వైయస్‌ జగన్‌పై అదే పనిగా వ్యక్తిత్వ హననం

ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్య తీసుకోండి

తాడేపల్లి  పోలీసు స్టేష‌న్‌లో వైయస్ఆర్‌సీపీ ఫిర్యాదు

తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రోజూ అభ్యంతరకమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యాఖ్యలు చేస్తూ, కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్న ఏబీఎన్‌ టీవీ, ఆంధ్రజ్యోతి పత్రిక అదేపనిగా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని వైయస్ఆర్‌సీపీ ఆక్షేపించింది. అందుకే ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ  పార్టీ నేత‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు, పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ ప్రెసిడెంట్‌ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో తగిన ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..:

ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు :కొమ్మూరి కనకారావు, వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.
 
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు జర్నలిస్టు వెంకటకృష్ణపైనా పోలీసులకు ఫిర్యాదు చేశాం. రెండు రోజుల క్రితం వైయ‌స్ జగన్ గారు మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం, భోగాపురం ఎయిర్‌పోర్టు, పరిశ్రమలు, రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై స్పష్టంగా వివరించారు. అయితే ఆ వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తూ, వైయ‌స్ జగన్‌గారు అనని మాటలు అన్నట్లు చూపించడం ద్వారా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ గారు ప్రస్తావిస్తే, దాన్ని పూర్తిగా వక్రీకరించిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఆయనపై విరుచుకు పడుతూ, విచక్షణా రహితంగా కామెంట్‌ చేశాయి. వైయ‌స్ జగన్‌గారిపై వ్యక్తిగత ద్వేషంతో డిబేట్లు పెట్టి అదేపనిగా అక్కసు వెళ్లగక్కడం, నిందించడం, బురద చల్లడం, దుయ్యబట్టడం జర్నలిజమ్‌ విలువలకు పూర్తిగా పాతరేయడమే కాకుండా, అది ప్రజాస్వామ్య విరుద్ధం. చంద్రబాబుపై అంత ప్రేమ ఉంటే, పేపర్, ఛానల్‌కు ఆయన పేరు, ఫోటో పెట్టుకోవాలి. అంతే తప్ప, న్యూట్రల్‌ జర్నలిజమ్‌ పేరుతో అంత దిగజారి వ్యవహరించొద్దు. అందుకే ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం.

వాస్తవాలు ప్రస్తావిస్తే.. దుయ్యబడతారా? :అంకంరెడ్డి నారాయణమూర్తి, వైయస్ఆర్‌సీపీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు.
రాజధాని పేరుతో రైతుల నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికీ వారికి స్పష్టత ఇవ్వలేకపోతోంది. తమకు ఇచ్చిన ప్లాట్లు అసలు ఎక్కడున్నాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో రైతు రామారావు గుండెపోటుతో మరణించాడు. ఈ వాస్తవాలను జగన్‌గారు ప్రశ్నిస్తే.. ఆయన అనని మాటలు అన్నట్లు, పూర్తిగా వక్రీకరిస్తూ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి విషం చిమ్మాయి. తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, వైయ‌స్ జగన్‌గారిని నిందించాయి. వైయ‌స్ జగన్ గారు విశేష ప్రజాదరణ ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అన్న విషయాన్ని కూడా మర్చి, విషం చిమ్ముతూ గతి తప్పి విపరీతంగా వ్యాఖ్యలు చేశాయి. రాజధాని ప్రాంతంలో తగిన నిర్మాణాలు, ఎలాంటి అభివృద్ధి లేకపోయినా వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. దాన్ని ప్రశ్నించడం తప్పా? ఆ ప్రాంత రైతుల సమస్యలు ప్రస్తావించడం నేరమా?. వాటికి ప్రభుత్వం తరపున ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వకాల్తా పుచ్చుకుని, తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, వైయ‌స్ జగన్‌గారిపై విరుచుకు పడడం, పాతాళానికి దిగజారిన వారి జర్నలిజమ్‌ విలువలను చూపుతోంది. అందుకే మీడియా ముసుగులో వారు చేస్తున్న అనైతిక పనులపై తగిన చర్య తీసుకోవాలని ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై ఇక్కడ తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో పూర్తి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. ఇంకా ఈ విషయాన్ని ప్రెస్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తాం.

Back to Top