నెల్లూరు జిల్లా: ఆత్మకూరు నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ సంస్థాగత కమిటీని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఏర్పాటు చేశారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, జిల్లా పార్లమెంట్ పరిశీలకులు జంకె వెంకటరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే పార్టీ ముఖ్య అజెండా అని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో జగనన్న 2.0 ద్వారా కార్యకర్తలకు అత్యంత గౌరవంతో కూడిన పరిపాలన కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూ లేని విధంగా దారుణ పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. కూటమి నాయకులకు పోలీసులు దగ్గరుండి ఫ్లెక్సీలు కట్టిస్తున్నారని, అదే సమయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్లెక్సీలను మాత్రం వారే దగ్గరుండి తొలగిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో మంచిని చెడుగా, తాను చేసిన చెడును మంచిగా చెప్పుకోవడం వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడం, అసత్యాల ప్రచారాలు చేయడంలో చంద్రబాబు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ల్యాండ్ టైటిలింగ్ విషయంలోవైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన పాస్‌బుక్కులపై టీడీపీ నాయకులు దుష్ట ప్రచారం చేస్తున్నారని, అదే పథకాన్ని ఇప్పుడు అట్టలు మార్చి తాము కనిపెట్టినట్టుగా కథనాలు జోడిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎంత కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న దుష్ట ప్రచారాలను వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో వంద సంవత్సరాల బ్రిటిష్ పాలన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు.