ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు

సీఎం చంద్రబాబుకు ఇకనైనా సద్భుద్ది రావాలి

వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల స్పష్టీకరణ

విశాఖపట్నంలోని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా భోగి మంటలు వేసిన పార్టీ నాయకులు. పీపీపీ విధానంలోకి మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన జీఓ ప్రతులు ఆ మంటల్లో దహనం చేసి, నిరసన వ్యక్తం చేశారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం మార్చుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ జిల్లా నాయకులు ఎవరెవరు ఏమన్నారంటే..:

 
సీఎం చంద్రబాబు మనసు మారాలి
:కెకె రాజు. వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు

– మాయమాటలు, అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి, గత 19 నెలలుగా మోసం, వంచనతో పాలన సాగిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు మరోసారి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. అందుకే కూటమి పెద్దల మనసుల్లో నిండి ఉన్న మోసం, వంచన, నిరంకుశత్వం వంటి దుర్గుణాలన్నీ ఈ భోగి మంటల్లో కాలిపోవాలని, కనీసం ఇప్పుడైనా ప్రజలకు మేలు చేసేలా సీఎం చంద్రబాబుకు సద్బుధ్ది ఇవ్వాలని దేవుడిని ప్రార్థించాం. ముఖ్యంగా ప్రజారోగ్య రంగాన్ని నిర్వీర్యం చేసేలా 10 కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆయన మనసు మార్చాలని దేవుడిని ప్రార్థించాం. అలాగే, ఆ నిర్ణయంపై మా నిరసన వ్యక్తం చేస్తూ, మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన జీఓ ప్రతులు భోగి మంటల్లో దహనం చేశాం.

కూటమి ప్రభుత్వంలో అందరికీ ద్రోహం
:పేరాడ రమణకుమారి. వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు.

– కూటమి ప్రభుత్వం కొలువు దీరిన నాటి నుంచి యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాలకు తీవ్రమైన ద్రోహం చేశారు. ఇకనైనా వారి మేలు గురించి ప్రభుత్వం ఆలోచించాలి.వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ రాష్ట్ర ప్రజలంతా సంక్రాంతి పండుగను ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న ఈ రెండో సంక్రాంతికి కూడా ఏ ఇంటా ఆ శోభ కనిపించడం లేదు. ముఖ్యంగా కూటమి పాలనలో మహిళలు అన్ని విధాలుగా నష్టపోయారు. ఇకనైనా గత ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. 
    కాగా, ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, విశాఖ పశ్చిమ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్, దక్షిణ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్, తూర్పు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్‌ కట్టమూరి సతీష్‌తో పాటు, పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Back to Top