విశాఖపట్నం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి పూర్తిస్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, కార్యకర్తల అభివృద్ధి బాధ్యత పూర్తిగా తనదేనని దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆశీలమెట్టలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీతో కలిసి నిర్వహించిన దక్షిణ నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ శ్రేణుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై కీలక సూచనలు చేశారు. ప్రతి సచివాలయం పరిధిలో తప్పనిసరిగా ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయాలని వాసుపల్లి గణేష్‌కుమార్ ఆదేశించారు. ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్న భరోసా ఇచ్చారు. కార్యకర్తల అభివృద్ధే పార్టీ లక్ష్యమని, వారికి రెండు సెంట్ల భూమి, ఉద్యోగం వంటి అవకాశాలు కల్పించడమే వైయస్ఆర్‌సీపీ ధ్యేయమని తెలిపారు. మళ్లీ రానున్నది వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన ఆయన, గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు సైతం ఇళ్ల మంజూరు చేయించానని గుర్తు చేశారు. నాయకులు మరింత చురుకుగా పనిచేసి, ఒక్క ఫోన్ కాల్‌తో పదివేల మంది కార్యకర్తలను సమీకరించే స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దక్షిణ వైయస్ఆర్‌సీపీ శ్రేణులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.