మాజీ ఎమ్మెల్యే పిన్నెలిని పరామర్శించిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు 

నెల్లూరు:   సెంట్రల్‌ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని వైయ‌స్ఆర్‌సీపీ ప్రముఖ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి జైలులో పిన్నెల్లిని ములాఖ‌త్‌లో కలుసుకుని పరామర్శించారు.

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి గత రెండు సంవత్సరాలుగా వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. హత్య కేసులో అసలు నేరస్థులను వదిలిపెట్టి పిన్నెలి, ఆయన సోదరుడిపై అక్రమంగా కేసు మోపారని పేర్కొన్నారు. గతంలో ఈ హత్య కేసుకు వారికి సంబంధం లేదని అప్పటి ఎస్పీ కూడా చెప్పారని గుర్తుచేశారు. ఇప్పటికే 96 రోజులుగా పిన్నెలి జైలు జీవితం గడుపుతున్నారని, ఆయన ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. చార్జ్‌షీట్‌ దాఖలు చేసి 90 రోజులు దాటినా ఇంకా బెయిల్‌ రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ దుశ్చర్యలకు తగిన ప్రతిఫలం ముఖ్యమంత్రి చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ అనుభవిస్తారని పెద్దిరెడ్డి అన్నారు.

ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ… అకారణంగా, అక్రమ కేసులు మోపి పిన్నెలి, ఆయన సోదరుడిని హింసిస్తున్నారని ఆరోపించారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని, రేపు వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చి ఇలాంటి చర్యలు పునరావృతం చేస్తే వారు సహించగలరా అని ప్రశ్నించారు.

Back to Top