శనగల కొనుగోలు కేంద్రంలో అవినీతి

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపాటు

వైయ‌స్ఆర్ జిల్లా: ప్రొద్దుటూరులో శనగల కొనుగోలు కేంద్రంలో భారీ అవినీతి జరుగుతోందని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి,  మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతులకు అన్యాయం జరుగుతోందని వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను హెచ్చరించారు. శుక్ర‌వారం ప్రొద్దుటూరులోని మార్కెట్ యార్డు శనగల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం శనగలకు క్వింటాల్‌కు రూ.5,875 మద్దతు ధర ప్రకటించినప్పటికీ అక్కడ ఎమ్మెల్యే అనుచరులు భారీ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. మార్కెట్ యార్డు కొనుగోలు కేంద్రం ద్వారా సుమారు రూ.10 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సుమారు 20 వేల ఎకరాల్లో శనగ పంట సాగు చేశారని తెలిపారు. రైతుల వద్ద నుంచి క్వింటాల్‌కు రూ.200 చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారని అన్నారు. నిబంధనల ప్రకారం ఒక క్వింటాల్ అంటే 101 కిలోలు 200 గ్రాములు ఉండాలని, అయితే వరదరాజుల రెడ్డి అనుచరులు మాత్రం 106 కిలోలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

అలాగే ఈ–క్రాప్ నమోదు చేయకపోయినా వ్యాపారుల ద్వారా గత ఏడాది పండిన శనగలను కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా రైతులకు అన్యాయం జరుగుతోందని, వెంటనే అరికట్టాలని జిల్లా అధికారులను కోరారు. శనగల కొనుగోలు విషయంలో రైతులకు నష్టం జరిగితే అక్కడికక్కడే పోరాటం చేస్తామని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. మార్కెట్ యార్డు కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాలను నిలువరించి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
 

Back to Top