విజయవాడ : ఈనెల 18వ తేదీన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ఇఫ్తార్ విందు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. లబ్బీపేటలోని ఎస్ఎస్ కన్వేషన్ హాల్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇఫ్తార్ విందు ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలశీల రఘురాం, ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు తదితరులు పరిశీలించారు. కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత నాయకులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తలశీల రఘురామ్ మాట్లాడుతూ ఈనెల 18న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు హాజరుకానున్నారని చెప్పారు. విజయవాడ లబ్బీపేటలోని ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించే ఈ ఇఫ్తార్ విందుకు మైనారిటీ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.