తాడేపల్లి: సామాన్యులకు అర్థమయ్యే విధంగా అచ్చ తెలుగు నుడికారంతో రామాయణాన్ని రచించి ప్రజలకు అందజేసిన కవయిత్రి మొల్లమాంబ గొప్ప దార్శనికురాలని వైయస్ఆర్‌సీపీ నాయకులు కీర్తించారు. తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతిని తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మొల్లమాంబ విగ్రహానికి పూల మాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రామాయణ రచనతో శ్రీకృష్ణదేవరాయల మన్ననలు పొందిన కవయిత్రి మొల్ల జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడారు. అంతే కాకుండా మారుమూల గ్రామంలో జన్మించి నాటి సమాజంలో నెలకొన్న లింగ, కుల వివక్షతలను బద్దలు కొట్టిన మొల్లమాంబ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని చెప్పారు. కాగా, ఒక మారుమూల గ్రామంలో జన్మించిన మొల్లమాంబ రామాయణ మహా కావ్యాన్ని రాసి అందరితో ప్రశంసలు అందుకున్నారని, తండ్రి ప్రోత్సాహంతో రచనలు సాగించి ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించారని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. మొల్లమాంబ తన రచనల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని స్మరించారు. గత వైయస్ఆర్‌సీపీహయాంలో రాజకీయంగా శాలివాహనులకు ఎంతో ప్రాధాన్యం దక్కిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక పట్టించుకోవడం లేదని శాలివాహన కార్పొరేషన్ మాజీ చైర్మన్ పురుషోత్తం ఆక్షేపించారు. వైయస్ జగన్ సీఎంగా ఉండగా జీఓ నెం:99 ద్వారా కవయిత్రి మొల్లమాంబ జయంతి రోజును రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జగన్‌గారు మళ్లీ సీఎం అయితేనే శాలివాహనులకు మంచి రోజులు వస్తాయని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బాడిస గణేష్, బాపనపల్లి రవికుమార్, నల్లూరి శివాజీ, పెదపూడి కిషోర్, రాజేష్, డాక్టర్ రామనామం, జి.శివకుమార్, విజయవాడ కార్పొరేటర్ ఆలంపూర్ విజయలక్ష్మి, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాపనపల్లి వీరాంజనేయులతోపాటు వివిధ విభాగాలకు చెందిన వైయస్ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.