డోన్‌లో టీటీడీ కళ్యాణ మండపానికి తాళాలు.. 

కూటమి ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి బుగ్గన ఆగ్ర‌హం

నంద్యాల జిల్లా:  డోన్ పట్టణంలో నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపానికి తాళాలు వేసిన ఘటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ ఈ భవనాన్ని పరిశీలించేందుకు వస్తున్నారనే సమాచారంతోనే కళ్యాణ మండపం గేటుకు తాళాలు వేసినట్లుగా స్థానికులు, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సుమారు ఏడాది క్రితమే టీటీడీ కళ్యాణ మండప నిర్మాణం పూర్తయినప్పటికీ ఇప్పటివరకు ప్రారంభించకపోవడం ఏమిటని బుగ్గన రాజేంద్రనాథ్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన భవనాన్ని ప్రారంభించకుండా మూసివేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. డోన్ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు, శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఉద్దేశించి గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించారని, కానీ ప్రభుత్వ మారిన తర్వాత దీన్ని పూర్తిగా పట్టించుకోవడం లేదని బుగ్గన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన భవనాన్ని రాజకీయ కక్షతో ప్రారంభించకపోవడం సరికాదని ఆయన అన్నారు.ప్రభుత్వం వెంటనే టీటీడీ కళ్యాణ మండపాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, లేకపోతే ఉద్యమాలు చేపడతామని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు హెచ్చరించారు.

Back to Top