ఫసల్‌ బీమా జాబితాలో ఏపీ ఔట్‌..! 

‘ఉచితం’ పోయింది.. ‘స్వచ్ఛందం’ బూటకం   

చంద్రబాబు సర్కారు నిర్వాకాలు అన్నదాతల పాలిట శాపాలు 

ఏపీని బ్లాక్‌లో పెట్టేసిన ఇన్సూరెన్స్‌ కంపెనీలు

ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో బీమాకు ‘నో’ 

ప్రస్తుత రబీ సీజన్‌లో స్వచ్ఛంద నమోదు పోర్టల్‌ను ఓపెన్‌ చేయని కంపెనీలు 

మన రైతులు ప్రీమియం చెల్లించేందుకు కూడా అవకాశం ఇవ్వని వైనం 

గద్దెనెక్కగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించిన చంద్రబాబు సర్కార్‌ 

రైతులను భాగస్వామ్యం చేసేందుకు అంటూ తెరపైకి స్వచ్ఛంద పంటల బీమా 

ఏడాది తిరగకుండానే స్వచ్ఛంద బీమాకూ పాడెకట్టిన బాబు సర్కారు 

రైతులకు రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం ఎగనామం

వైఎస్‌ జగన్‌ హయాంలో రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకం అమలు

రికార్డు స్థాయిలో ఐదేళ్లలో 54.55 లక్షల మందికి రూ.7,802.08 కోట్ల బీమా అందజేత

ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన 

34.41 లక్షల మంది రైతులకు మరో రూ.3,261.60 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు  

నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పి.లింగాపురం గ్రామానికి చెందిన శేఖర్‌రెడ్డి గత ఖరీఫ్‌లో 8 ఎకరాల్లో మొక్కజొన్న, 4 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అప్పులు చేసి రూ.4.40 లక్షలు పెట్టుబడి పెట్టారు. అధిక వర్షాలకు తోడు మద్దతు ధరలు లేకపోవడంతో రూ.3 లక్షలకు పైగా నష్టపోయాడు. ఆర్థిక ఇబ్బందులతో పత్తికి రూ.6 వేలు బీమా ప్రీమియం చెల్లించినా ప్రభుత్వం తన వాటా డబ్బులు కట్టకపోవడంతో రైతుకు పైసా కూడా పరిహారం అందలేదు. ఇదే రైతు పైసా ప్రీమియం చెల్లించకపోయినా వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.50 వేల వరకు బీమా పరిహారం అందిందని, సీజన్‌ ముగియకుండానే ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇచ్చారని గుర్తు చేసుకుంటు­న్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని విధాలుగా నష్టపోయామని ఆక్రోశిస్తున్నారు.  

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జాప్ల తండాకు చెందిన నారాయణ నాయక్‌ 8 ఎకరాల్లో వేరుశనగ, కంది, మిరప, ఉల్లి పంటలు సాగు చేశారు. ప్రీమియం భారం కావడంతో ఏ ఒక్క పంటకూ బీమా చేసుకోలేకపోయారు. ఈ ఏడాది అధిక వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. బీమా పరిహారం కాదు కదా.. కనీసం నష్టపరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) కూడా అందలేదు. ఉచిత పంటల బీమా పథకం పుణ్యమాని జగన్‌ ప్రభుత్వంలో పైసా ప్రీమియం చెల్లించకపోయినా ఐదేళ్లలో రూ.1.50 లక్షల వరకు లబ్ధి పొందానని చెబుతున్నారు. తమ  గ్రామంలో 60 శాతం మంది రైతులకు రూ.2 లక్షలకు పైగా ప్రయోజనం పొందారని వెల్లడించారు.  ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడంతో సీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, చంద్రబాబు ప్రభుత్వంలో తీరని అన్యాయం జరుగుతోందని మండిపడుతున్నారు.  

అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను ఎగరగొట్టిన చంద్రబాబు సర్కారు.. ఏడాది తిరగకుండానే ’స్వచ్ఛంద పంటల బీమా’ పథకానికి సైతం మంగళం పాడేసింది! ప్రీమియం బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు సర్కార్‌ చేతులెత్తేయడంతో జాతీయ స్థాయిలో ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టేశాయి. ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులు కనీసం స్వచ్ఛందంగా ప్రీమియం చెల్లించేందుకు కూడా అనుమతించడం లేదు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పోర్టల్‌ను ఓపెన్‌ చేసేందుకు సైతం నిరాకరించాయి. దేశవ్యాప్తంగా ఏపీ పరువును మంటగలిపిన చంద్రబాబు సర్కారు రైతులకు పంటల బీమాను పూర్తిగా దూరం చేసింది.

