తిరుపతి: ఏపీలో ఆధ్యాత్మిక విధ్వంసానికి చంద్రబాబే కారకుడని, బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన నాటి నుంచి తిరుమల ప్రతిష్ట రోజురోజుకీ దిగజారిపోతోందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమలలో తాగి పడేసిన ఖాళీ మద్యం బాటిళ్లు ఉన్నాయని వీడియో తీసి టీటీడీ నిఘా వ్యవస్థ వైఫల్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన కోటి అనే వ్యక్తినే ముద్దాయిగా చేసి కూటమి ప్రభుత్వం ఇరికించడమే కాకుండా దేశద్రోహం కేసు పెట్టిందని ఆయన ఆక్షేపించారు. బీఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడి ఆదేశాలతో ఎడిటింగ్ చేసిన వీడియోలతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను దోషులుగా చిత్రీకరించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లే కార్యక్రమానికి పోలీసులు శ్రీకారం చుట్టారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే పూర్తి అరగంట నిడివి గల సీసీటీవీ ఫుటేజ్‌ని విడుదల చేయాలని భూమన డిమాండ్ చేశారు. టీటీడీ నిఘా వ్యవస్థ కళ్లు గప్పి అన్ని మద్యం బాటిళ్లు తెచ్చి పడేయడం సాధ్యమేనా అని ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు. వైయస్ఆర్‌సీపీ మీద బురద జల్లడమే లక్ష్యంగా, తాము కోరిన విధంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని సీఐ శ్రీరాములు.. కోటిని దారుణంగా కొట్టి వేధిస్తున్నాడని భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ● చంద్రబాబు, బీఆర్ నాయుడి డైరెక్షన్‌లో కుట్ర అత్యంత పవిత్రమైన తిరుమలలో ఈనెల 4వ తేదీన కౌస్తుభం గెస్ట్ హౌస్ పక్కన పదుల సంఖ్యలో ఖాళీ మద్కం బాటిళ్లు కనిపించిన సంఘటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆందోళన చెందారు. దీంతో ఈ సంఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని టీటీడీ చీఫ్ పీఆర్వో ప్రకటన చేశాడు. ఆరోజే పోలీస్ శాఖ నుంచి కూడా సరిగ్గా ఇలాంటి ప్రకటనే వచ్చింది. టీటీడీ చైర్మన్ నిర్లక్ష్యం కారణంగా తిరుమలలో వరుసగా జరుగుతున్న ఇలాంటి అపచారాలతో హిందువుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెళ్లుబుకుతున్నాయి. ఈ నేపథ్యంలో విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. అంతకుముందు ఎస్పీ ఆఫీసు నుంచి వచ్చిన ప్రకటనలకు భిన్నంగా వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలే మందుబాటిళ్లు తీసుకొచ్చి వేశారని, ఈ వార్తను సాక్షి విలేకరి కవర్ చేశాడంటూ కొత్త పల్లవి అందుకున్నారు. నవీన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రచారం చేశాడంటూ తప్పుడు కేసులు నమోదు చేయడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పార్టీ మీద బురదజల్లడమే లక్ష్యంగా కేబినెట్ మీటింగ్‌లో చంద్రబాబే స్వయంగా ఈ విషయాన్ని లేవనెత్తి మందు బాటిళ్లు జరిగిన ఘటనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లాలని డైరెక్షన్ ఇచ్చాడు. దీన్ని అందుకున్న ఎల్లో మీడియా "వైసీసీ ఆధ్యాత్మిక విధ్వంసం" అంటూ తప్పుడు కథనాలతో దుష్ప్రచారం మొదలుపెట్టారు. భూమన కరుణాకర్ రెడ్డి చేశాడని బీఆర్ నాయుడు డైరెక్షన్‌లో కొంతమంది తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన నాటి నుంచి తిరుమల పవిత్రతను కాలరాసేలా ఆయన ప్రైవేట్ సైన్యం చేస్తున్న దురాగతాలను రాష్ట్ర ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. తిరుమలలో ఖాళీ మందు బాటిళ్లను చూసి వీడియోలు తీసింది ముమ్మాటికీ మా కార్యకర్త కోటినే. కానీ కోటినే బాటిళ్లు పెట్టాడని, దాన్ని సాక్షి విలేకరి మోహన్ కృష్ణ కవర్ చేశాడని, నవీన్ సోషల్ మీడియాలో ప్రచారం చేశాడని పోలీసులు కుట్రపూరితంగా తప్పుడు కేసులు నమోదు చేశారు. మందు బాటిళ్లను కోటి వీడియోలు తీస్తుండగా దొరికిన సీసీ కెమెరా ఫుటేజీలను ఎడిటింగ్ చేసి ఆయన బాటిల్స్ పడేసి తప్పుడు ప్రచారం చేస్తున్నాడంటూ తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను దోషులుగా నేరస్తులుగా