వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో భోగి సంబరాలు

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ జీవోలను భోగి మంటల్లో దగ్ధం

ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మంగళగిరి ఇన్‌చార్జ్‌ వేమారెడ్డి, పార్టీ నాయకులు అంకంరెడ్డి నారాయణమూర్తి, శివశంకర్, హర్షవర్ధన్‌రెడ్డి, పానుగంటి చైతన్య, రవిచంద్ర పాల్గొన్నారు.

తాడేపల్లి: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా భోగి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో కాపీలను భోగి మంటల్లో దగ్ధం చేశారు.ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు మీడియాతో మాట్లాడారు. వారు ఏమ‌న్నారంటే..

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సంక్రాంతి రైతుల పండుగ, భోగి మంటల్లో పనికిరాని వస్తువులను దగ్ధం చేసే సంప్రదాయానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వ జీవోలను భోగి మంటల్లో ద‌గ్ధం చేశాం.  కార్పొరేట్‌ సంస్థలకు భూములు కారుచౌకగా కట్టబెడుతూ, ప్రజల ఆందోళనలను పట్టించుకోకుండా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణకు తెరలేపడం దుర్మార్గం. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన చేయకపోతే, ఓటు అనే వజ్రాయుధంతో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయం.

ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల ముఖాల్లో చిరునవ్వు మాయమైంది. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. వైయస్‌ జగన్‌ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ప్రారంభించగా, వాటిని ప్రైవేట్‌ చేతుల్లోకి అప్పగించడాన్ని ప్రజలు సహించబోరు.

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా భోగి మంటల ద్వారా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేశాం. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో వ్యవసాయాన్ని పండుగలా నిర్వహించారు, ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బలవంతపు భూసేకరణతో రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వ తీరు దుర్మార్గం.

మంగళగిరి ఇన్‌చార్జ్‌ వేమారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ దుర్మార్గమైన చర్యలతో రైతులు, పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. గ్రామాల్లో వెలుగులు కనుమరుగయ్యాయి, ప్రజావ్యతిరేక పాలనను కూకటి వేళ్లతో పెకిలించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రజలంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది.

Back to Top