తాడిపత్రిలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైయ‌స్ఆర్‌సీపీ దీక్ష.. 

పోలీసు నిర్బంధాలతో హైటెన్షన్

 అనంతపురం : తాడిపత్రిలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వైయ‌స్ఆర్‌సీపీ చేపట్టిన సామూహిక నిరాహార దీక్ష నేపథ్యంలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి హింసాత్మక రాజకీయాలకు నిరసనగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే డిమాండ్‌తో గాంధీ విగ్రహం వద్ద సామూహిక నిరాహార దీక్షకు వైయ‌స్ఆర్‌సీపీ పిలుపునివ్వగా, పోలీసులు భారీ ఎత్తున ఆంక్షలు విధించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తాడిపత్రి వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తాడిపత్రికి తరలిరావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. అయితే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారని పార్టీ నేతలు ఆరోపించారు.

కేతిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
దీక్షకు వెళ్లేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు ఇంటి వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇంటి బయట భారీగా పోలీసు బలగాలు మోహరించగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి బయట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

తాడిపత్రి వెళ్లనీయకుండా నేతలను అడ్డుకున్న పోలీసులు
మరోవైపు తాడిపత్రికి బయలుదేరిన వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిలను అనంతపురంలో పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ముందుకు వెళ్లనీయకపోవడంతో ఇరువురు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల వైఖరికి నిరసనగా అనంతపురంలోని కోర్టు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులతో వైయ‌స్ఆర్‌సీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఎక్కడికక్కడే అడ్డుకున్న పార్టీ శ్రేణులు
అనంతపురం జిల్లా వివిధ నియోజకవర్గాల నుంచి తాడిపత్రికి బయలుదేరిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. తాడిపత్రికి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తూ, భగత్‌సింగ్ నగర్ సహా పలు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. పార్టీ శ్రేణులను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు రోడ్డుపైనే నిరసనలు చేపట్టారు. కొందరు రోడ్డుపైనే టిఫిన్ చేస్తూ నిరసన తెలుపగా, “తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి” అంటూ నినాదాలు చేశారు.

జేసీ దౌర్జన్యాలకు పోలీసుల సహకారం: వైయ‌స్ఆర్‌సీపీ
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్య రాజకీయాలకు పోలీసులు సహకరిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన ఈ దీక్షను ఎన్ని ఆంక్షలు విధించినా విజయవంతం చేస్తామని, ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. 
 

Back to Top