కోడిని కోస్తే నాన్‌ బెయిలబుల్‌..డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడితే బెయిల్‌

డ్రగ్స్ కేసు, మహిళలపై ఆరోపణల విషయంలో ద్వంద్వ వైఖరి ఎందుకు?

ఎక్స్ వేదిక‌గా కూట‌మి ప్ర‌భుత్వానికి వైయ‌స్ఆర్‌సీపీ సూటి సూటి ప్ర‌శ్న 

విజయవాడ :  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కోడిని కోస్తే నాన్ బెయిల‌బుల్ కేసు..డ్ర‌గ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ ప‌ట్టుబ‌డితే మాత్రం స్టేష‌న్ బెయిల్‌పై విడుద‌ల చేస్తున్నారు. డ్రగ్స్ కేసులు, మహిళలపై జరిగే నేరాల విషయంలో కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ  విమర్శించింది. చిన్న చిన్న కేసుల్లో అమాయకులపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్న ప్రభుత్వం, తమ పార్టీకి చెందిన నేతల విషయంలో మాత్రం మౌనం పాటిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూట‌మి ప్ర‌భుత్వ  ద్వంద్వ వైఖ‌రిని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదిక‌గా ప్ర‌శ్నించింది.

ఏలూరు లోక్‌సభ సభ్యుడు పుట్టా మ‌హేష్ యాద‌వ్ డ్రగ్స్ తీసుకున్న కేసులో అడ్డంగా పట్టుబడ్డారని ఆరోపిస్తూ, ఇలాంటి ఘటన పార్లమెంట్ చరిత్రలో అరుదని పేర్కొన్నారు. అయినప్పటికీ రాజకీయ ప్రభావం ఉపయోగించి బెయిల్‌పై బయటకు తీసుకురావడం, షోకాజ్ నోటీసుల పేరుతో డ్రామాలు చేయడం సరికాదని విమర్శించారు.

ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్ర‌బాబు, హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌,  మంత్రి నారా లోకేష్‌ స్పందించాలని వైయ‌స్ఆర్‌సీపీ  డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారన్న ఆరోపణలు, డ్రగ్ పరీక్షలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. రక్త పరీక్షల్లో కొకైన్ వాడినట్లు పాజిటివ్ వచ్చిందన్న ఆరోపణలపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు.

అలాగే మహిళలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కూటమి ప్రజాప్రతినిధులపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ  విమర్శిస్తోంది. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అర‌వ శ్రీ‌ధ‌ర్‌పై వచ్చిన అత్యాచార ఆరోపణలు, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక దాడి ఆరోపణలు, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన ర‌వికుమార్‌పై వేధింపుల ఆరోపణలు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మ‌హ‌మ్మ‌ద్ న‌సీర్ అహ్మ‌ద్‌పై అశ్లీల వీడియో కాల్స్ ఆరోపణలు వచ్చినప్పటికీ చర్యలు లేదు.

మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గుమ్మ‌డి సంధ్యారాణి పీఏపై కూడా చర్యలు తీసుకోలేదు. అలాగే ప్రస్తుతం టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడిపై కూడా ఒక మహిళ మోసం చేశాడని ఆరోపణలు చేసినప్పటికీ స్పందన లేకపోవడం ఆందోళనకరం. కమిటీల విచారణలు, షోకాజ్ నోటీసుల పేరుతో డ్రామాలు ఆపి, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. లేకపోతే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని క్షమించరని ఎక్స్‌లో వైయ‌స్ఆర్‌సీపీ హెచ్చ‌రించింది. 

Back to Top