రాయలసీమ లిఫ్ట్‌ స్కీంపై మంత్రి మాటలు అవివేకానికి నిదర్శనం

వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ధ్వజం

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి.

రాయలసీమ లిఫ్ట్‌పై మంత్రికి కనీస అవగాహన లేదు

ప్రాజెక్ట్‌ అనవసరం అనడం రాయలసీమకు వెన్నుపోటు 

కూటమి ప్రభుత్వంలో ఒక్క  ప్రాజెక్టు పనులు జరగలేదు

రాయలసీమ ప్రాజెక్టులకు రూ.8 వేల కోట్లు అబద్ధం

కమీషన్ల కోసం పాత బిల్లులు చెల్లించారు

దాంతో ఆ పనులు చేశామని చెప్పడం సిగ్గుచేటు

ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి స్పష్టీకరణ

దమ్ముంటే పూర్తి వివరాలు బయట పెట్టండి

అఖిలపక్షంలో పనులు, ఖర్చుల వివరాలు చూపండి

ప్రెస్‌మీట్‌లో ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌

తాడేపల్లి: రాయలసీమ లిఫ్ట్‌ స్కీంపై మంత్రి నిమ్మల రామానాయుడి మాటలు ఆయన అవివేకానికి నిదర్శనమని, ఆ ప్రాజెక్టుపై మంత్రికి కనీస అవగాహన లేదని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్ట్‌ అనవసరం అనడమంటే అది రాయలసీమకు వెన్నుపోటు పొడవడమే అని ఆయన తేల్చి చెప్పారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఒక్క  ప్రాజెక్టు పనులు జరగలేదన్న ఆయన, రాయలసీమ ప్రాజెక్టులకు రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామనడం పచ్చి అబద్ధమని చెప్పారు. కమిషన్ల కోసం పాత బిల్లులు చెల్లించి, ఆ పనులు తామే చేశామని చెప్పడం సిగ్గుచేటని చురకలంటించారు. నిజంగా అలా నిధులు ఖర్చు చేసి ఉంటే, ఆ దమ్ము ప్రభుత్వానికి ఉంటే పూర్తి వివరాలు బయట పెట్టాలని, అఖిలపక్షం ఏర్పాటు చేసి ఆ పనులు, ఖర్చుల వివరాలు చూపాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.
ప్రెస్‌మీట్‌లో ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ఏం మాట్లాడారంటే..:

నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు ప్రచారం:
    రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) లైనింగ్‌ పనులు తప్ప, ఏ ప్రాజెక్టు పనులూ జరగలేదు. అయినా తాము రాయలసీమ ప్రాజెక్టులపై రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పడం హాస్యాస్పదం. అత్యంత హేయం. చివరకు రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ప్రాంతాలకు నీరిచ్చే అవకాశం ఉన్నా, దాన్ని సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. రాయలసీమ లిఫ్ట్‌ స్కీమ్‌ అవసరం లేదన్న మంత్రి నిమ్మల రామానాయుడు మాటలు, ఆయన అవివేకానికి నిదర్శనం. రాయలసీమ అవసరాలు గుర్తించిన గత ప్రభుత్వం.. 2024లో దిగిపోయే వరకు రాయలసీమ లిఫ్ట్‌ స్కీం పనులు శరవేగంగా కొనసాగించింది. ఆ పనులకు రూ.795 కోట్ల బిల్లులు కూడా చెల్లించింది. కావాలంటే మంత్రి రామానాయుడు ఎం బుక్‌లు తెప్పించుకుని చూడొచ్చు. తాను రాయలసీమ ద్రోహి కాదని చంద్రబాబు నిరూపించుకోవాలి. అందుకు కనీసం ఇప్పుడైనా ఆయన, తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనపై వివరణ ఇవ్వాలి. 

