కర్నూలు: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భోగి పండుగ సందర్భంగా ఘన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలను భోగిమంటల్లో దగ్నం చేస్తూ వైయస్ఆర్‌సీపీనేతలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోవైయస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు, కర్నూలు అసెంబ్లీ ఇన్‌చార్జ్ శ్రీ ఎస్వీ మోహన్ రెడ్డి గారు పాల్గొని మాట్లాడుతూ, ప్రజలను మోసం చేస్తూ ఎన్నికల హామీలను కాగితాలకే పరిమితం చేసిన కూటమి ప్రభుత్వ పాలనకు ఇది ప్రత్యక్ష నిదర్శనమని విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం తీవ్రంగా నిరాశపరిచిందని అన్నారు. భోగి పండుగ రోజున ప్రజల ఆశలను కాల్చివేస్తున్న ఈ ప్రభుత్వ వైఖరిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ప్రజా సమస్యలపై వైయస్ఆర్‌సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని ఎస్వీ మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.