చిత్రీకరించడం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ వారికి బెయిల్ రాకుండా చేసేందుకు వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 152 నమోదు చేశారు. దేశద్రోహం కేసు ఎలా నమోదు చేస్తారని సీఐ శ్రీరామలును మేజిస్ట్రేట్ మందలించారు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే అరగంట పాటు రికార్డ్ అయిన సీసీ టీవీ ఫుటేజ్‌లను బయటపెట్టాలి. ఈ ఘటన తర్వాత పోలీసులకు తిరుమలలో 25 గోనె సంచుల్లో మద్యం బాటిళ్లు దొరికిన మాట వాస్తవమా కాదా అనేది ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి కూటమి ప్రభుత్వం చెప్పాలి. ఈ విషయం కూడా మాకు తెలిసినా తిరుమల పవిత్రతకు భంగం వాటిళ్లుతుందని భావించి ప్రకటించలేదు. కానీ టీటీడీ చైర్మన్ వైఫల్యాలను వెలికితీస్తున్న మాపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వారి కుట్రలను సహించేది లేదు. ● వాళ్లను పోలీసులు కొట్టి వేధిస్తున్నారు వైయస్ఆర్‌సీపీ ఆధ్యాత్మిక విధ్వంసం చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ఉపేక్షించం. 41 ఏ నోటీసులు ఇవ్వడంతో మోహన్‌కృష్ణ తన భార్య, అడ్వకేట్‌తో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళితే.. మోహనకృష్ణ, కోటిలను దేవలోక్ అనే సంస్థ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం సిగ్గుచేటు. (అందుకు సంబంధించిన వీడియోలను భూమన ప్రదర్శించారు). కోటిని అదుపులోకి తీసుకున్న తర్వాత తమకు అనుకూలంగా కేసును మలచుకోవడం కోసం పోలీసులు తీవ్రంగా కొట్టి హింసించారు. తాము చెప్పినట్టు వాంగ్మూలం ఇవ్వకపోతే గోర్లు పీకుతామని, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామని టూటౌన్ సీఐ శ్రీరాములు వేధించాడు. బాటిల్స్ తాను వేయలేదని, తానే వీడియో తీసి వాస్తవాలను బయటపెట్టానని చెప్పినా వినకుండా స్టేషన్‌లో టార్చర్ పెట్టాడు. రాయలసీమ లిప్టు ఇరిగేషన్ స్కీమ్ గురించి వైయస్ఆర్‌సీపీ ధర్నా నిర్వహిస్తుండగా అక్కడే కవర్ చేస్తున్న సాక్షి వీడియోగ్రాఫర్ మోహన్ కృష్ణను డీఎస్పీ ప్రసాద్ బండబూతులు తిడుతూ తీవ్రంగా హింసించాడు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా పోలీస్ వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. కూటమి రాజకీ కుట్రలకు పోలీసులు బలి పశువులు అవుతున్నారు. ● ఇదంతా బీఆర్ నాయుడి ప్రైవేట్ సైన్యం పనే నిజంగా బీఆర్ నాయుడు భక్తిపరుడే అయితే, ఆయనకు దమ్ముంటే పూర్తి నిడివి గల సీసీ టీవీ ఫుటేజ్‌లు బయటపెట్టాలి. కొటి స్వయంగ మద్యం బాటిళ్లు పెట్టినట్టు చూపించాలని బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడికి సవాల్ విసురుతున్నా. వీడియోలు తీయడానికి ఒంగినప్పడు ఫుటేజ్‌లు కట్ చేసి మాపై బురదజల్లడం సిగ్గుచేటు. ఒకవేళ వారు చెప్తున్నట్టుగా కోటినే మద్యం బాటిళ్లు తీసుకొచ్చి పడేసింది వాస్తవమే అయితే.. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి అన్ని మద్యం బాటిళ్లు అక్కడికి ఎలా తీసుకురాగలిగాడు అనేదానికి కూడా సమాధానం చెప్పాలి. టీటీడీ నిఘా వ్యవస్థ మొత్తం ఏం చేస్తున్నట్టు? ఇదంతా చూస్తుంటే బీఆర్‌నాయుడు ప్రైవేట్ సైన్యమే కొండపై మద్యం తాగి పడేసి ఉంటుందని అనుమానం కలుగుతోంది. వైయస్ఆర్‌సీపీ హయాంలో టీటీడీ పవిత్రతను కాపడితే ఏడాదిన్నరలోనే పూర్తిగా సర్వనాశనం చేశారు. దీనిపై ఎక్కడికి చర్చకు రమ్మన్నా రావడానికి మేం సిద్ధం. నన్ను అక్రమంగా అరెస్ట్ చేయడానికి జరుగుతున్న కుట్రలో భాగంగానే మా పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారు. దానికోసం ఏకంగా చంద్రబాబే రంగంలోకి దిగాడు. ఒకవేళ నన్ను అరెస్ట్ చేసినా ప్రశ్నించడం మాత్రం ఆపేది లేదు. కొండ మీద ఏ అరాచకం జరిగినా భూమన కరుణాకర్ రెడ్డి సైన్యం పనిచేస్తూనే ఉంటుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని హిందూ వ్యతిరేక పార్టీగా ముద్ర వేయాలన్న కుటిల యత్నాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చిన వైయస్ జగన్ సైన్యం గొంతెత్తుతూనే ఉంటుంది. వైయస్ఆర్‌సీపీ పోరాటం ఆపే ప్రసక్తే ఉండదు.