రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్న తరుణంలో, కూటమి ప్రభుత్వం కేవలం అమరావతి రాజధాని నిర్మాణం కోసమే రూ.2 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధపడటం ఎంతవరకు సమంజసమని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. రాజమండ్రిలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని వ్యయం, రాష్ట్ర అప్పుల భారం, కేంద్రం నుండి నిధుల సాధనలో చంద్రబాబు నాయుడు వైఫల్యంపై వాస్తవాలను ప్రజల ముందుంచారు. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, ప్యాకేజీ కానీ లేవని మార్గాని భరత్ గుర్తు చేశారు. విభజన సమయంలో చంద్రబాబు రూ.5-6 లక్షల కోట్ల స్పెషల్ ప్యాకేజీ డిమాండ్ చేశారని, కానీ ఇవాళ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం టీడీపీ మద్దతుతో నిలబడి ఉన్నా, రాజధాని నిర్మాణానికి అవసరమైన రూ.2 లక్షల కోట్లను కేంద్రమే భరించాలనే క్లాజును చట్టంలో ఎందుకు పొందుపర్చలేకపోయారని నిలదీశారు. రాష్ట్ర ప్రజల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నా, రాజధాని కోసం చట్టబద్ధత తెస్తున్నప్పుడు నిధుల కోసం కేంద్రాన్ని చంద్రబాబు ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. 2019లో వైయస్ఆర్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నా ప్రతి సమావేశంలోనూ, ప్రతి వేదికమీదా ప్రత్యేక హోదా అడిగామని, కానీ ఇవాళ ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ చంద్రబాబు ఎందుకు నిధులు అడగడం లేదని దుయ్యబట్టారు. చేతనైతే కేంద్రం మెడలు వంచి గ్రాంట్స్ తెచ్చి నిర్మాణం చేయాలని సవాల్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. రాష్ట్రంపై అప్పుల భారం.. అమరావతి వడ్డీ ఎవరు కడతారు?: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రెండేళ్లలోనే చంద్రబాబు రూ.3.34 లక్షల కోట్లు అప్పు చేశారు. ఇందులో వివిధ కార్పొరేషన్ల నుండి రూ.89 వేల కోట్లు, రాజధాని కోసం రూ.47,837 కోట్లు, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుండి రూ.11 వేల కోట్లు, కాగ్ లెక్కల ప్రకారం నెట్ బారోయింగ్స్ రూ.94 వేల కోట్లు ఉన్నాయి. గవర్నమెంటు బాండ్లు కూడా తాకట్టు పెట్టి అప్పులు చేశారు. అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు చెబుతున్న రూ.2 లక్షల కోట్లకు ఏడాదికి రూపాయి వడ్డీ లెక్కవేసినా రూ.20 వేల కోట్లు వడ్డీ అవుతుంది. రాష్ట్రానికి హైదరాబాద్ వంటి మహానగరం లేనప్పుడు, గ్రోత్ ఇంజన్ ఎక్కడ ఉంటుంది?. ఈ డబ్బు ఎక్కడి నుండి జనరేట్ అవుతుంది?. గ్రోత్ ఇంజన్, సెల్ఫ్ సస్టైన్ మోడల్ ఎక్కడ ఉంది?. అప్పు చేసి పథకాలు ఇస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు, రాబోయే రోజుల్లో మరో రూ.1.50 లక్షల కోట్లు అప్పు చేస్తారు. ఇలా చేసుకుంటూ పోతే అప్పు రూ.15 లక్షల కోట్లకు చేరడం ఖాయం. మావిగన్' కారిడార్ - తక్కువ ఖర్చు, ఎక్కువ అభివృద్ధి: పోర్టు, మెట్రోపాలిటన్ సిటీగా వేగంగా ఎదుగుతున్న విశాఖను వైయస్.జగన్ హయాంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఎంపిక చేశారు. ఇది ఐదేళ్లలో హైదరాబాద్ తో పోటీ పడేది. కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా నిర్ణయించి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని వైయస్.