నంద్యాల జిల్లా : పాణ్యం నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని వైయస్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి నిర్వహించారు. కల్లూరు అర్బన్ 35వ వార్డు పరిధిలోని ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఈ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణ కార్యక్రమాన్ని సమగ్రంగా, క్రమపద్ధతిగా, పారదర్శకంగా పూర్తి చేయడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. పాణ్యం నియోజకవర్గంలో ప్రతి గ్రామం, వార్డు, డివిజన్ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత కల్పించి, కష్టపడి పనిచేసే వారికి మంచి అవకాశాలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. లక్షల సంఖ్యలో పార్టీ కమిటీల నిర్మాణం జరుగుతున్న ఈ సమయంలో, నిర్దిష్ట కాలపరిమితిలో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలని, సమర్థులైన నాయకులందరికీ సముచితమైన అవకాశాలు కల్పించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, పాణ్యం నియోజకవర్గ అబ్జర్వర్ సూర్యప్రకాష్ రెడ్డి, నంద్యాల మేయర్ బి.వై. రామయ్య, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక పాల్గొన్నారు. అలాగే వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లు, నియోజకవర్గ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మండల కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపి, పాణ్యం నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ సంస్థాగత బలోపేతానికి కీలకంగా నిలిచింది.