2024 వరకు నిర్విరామంగా ప్రాజెక్టు పనులు:
    టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కుమ్మక్కై , ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాయలసీమ లిఫ్ట్‌ స్కీంను ఆపేశారు. అంతే తప్ప, మంత్రి రామానాయుడు ఆరోపిస్తున్నట్టు పనులేవీ 2020లో ఆగిపోలేదు. 2024లో మా ప్రభుత్వం దిగిపోయే వరకు ఆ స్కీం పనులు నిర్విరామంగా సాగాయి. మంత్రి ఒకసారి ఎం బుక్‌ (మెజర్‌మెంట్‌ బుక్‌) పరిశీలిస్తే, ఆయనకు అన్ని విషయాలు బోధ పడతాయి. అయినా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయడం దుర్మార్గం. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపు 85 శాతం మేర పనులు పూర్తయ్యాయి. కేవలం పంపులు బిగించడం మాత్రమే మిగిలి ఉంది. 

ఆ ప్రాజెక్టుతో చంద్రబాబుకే లబ్ధి:
    మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంస్థకు అవసరం లేని పనులు అప్పగించి బిల్లులు చెల్లించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపిస్తున్నారు. గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్‌), హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) లింక్‌ పనులు రాయలసీమకు ఎంతో ఉపయోగకరం. మంత్రి వస్తే దాన్ని చూపడానికి మేము సిద్ధం. నిసానికి కుప్పంకు నీరు చేరాలంటే దాదాపు 620 కి.మీ వెళ్లాల్సి ఉంటుంది. అది చాలా కష్టసాధ్యమైన పని. కానీ, నాడు సీఎం  వైయస్‌ జగన్‌ చేపట్టిన జీఎన్‌ఎస్‌ఎస్‌– హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ లింక్‌ ప్రాజెక్టు పూర్తయితే కేవలం 120 కి.మీ మాత్రమే నీరు లిఫ్ట్‌ చేస్తే సరిపోతుంది. అదే కాకుండా 3.36 లక్షల ఎకరాలు చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల పరిధిలోని ఎత్తయిన ప్రాంతాలకు నీరు సులువుగా చేరిపోతుంది. అందుకే ఆ ప్రాజెక్టు కోసం వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలోనే రూ.1100 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. నిజానికి ఆ ప్రాజెక్టు పూరై్తతే ఎక్కువ లబ్ధిపొందేది కూడా చంద్రబాబే. 

అవివేకంతో మంత్రి మాటలు:
    రాయలసీమకు లిఫ్ట్‌ అసవరం లేదన్న మంత్రి రామానాయుడు మాటలు ఆయన అవివేకానికి నిదర్శనం. ఇరిగేషన్‌ శాఖ అధికారులతో ఎప్పుడైనా సమీక్ష చేసి ఉంటే ఆ మాట అనేవాడు కాదు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల ఎత్తు నుంచే నీరు తోడేలా తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు కట్టి నీటిని తరలిస్తుంటే, ఇక్కడ రాయలసీమ రైతులు బతకొద్దా? వారికి రాయలసీమ లిఫ్ట్‌ స్కీం మినహా వేరే ప్రత్యామ్నాయం ఉందా?.

రాయలసీమ లిఫ్ట్‌పై చంద్రబాబు కుట్ర:
    రాయలసీమ లిఫ్ట్‌ స్కీం పూర్తయితే జగన్‌గారికి మంచి పేరొస్తుందన్న అక్కసుతో నాడు కూడా రేవంత్‌రెడ్డితో కలిసి చంద్రబాబు కుట్రలు చేశారు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)లో కేసులు వేయించి పనులు అడ్డుకున్నాడు. నిజానికి ఆయనకు రాయలసీమపై చిత్తశుద్ధి ఉంటే, అలా అక్కడి ప్రజలకు మరణశాసనం రాసేవాడు కాదు. అదే  దివంగత వైయ‌స్ఆర్ దమ్మున్న నాయకుడు కాబట్టే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచి రాయలసీమ రైతులకు మేలు చేశారని ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి వివరించారు.

Back to Top