తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి నిత్యం వైయస్ జగన్ నామాన్ని జపిస్తున్నారని, రామకోటి మాదిరిగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..ఈ ముగ్గురు రోజూ జగన్ కోటి రాస్తున్నారా అన్న అనుమానం కలుగుతోందని కృష్ణా జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య(నాని) పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నుంచి ఆయన అనుచరుల వరకు, అలాగే రామోజీ, రాధాకృష్ణ పత్రికల వరకూ ప్రతిరోజూ ఒక్కటే మాట – జగన్, జగన్ అంటూ జపం అంటూ స్మరిస్తున్నారని ఆక్షేపించారు. జగన్ పేరు వినిపించకుండా రోజు గడవనట్టుగా పరిస్థితి మారిందని, వైయస్ జగన్ అంటే భయంతోనే ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు. వైయస్ జగన్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణే ఈ నిరంతర నామస్మరణకు కారణమని, అందుకే ఆయన పేరును మర్చిపోలేని స్థితిలో ప్రత్యర్థులు ఉన్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు పాలన మొత్తం హడావిడితో కూడిన పబ్లిసిటీ స్టంట్లకే పరిమితమైందని కృష్ణా జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పేరుతో చంద్రబాబు చేసిన హెలికాప్టర్ హడావిడిని దివాళాకోరుతనానికి నిదర్శనంగా అభివర్ణించారు. ప్రెస్‌మీట్‌లో పేర్నినాని ఏమన్నారంటే.. చంద్రబాబుది ప్రచార ఆర్భాటమే ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాకు చంద్రబాబు రూ.3 కోట్ల ప్రజాధనంతో హెలికాప్టర్‌లో వెళ్లి హడావిడి చేశారు. అక్కడ పాస్‌బుక్‌లు పంపిణీ చేయకుండానే రైతులను చేతులు ఎత్తమని అడగడం, రైతులు ‘మాకు ఇవ్వలేదండి’ అని చెప్పడం చంద్రబాబు పాలనా వైఫల్యాన్ని బయటపెట్టింది. ఒక్క రైతుకు పాస్‌బుక్ ఇవ్వడానికి హెలికాప్టర్ ప్రయాణం చేసి ప్రజాధనాన్ని వృథా చేయడం అనవసర ఆర్భాటమే వైయస్ జగన్‌పై విషం చిమ్మడమే పని.. చంద్రబాబు, ఆయన అనుచరులు ప్రతిరోజూ వైయస్ జగన్ పేరును జపం చేస్తున్నారని, పాతేశాం, లేవడు అంటూ మాట్లాడుతూనే భయంతోనే ఆయన పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారు. రామోజీ, రాధాకృష్ణల పత్రికల్లోనూ ప్రతిరోజూ జగన్ పేరే వినిపిస్తోంది. 22ఏ సమస్యలు చంద్రబాబు పాలనలోనే రైతుల భూములను 22ఏలో పెట్టి ఇబ్బందులు పెట్టింది చంద్రబాబు ప్రభుత్వమే. 