జగన్ భావించారు. చెన్నై, ముంబై, కోల్ కతా వంటి రాజధానిర నగరాలు ఆయా రాష్ట్రాల మధ్యలో లేవన్న విషయం గుర్తుంచుకోవాలి. అమరావతి కోసం చంద్రబాబు చెబుతున్న రూ.2 లక్షల కోట్లలో కేవలం రూ.10 వేల కోట్లు పోర్టు ఉన్న మచిలీపట్నం నుండి విజయవాడ, గుంటూరును కలుపుతూ 'మావిగన్' కారిడార్ కింద ఖర్చు పెడితే అద్భుతమైన మహానగరం అభివృద్ధి చెందుతుంది. దీని ద్వారా బెంగుళూరు, హైదరాబాద్ తో పోటీ పడతాం. ఏ మహానగరమైనా అభివృద్ధి చెందడానికి వందల ఏళ్లు పడుతుంది, కానీ అమరావతిని మొదటి నుండి ప్రారంభిస్తానని చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమే. విశాఖ, విజయవాడ వంటి ప్రధమ శ్రేణి నగరాలను వదిలి, శూన్యం నుండి మొదలుపెడతారా? పోర్ట్ సిటీ ఉంటేనే గ్రోత్ ఇంజన్ వస్తుంది. అమరావతి గ్రోత్ ఇంజన్ ఎవరికి?: అమరావతి నగరం చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లకు మాత్రమే గ్రోత్ ఇంజిన్ తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మాత్రం కాదు. రాజధాని పేరుతో వీళ్లు 'దోచుకో, దాచుకో' కార్యక్రమం చేస్తున్నారు. మొబలైజేషన్ అడ్వాన్స్ కిందే రూ.5,500 కోట్లు ఇవ్వడం దారుణం. దేశచరిత్రలో రాజధాని నగరంలో రిజర్వాయరు కట్టిన సందర్భాలున్నాయా?. ఐఐటీ మద్రాసు, శివరామకృష్ణన్ కమిటీ కూడా గతంలో ఈ ప్రాంతం రాజధానికి అంత ఆమోదయోగ్యం కాదని చెప్పినా కూడా చంద్రబాబు ముందుకు వెళ్తామన్నారు. టీడీపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్వయంగా అమరావతి నిర్మాణం 2028 నాటికి పూర్తి కాకపోవచ్చని, హైదరాబాద్ లా తయారు కావాలంటే 50 సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. అమరావతి వ్యయం, దాని తదుపరి పరిణామాలపై ప్రజలు ఆలోచన చేయాలి. వైయస్ఆర్‌సీపీ స్పష్టమైన స్టాండ్: అమరావతికి వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేస్తున్నాం. రైతులు చంద్రబాబును నమ్మి 33 వేల ఎకరాలు ఇస్తే 2014-19 వరకు వారికి ఏం న్యాయం చేశారు. వైయస్.జగన్ అమరావతి రైతులకు అన్యాయం చేస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారని, అలాంటి ఆలోచన ఉంటే అమరావతిని శాసనరాజధానిగా ఎందుకు ప్రకటిస్తారు. అమరావతి పేద రైతులకు గతంలో చంద్రబాబు రూ.2,500 పెన్షన్ ఇస్తే.. వైయస్. జగన్ దాన్ని రూ.5000 చేశారు. వైయస్.జగన్ అమరావతిలోనే సొంత ఇళ్లు కట్టుకున్నారు కానీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లు మాత్రం హైదరాబాద్ నుంచి వస్తారు.. రోల్ మోడల్స్ గా ఉండాల్సిన వీళ్లే సాయంత్రానికే హైదరాబాద్ వెళ్లిపోతారు. రాష్ట్రాభివృద్ధి కోసం మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది వైయస్. జగన్ విధానం. ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరుగుతుంది అంటే మేం కూడా మద్ధతిస్తాం. అమరావతి పేరుతో సంబరాలు చేస్తున్నారు. ఏం సాధించారు? గ్రాంట్లు రావు, కేంద్రం నుంచి ప్రాజెక్టులు రావు. డిమాండ్ చేసే స్ధితిలో ఉన్నా చంద్రబాబు ఎందుకు కేంద్రం నుంచి సాధించలేకపోతున్నారు. మన పిల్లలు, భావితరాలును దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మార్గాని భరత్ స్పష్టం చేశారు.