిక ఇచ్చి, ఇక్కడ మాత్రం 2028-29 కల్లా పూర్తి చేస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో జరిగే భూ కుంభకోణాలు, కాంట్రాక్టుల్లో అవినీతి బయటకు వస్తుందనే భయంతోనే కౌన్సిల్‌లో చర్చకు రాకుండా ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మొత్తం రాజధానిని ప్రభుత్వమే కడుతుందనడం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనని విమర్శించారు. రోడ్లు, లైట్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసి నాలుగు బిల్డింగులు కట్టినంత మాత్రాన రాజధాని నిర్మాణం జరిగిపోయినట్టు కాదని, సీఆర్‌డీఏ పరిధిలో ఎక్కడా రెసిడెన్షియల్ అనేది లేకుండా చేసి బినామీలకు వందల ఎకరాల భూములను కట్టబెట్టారని చెప్పారు. ఉద్యోగాల కల్పనకు భూములే ఇవ్వకుండా కంపెనీలే లేకుండా రాజధాని ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో రేణుకా చౌదరి కమరావతి అంటూ కులాలు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలను కూటమి నాయకులు ఖండించడం లేదంటే కుల రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్నారా అని ఎద్దేవా చేశారు. అమరావతిని ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రాంతాల వారీగా, కులాల వారీగా చిచ్చు పెట్టవద్దని హితవు పలికారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు చంద్రబాబుతో కుమ్మక్కై రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేసిందని మండిపడ్డారు. - జీతాలకే డబ్బులు లేవంటూ అమరావతి కడతారా? రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు బంద్ అయ్యాయని, పేదలకు వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి, ధాన్యం, పొగాకు కొనడానికి ప్రభుత్వ దగ్గర డబ్బులు లేవని విమర్శించారు. ఒకవైపు ఆర్థిక మంత్రి జీతాలకే డబ్బులు సరిపోవడం లేదని అంటుంటే, ముఖ్యమంత్రి మాత్రం లక్షల కోట్లతో రాజధాని కడతామని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే అమరావతి పేరుతొ కొత్త డ్రామాకు తెరదీశారని స్పష్టం చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మూడు నగరాలతో మావిగాన్ పేరుతో రాజధానిని డెవలప్ చేస్తే రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అవుతుందని సూచించారు. ఆచరణ సాధ్యం కాని అమరావతికి ప్రత్యామ్నాయంగా వైయస్ జగన్ గారు సూచించిన మావిగన్‌కి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని చెప్పారు. కానీ ఆ పేరుపై తలతిక్క వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం సిగ్గుచేటని, సమాధానం చెప్పుకోలేక చేస్తున్న ప్రయత్నంగా అభివర్ణించారు. - గ్యాలరీల్లో ఫోటోలతో ప్రచారం హేయం ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని మంత్రులపై దాడులు చేయించిన విషయాన్ని మర్చిపోలేదని, దాన్ని పక్కనపెట్టి చైర్మన్ ని మేము అవమానించామని చెప్పడం హేయమన్నారు. గ్యాలరీల్లో కూర్చుని సైగలు చేసే సంస్కృతి చంద్రబాబు, టీడీపీదేనని స్పష్టం చేశారు. నాడు కౌన్సిల్‌లో చంద్రబాబు కూర్చుంటే, రాజ్యసభలో నారా లోకేష్ కూర్చోవడమే కాకుండా దాన్ని మీడియాకి ఇచ్చి పబ్లిసిటీ చేసుకున్నారని విమర్శించారు. ఇవన్నీ చేస్తూ కూడా రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనని చెప్పారు. అమరావతి ఒక్కటే ఉండాలని చెప్పే చంద్రబాబు, నాడు హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు సైబరాబాద్ తీసుకురాలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్యూచర్ సిటీ పేరుతో మరో కొత్త సిటీ ఏర్పాటు చేయడంపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. గత 60 నెలల వైయస్ జగన్ గారి పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా జరిగాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం కేవలం 22 నెలల్లోనే రూ. 3.40 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్ర వ్యవస్థలను సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారనే భయంతోనే ప్రభుత్వం ఇలాంటి డ్రామాలు ఆడుతోందని తూమాటి మాధవరావు పేర్కొన్నారు.