తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద వైయ‌స్ఆర్ స్టూడెంట్స్ యూనియ‌న్‌ భారీ ధర్నా

తిరుపతి: విద్యార్థి సంఘాల నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడం, రౌడీ షీట్లు పెట్టడాన్ని నిరసిస్తూ తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట వైయ‌స్ఆర్ స్టూడెంట్స్ యూనియ‌న్‌, వివిధ విద్యార్థి సంఘాలు భారీ ధర్నా నిర్వహించాయి. ఈ ధర్నాకు పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థి సంఘాల నేతలు తరలివచ్చారు. 
ఈ నిరసన కార్యక్రమానికి తిరుపతి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి భూమన అభినయ్ రెడ్డి, రాష్ట్ర వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి హాజరయ్యారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట నడిరోడ్డుపై చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి విద్యార్థి నేతలతో కలిసి బైఠాయించి ధర్నా చేపట్టారు. 
ఈ క్రమంలో ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో విద్యార్థి సంఘాల నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. నడిరోడ్డుపై నుంచి ధర్నాదారులను పక్కకు లాగే ప్రయత్నం చేయడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనకారులు హోరెత్తిన నినాదాలు చేశారు. 
భారీ ఉద్రిక్తత నడుమ భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డితో పాటు విద్యార్థి సంఘాల నేతలు ఆర్డీఓను కలిసి వినతిపత్రం అందజేశారు. ధర్నా నేపథ్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 
విద్యార్థి సంఘాలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, రౌడీ షీట్లు తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

Back to Top