పొట్టి శ్రీ‌రాములు అడుగుజాడల్లో నడుద్దాం

మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

శ్రీ‌కాకుళంలో ఘ‌నంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్య‌క్ర‌మం

శ్రీకాకుళం : పొట్టి శ్రీ‌రాములు అడుగుజాడల్లో నడుద్దామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పిలుపునిచ్చారు. అమరజీవి పొట్టి శ్రీ‌రాములు జయంతి సందర్భంగా శ్రీ‌కాకుళం నగరంలోని ఓబీఎస్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఒక జాతి చరిత్రను ఆ జాతిలో వస్తున్న కొత్త తరాలకు ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏ జాతి పురోగమించాలన్నా ఆ జాతి నిర్మాణంలో త్యాగాలు చేసిన మహనీయుల పాత్రను తరతరాలకు తెలియజేయడం ముఖ్యమని చెప్పారు. అందుకే 120 సంవత్సరాల తర్వాత కూడా పొట్టి శ్రీరాములు జయంతిని మనం ఘనంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.

మద్రాస్ ప్రాంతంలో తెలుగువారిని నిర్లక్ష్యం చేసి అవమానించిన రోజుల్లో తెలుగు జాతి గౌరవం కోసం పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఎంతో ధైర్యంతో ఆయన ఆ దీక్ష చేపట్టారని అన్నారు. కఠిన పరిస్థితుల్లో 57 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తెలుగు జాతి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడిని మనం ఎప్పటికీ స్మరించుకోవాలని పేర్కొన్నారు.

తెలుగు జాతిని ఒక తాటిపై నిలబెట్టి, ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలో కొనసాగుతున్నాయంటే అందుకు పొట్టి శ్రీరాములు త్యాగమే ప్రధాన కారణమని ఆయన తెలిపారు. కొత్త తరాలకు కూడా ఆయన చేసిన త్యాగాలను తల్లిదండ్రులు, పెద్దలు తెలియజేయాలని కోరుతూ మరోసారి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి తన నివాళులు అర్పిస్తున్నట్లు ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.
 

Back to Top