కాకినాడ: అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ మూడో విడత నిధులపై కూటమి ప్రభత్వం చెబుతున్నవన్నీ అబద్దాలేనని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తొలి ఏడాది అన్నదాత సుఖీభవ నిధుల్ని పూర్తిగా ఎగ్గొట్టిన ప్రభుత్వం, రెండో ఏడాది రూ.10 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు మూడో విడతలోనూ 7 లక్షల రెతులకు పథకంలో కోత పెట్టారని తప్పుబట్టారు. ఇప్పటికే గిట్టుబాటు ధరల్లేక, ఇన్‌పుట్ సబ్సిడీ అందక, ఉచిత పంటల బీమా ఎత్తిపోయి.. దిక్కుతోచక రైతులు చివరకు ఆత్మహత్య చేసుకుంటుంటే ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదని కాకినాడలో మీడియాతో మాట్లాడిన కె.కన్నబాబు ఆక్షేపించారు. ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి కె.కన్నబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..: ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో మరో మోసం: ఉదయం పత్రికలు చూస్తే చంద్రబాబు ఏ అబద్ధాలు ఆడారు, ఆయన కోసం పచ్చ మీడియా ఏ కథలు అల్లింది అనేది తెలుస్తోంది. ఒక్క రోజు కూడా నిజం చెప్పకుండా, ఒక్క రోజు కూడా తనను తాను సీనియార్టీని గుర్తు చేసుకుని ప్రజల కోసం స్వచ్ఛందంగా, నిజాయితీగా నిలబడాలనే ఆలోచన లేకుండా చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ ఉగాది కానుక అని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు. కేంద్రం ఇచ్చే రూ.2 వేలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.4 వేలు ఇస్తోందని చెప్పుకున్నారు. గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున ఇస్తే, అంతకన్నా ఎక్కువగా, కేంద్రం ఇచ్చేది కాకుండా, స్వయంగా రూ.20 వేల చొప్పున ఇస్తామని సూపర్ సిక్స్‌లో జోరుగా ప్రచారం చేసుకున్నారు. కానీ తొలి ఏడాది మొత్తానికి మంగళం పాడారు. రెండో ఏడాది కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు మూడో విడత నిధుల్లోనూ పచ్చి అబద్ధాలు చెబుతూ, ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నారు. 7 లక్షల మంది రైతులకు కోత పెట్టారు: వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కింద 53.58 లక్షల రైతులకు పెట్టుబడి సాయం చేస్తే, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ 46.85 లక్షల రైతు కుటుంబాలకు మాత్రమే పథకాన్ని వర్తింప చేస్తోంది. అంటే ఏకంగా 7 లక్షల మంది రైతులకు కోత పెట్టారు. ఇంకా కౌలు రైతులకు ఒక్క రూపాయి సాయం చేయడం లేదు. మా ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించాం. కాదని చెప్పే ధైర్యం ఉందా?. రైతులపై రుణభారంలో దేశంలోనే ఏపీ రెండో స్ధానంలో ఉంది. రైతు రుణభారాన్ని మోయలేని స్ధితిలో ఏపీ ప్రభుత్వం ఉందని మీరు భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది. రైతు ఆత్మహత్యలు పట్టని ప్రభుత్వం: రాష్ట్రంలో గత ఏడాది 393 మంది రైతులతో పాటు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే సగటున ఒక రైతు కన్నా ఎక్కువ, నలుగురు కన్నా ఎక్కువ రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఇలా ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎందుకు బడ్జెట్‌లో సాయం చేయలేకపోయారు? రైతు కుటుంబాల ఆవేదన మీకు కనిపించడం లేదా? రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, మార్కెట్ మద్దతు లేదు, సొంత మీడియా జాకీలు వేసి లేపుతుంటే సరిపోతుందా చెప్పాలి. 2023–2025 మధ్య జగన్‌గారు రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా ఆ పథకాన్ని అమలు చేశారు. దీనికి కూటమి ప్రభుత్వం మంగళం పాడేయడం వల్ల రూ.3500 కోట్లు రైతులు నష్టపోయారని ఆధారాలతో సహా మీకు చెప్తున్నాం. జగన్‌గారి ప్రభుత్వం హయాంలో 55 లక్షల కుటుంబాలు ఉచిత పంటల బీమా వల్ల లబ్ది పొందాయి. ఇప్పుడు మీ పంటల బీమా పథకం వల్ల ఎంత మంది రైతులు లబ్ది పొందారో చెప్పాలి. రైతులకు పంటల బీమా కింద ప్రీమియమ్ ఎందుకు కట్టలేకపోయారు? మరి ఈ 20 చేసిన అప్పు రూ.3.18 లక్షల కోట్లు ఏమయ్యాయి?. కూటమి ప్రభుత్వం. వ్యవసాయానికి శాపం: ఈ ప్రభుత్వంలో 16 సార్లు ప్రకృతి విపత్తులు వస్తే ఎంత మంది రైతులకు సాయం అందించారో చెప్పాలి. మొంథా తుపాన్ బాధిత రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారో లేదా క్షేత్రస్ధాయిలో రైతుల్ని అడిగితే తెలుస్తుంది. సున్నా వడ్డీ పథకం కింద సకాలంలో వడ్డీ కట్టిన రైతులకు తిరిగి ఆ డబ్బులు ఇచ్చిన ఘనత జగన్మోహన్‌రెడ్డిది. మీరు వచ్చాక ఈ పథకాన్ని ఎందుకు అటకెక్కించారు, ఇది మీ చేతకానితనమా? కాదా? చెప్పాలి. మీరు మార్కెట్ మద్దతు ఇచ్చిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా చెప్పాలి. ఉల్లి, పసువు, అరటి.. ఏ రైతునైనా ఆదుకున్నారా చెప్పండి. మా హయాంలో ప్రతీ రైతునూ చేయి పట్టి నడిపించాం. ఇవాళ రూ.300 కోట్లతో స్థిరీకరణ నిధి అని బడ్జెట్ పెట్టి వాటితోనే వ్యవసాయాన్ని ఉద్ధరిస్తామంటున్నారు. అందుకు మీకు సిగ్గనిపించడం లేదా? అని మాజీ మంత్రి కె.కన్నబాబు చురకలంటించారు.