పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెం పట్టణ ఇలవేల్పుగా పేరుగాంచిన బలుసులమ్మ అమ్మవారి ఆలయం ను వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డి రఘురామ్ నాయుడు దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బలుసులమ్మ అమ్మవారు ఎంతో మహిమ గల గ్రామదేవతగా ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నారని అన్నారు. 2014లో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కృషితో ఆలయ నిర్మాణం జరిగిందని గుర్తుచేశారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో, అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చొరవతో అమ్మవారికి వెండి తాపడం, ఉయ్యాల, రథం నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున జరిగాయని తెలిపారు. ఆలయ అభివృద్ధికి తొలినాళ్ల నుంచి పట్టణ ప్రజలు విశేషంగా సహకరించారని, జాతర సమయంలో కూడా పెద్దఎత్తున విరాళాలు అందజేశారని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఆలయం అంగరంగ వైభవంగా విరాజిల్లుతోందని పేర్కొన్నారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే అమ్మవారి జాతర ఈ ఏడాది ఘనంగా నిర్వహించారని తెలిపారు. తాడేపల్లిగూడెం ప్రజలు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ, ప్రతి శుభకార్యంలో చలివిడి, పానకాలు సమర్పించడం విశేషమన్నారు. అయితే ఆలయ నిర్మాణం, అభివృద్ధికి సహకరించిన వ్యక్తులు, నాయకులను జాతర వేడుకల్లో సత్కరించి ఉంటే మరింత మంచిదని స్థానిక ప్రజల ఆకాంక్షగా తెలిపారు. అలాగే జాతరకు విరాళాలు ఇచ్చిన వారి వివరాలను మున్సిపల్ హోర్డింగ్స్ ద్వారా ప్రదర్శిస్తే పారదర్శకత పెరుగుతుందని సూచించారు. ఆలయ కమిటీ కష్టపడి నిర్వహించిన జాతర కార్యక్రమాలు ప్రశంసనీయమని వడ్డి రఘురామ్ నాయుడు అభినందించారు.