2018లో వేల ఎకరాల భూములను అక్రమంగా 22ఏ కింద నమోదు చేసి రైతులను నష్టపరిచారు. వైయస్ జగన్ పాలనలో ఒక్క భూమి కూడా 22ఏలో పెట్టలేదు. అన్ని రికార్డులు ఆన్‌లైన్‌లో ఉన్నాయని, అవసరమైతే రెవెన్యూ అధికారుల ముందే చర్చకు సిద్ధం. భూ సర్వే వ్యవస్థ వైయస్ జగన్ తీసుకువచ్చిందే పట్టాదారు పాస్‌పుస్తకాల్లో క్యూఆర్ కోడ్, మ్యాప్, రేఖాంశాలు–అక్షాంశాలు, భూ సరిహద్దుల గుర్తింపు వంటి ఆధునిక వ్యవస్థను వైయస్ జగన్ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. బ్లాక్‌చైన్, క్లౌడ్ వంటి పదాలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు. వైయస్ జగన్ తీసుకువచ్చిన వ్యవస్థనే ఈ ప్రభుత్వం కొనసాగిస్తోంది. జగన్ ఫొటో తీసేయడం తప్ప కొత్తగా చేసింది ఏమీలేదు. కీర్తికాంక్షతో ఫొటో వేసుకున్నాడు ..ఇంతకు మించి వైయస్ జగన్ చేసిన తప్పేంటి? విషం చిమ్మే కార్యక్రమం కట్టిపెట్టండి. గురివింద గింజలా చంద్రబాబు ఈ–సేవా సర్టిఫికెట్లపై తన ఫొటో వేసుకున్న చంద్రబాబు, ఇప్పుడు జగన్ ఫొటోపై అభ్యంతరం చెప్పడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం. క్యూఆర్ కోడ్, భూ మ్యాపింగ్, సర్వే వివరాలు అన్నీ వైయస్ జగన్ హయాంలోనే వచ్చాయి. త్రిబుల్ ఇంజన్ పేరుతో అప్పుల పాలన డబుల్, త్రిబుల్ ఇంజన్ అంటూ చంద్రబాబు సినిమా డైలాగులు చెబుతున్నారు, వాటి వల్ల ప్రజలకు లాభం ఏమీలేదు. వైయస్ జగన్ ఐదేళ్లలో చేసిన అప్పుల కంటే, ఈ ప్రభుత్వం 18 నెలల్లోనే రూ.3 లక్షల కోట్లు అప్పు చేసింది. జగన్ పాలనలో ఇళ్లు, మెడికల్ కాలేజీలు, పోర్టులు, పేదలకు నేరుగా నగదు బదిలీ జరిగింది. నీతులు చెప్పే హక్కు చంద్రబాబుకు లేదు కుటుంబ ఐక్యతపై చంద్రబాబు నీతులు చెబుతూనే, ఎన్టీ రామారావు కుటుంబంతో తగాదాలు పెట్టుకున్న చరిత్ర ఆయనదే. ఎన్టీఆర్ ట్రస్ట్, ఆసుపత్రులు, ఆస్తుల వ్యవహారాలను గుర్తుచేస్తూ చంద్రబాబు ద్వంద్వ వైఖరిని పేర్ని నాని ఎండగట్టారు. కృష్ణా డెల్టా రైతుల హక్కులపై దాడి కృష్ణా నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కులను పక్క రాష్ట్రాలకు గిఫ్ట్‌గా ఇచ్చే హక్కు చంద్రబాబుకు ఎవరు ఇచ్చారు. కృష్ణా డెల్టా రైతుల హక్కులను తాకట్టు పెట్టడం రాష్ట్ర ద్రోహం. రాయలసీమకు తాగునీరు అందించేందుకు ఒక్క టీఎంసీ నీరు ఇవ్వడానికి కూడా చంద్రబాబుకు మనసు లేకపోవడం బాధాకరం. పోలవరం, అమరావతి మాటల్లోనే పోలవరం పూర్తి తేదీలను పదే పదే మార్చుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. లక్షల కోట్ల ఖర్చుల మాటలు చెప్పడం తప్ప అమలు చేసే సామర్థ్యం ఈ ప్రభుత్వానికి లేదు. చంద్రబాబు విషపూరిత రాజకీయాలు మానుకోవాలని, ప్రజలే ఎన్నికల్లో ఆయన తప్పులను లెక్క కట్టి తగిన గుణపాఠం చెబుతారని పేర్ని నాని హెచ్చరించారు. వైయస్ జగన్ ప్రజల పక్షాన నిలబడి బాధ్యతతో మాట్లాడుతున్నారని, ఆ మాటలనే వక్రీకరించి దాడులు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో పనేంటి? వాళ్ల అబ్బాయికి, డిప్యూటీ సీఎం శుక్రవారం ఎప్పుడు చీకటి పడుతుందా? అని చెప్పి ఎందుకు హైదరాబాద్‌కు ఎందుకు వెళ్తున్నారు. జనం సొమ్ముతో ఈ విహార యాత్రలు ఏంటి? నిన్న వైయస్ జగన్ ప్రెస్‌మీట్‌లో చెప్పింది ఏంటి? అసలు విషయాన్ని వదిలిపెట్టి, అక్కడక్కడ పాయింట్లు పట్టుకొని నానాయాగీ చేస్తున్నారు. అమరావతిలో భూములు తీసుకున్న రైతుల సంగతి చూడండి. మళ్లీ 50 వేల ఎకరాలు ఏంటి? అని ప్రశ్నించాడు. ఇది ఏపీ ప్రజలకు గుదిబండ కదా అని ప్రశ్నించాడు. ఇన్ని లక్షల కోట్లతో అమరావతి కట్టేబదులు గుంటూరు– విజయవాడ మధ్యలో సచివాలయం, కోర్టులు, ముఖ్యమంత్రి, గవర్నర్‌బంగ్లా, ఎమ్మెల్యే క్వార్టర్లు కట్టి జోనింగ్ చేస్తే ప్రజలే దాన్ని నిర్మాణం చేసుకుంటారు. విజయవాడ– బందర్, విజయవాడ– ఏలూరు మధ్యలో ఎక్కడొ ఒక చోట కట్టేయవచ్చు కదా అని వైయస్ జగన్ ప్రశ్నించారు. వైయస్ జగన్‌కు అమరావతికి మమకారం లేకపోతే ఎందుకు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు. ఐదేళ్లు ఇక్కడే ఎందుకు ఉన్నారు?.2014లో రాష్ట్రం విడిపోతే, 2025 వరకు ఇక్కడ స్థలం కూడా మీకు లేదు కదా? ఎవరో లింగమనేని రమేష్ ఇంట్లో ఉంటున్నారు కదా?. వైయస్ జగన్ ప్రజలతో బాధ్యతగా ఎలా ఉండాలని చెబితే..మీరు రకరకాలుగా మాట్లాడుతున్నారు. పట్టిసీమ లిప్ట్, కాల్వలకు రూ.1000 కోట్లా?. వరద వచ్చే చోట రాజధాని ఏంటని వైయస్ జగన్ ప్రశ్నిస్తే తప్పా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాల్లో కులం ఊసు తెచ్చింది ఎవరూ? డిప్యూటీ సీఎం పవనే కదా? మతం ఊసు ఎత్తింది ఆయనే కదా? దుర్గమ్మ గుడి మెట్లు కడిగింది ఎవరూ?. ఆయన కాపురం ఆయన చక్కదిద్దుకోలేక మా గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు. పిఠాపురంలో ఫైవ్‌మెన్ కమిటీ ఏర్పాటు చేశారు కదా? ఏం చేశారు. పిఠాపురం ప్రజలంతా పవన్‌కు కాపు కాయాలట. ఆయన వచ్చి ఇక్కడ చంద్రబాబుకు కాపు కాస్తారట. పిఠాపురంలో ప్రజల ఆస్తులను, ఇల్లు, భూములను సముద్రం మింగేస్తుంటే వాళ్లను కాపు కాసేది ఎవరూ. మందుల ఫ్యాక్టరీ నుంచి విషాన్ని ఊర్ల మీదకు వదులుతుంటే వాళ్లను కాపాడేది ఎవరూ. పిఠాపురంలో ఆడపిల్లల మానప్రాణాలకు రక్షణ లేకపోతే వాళ్లను కాపు కాసేది ఎవరూ? దళితలను గ్రామ బహిష్కరణ చేస్తే వాళ్లను కాపు కాసేది ఎవరూ? పవన్ కళ్యాణ్ మాటలు ఇలా ఉంటాయని అందరికీ తెలుసు అని పేర్ని నాని చురకలంటించారు.