ప్రచారానికే ప్రాధాన్యం… పవిత్రతకు విలువ లేదా?

కనకదుర్గ ఆలయంలో వరుస అపశృతులపై వైయ‌స్ఆర్‌సీపీ నేత పోతిన వెంక‌ట మ‌హేష్ మండిపాటు

విజయవాడ: ప్రచార ఆర్భాటానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ, హిందూ దేవాలయాల పవిత్రతను పూర్తిగా విస్మరిస్తోందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ మండిప‌డ్డారు. కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరుసగా జరుగుతున్న అపశృతులు, అపచారాలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేర‌కు శ‌నివారం ఆయ‌న ఓ వీడియోలో ప్ర‌భుత్వ విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. అమ్మవారి ఆలయంలో తక్షణమే శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేసిన ఆయన, వైదిక కమిటీ, ఆలయ సెక్యూరిటీ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. తనిఖీలు గాలికి వదిలేశారా? అన్నదే భక్తుల్లో ప్రధాన సందేహంగా మారిందన్నారు. చక్ర నవావరణార్చన వంటి విశిష్ట పూజల్లో ఆవు పాలు ఉపయోగించాల్సి ఉండగా, టెట్రాప్యాక్ పాలు వాడటం ఏ విధమైన ఆచారమని ప్రశ్నించారు. విశిష్ట పూజలకు వినియోగించే పాలల్లో పురుగులు కనిపించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.

కనకదుర్గ ఆలయంలో చోటుచేసుకున్న ఘటనలు:

  • కరెంట్ బిల్లులు చెల్లించలేదని విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అమ్మవారికి చీకట్లోనే నైవేద్యం సమర్పించే దుస్థితి రావడం.
  • అన్నప్రసాదంలో పనిచేసే కార్మికులకు రోజువారీ వేతనాలు తక్కువగా చెల్లిస్తున్నారని ఆలయంలోనే ఆందోళన జరగడం.
  • విశిష్ట పూజలకు ఉపయోగించే పాలల్లో పురుగులు ఉండటం.
  • అమ్మవారి గర్భగుడికి అతి సమీపంలోనే కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం.
  • ఈ ఘటనలు ఒక్క కనకదుర్గ ఆలయానికే పరిమితం కాదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో అపశృతులు, ప్రమాదాలు పెరిగిపోయాయని పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అవినీతి ఫలితమేనని స్పష్టం చేశారు.

అమ్మవారి ఆలయంలో కమిషనర్ కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించినా, ఈఓ మాత్రం కాంట్రాక్టర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయాలను స్టాండింగ్ కౌన్సిల్, అసిస్టెంట్ కమిషనర్ కోర్టుకు నిజాయితీగా ఎందుకు తెలియజేయడం లేదని ప్రశ్నించారు. తిరుమల విషయానికొస్తే, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్కడ కూడా వరుస అపచారాలు జరుగుతున్నాయని విమర్శించారు. మద్యం, మాంసాహారం, చెప్పులు వేసుకుని ఆలయ పరిధిలోకి వెళ్లడం, తొక్కిసలాట ఘటనలు, మరణాలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి ఆలయ అధికారుల తీరుకు నిరసనగా రాజీనామా చేయడం, కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. హిందూ దేవాలయాల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని దేవాలయాల పవిత్రత, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని వైయ‌స్ఆర్‌సీపీ నేత పోతిన వెంక‌ట మ‌హేష్‌ డిమాండ్ చేశారు.

Back to Top