ఉచిత పంటల బీమాను అటకెక్కించి..
వైఎస్సార్‌సీపీ హయాంలో ఐదేళ్ల పాటు పైసా కూడా భారం పడకుండా రైతులకు అండగా నిలిచిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు సర్కారు అధికార పగ్గాలు చేపట్టగానే అటకెక్కించేసింది. ఉచిత పంటల బీమాను ఎగరగొట్టేసి.. 2024 రబీ సీజన్‌ నుంచి స్వచ్ఛంద నమోదు బీమా పథకాన్ని తెరపైకి తెచ్చింది. రైతులను భాగస్వామ్యం చేయడం ద్వారా మెరుగైన రీతిలో పంటల బీమా అమలు కోసమే ఈ పథకాన్ని తెచ్చామంటూ నమ్మబలికింది. అయితే ప్రీమియం భారం భరించలేక 80 శాతానికి పైగా రైతన్నలు పంటల బీమాకు దూరమైపోయారు. రబీ 2024–25 సీజన్‌ నుంచి శ్రీకారం చుట్టిన స్వచ్ఛంద బీమా పథకంలో చేరేందుకు ప్రీమియం భారం కారణంగా రైతన్నలు ఆసక్తి చూపకపోవడంతో 48 లక్షల ఎకరాలకు గానూ 9.92 లక్షల ఎకరాలలోసాగైన పంటలకు మాత్రమే బీమా కవరేజ్‌ దక్కింది. 40 లక్షల మంది రైతులకుగానూ 7.64 లక్షల మంది మాత్రమే బీమా చేయించుకోగలిగారు. ఇక ఖరీఫ్‌ 2025 సీజన్‌లో దాదాపు 72.90 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా 19.58 లక్షల ఎకరాలకే బీమా కవరేజ్‌ లభించింది. దాదాపు 50 లక్షల మంది రైతులు పంటలు సాగు చేయగా కేవలం 19.40 లక్షల మంది మాత్రమే పంటలకు బీమా ప్రీమియం చెల్లించగలిగారు.

ప్రభుత్వ వాటా చెల్లించకపోవడంతో.. 
ఉచిత పంటల బీమాకు సంబంధించి ఖరీఫ్‌–2024 సీజన్‌లో రైతుల వాటాతో కలిపి ప్రభుత్వం రూ.834.44 కోట్లు బీమా కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. ఇక స్వచ్ఛంద బీమా అమలులోకి వచ్చిన తరువాత ప్రభుత్వ వాటా కింద రబీ–2024 సీజన్‌లో రూ.88.07 కోట్లు. ఖరీఫ్‌–2025 సీజన్‌కు రూ.172.60 కోట్లు చెల్లించాలి. అంతేకాదు.. 2023–24 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి జూన్‌ 2024 తర్వాత చెల్లించాల్సిన రూ.1,324.33 కోట్ల ప్రీమియం బకాయిలు చంద్రబాబు సర్కార్‌ ఎగనామం పెట్టింది. ప్రభుత్వ వాటా ప్రీమియం డబ్బులు చెల్లించకపోవడంతో రైతులకు పరిహారం దక్కని దుస్థితి నెలకొంది. 

రూ.3,500 కోట్ల బీమా పరిహారానికి దూరం.. 
చంద్రబాబు గద్దెనెక్కింది మొదలు ప్రతి సీజన్‌లోనూ కరువు కాటకాలు సంభవించడంతో పాటు మద్దతు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరొకవైపు అకాల వర్షాలు, ముంచెత్తిన వరదలతో పంటలు దెబ్బతిన్నాయి. అదే.. ఉచిత పంటల బీమా పథకం అమలులో ఉండి ఉంటే... సకాలంలో చంద్రబాబు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం వాటా కట్టి ఉంటే 2023–24, 2024–25 వ్యవసాయ సీజన్లకు సంబంధించి కనీసం రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం అన్నదాతలకు అంది ఉండేది. 

చంద్రబాబు ప్రభుత్వం ప్రీమియం బకాయిలు చెల్లించని కారణంగా ప్రస్తుతం రబీ సీజన్‌లో కనీసం బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు కూడా ఇన్సూరెన్స్‌ కంపెనీలు ముందుకు రాలేదు. ఏపీలో తాము ఫసల్‌ బీమాలో చేరబోమని తెగేసి చెప్పాయి. ఒక విధంగా చెప్పాలంటే.. ఏపీని పూర్తిగా బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టేశాయని పేర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో ఫసల్‌ బీమా పరిధిలోకి వచ్చే రాష్ట్రాల జాబితా నుంచి ఏపీని తొలగించాయి. దీంతో ప్రస్తుత రబీ సీజన్‌లో కనీసం పోర్టల్‌ కూడా తెరవలేదు. చంద్రబాబు సర్కారు నిర్వాకాల ఫలితంగా.. రుణాలు పొందని రైతులే కాదు, రుణాలు తీసుకునేవారు కూడా పంటలకు ప్రీమియం చెల్లించేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో గడిచిన రబీ సీజన్‌లో తెరపైకి తెచ్చిన స్వచ్ఛంద నమోదు పంటల బీమా పథకం ఏడాది తిరక్కుండానే అటకెక్కినట్లైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులను పంటల బీమా పరిధిలోకి రాకుండా చంద్రబాబు ప్రభు­త్వం దగా చేసింది. కనీసం ఇన్‌పుట్‌ సబ్సిడీ అయినా సకాలంలో ఇచ్చిందా.. అంటే అదీ లేదు. 19 నెలల్లో కరువు బకాయిలతో సహా రూ.1,100 కోట్లకు పైగా ఎగనామం పెట్టింది.

వైఎస్‌ జగన్‌ హయాంలో పైసా భారం పడకుండా..  
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2019–24 మధ్య రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయడమే కాదు.. ఏ సీజన్‌కు చెందిన బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్‌ ముగిసేలోగా జమచేసి అండగా నిలిచింది. దేశంలో మరెక్కడాలేని విధంగా ఈ – క్రాప్‌ నమోదే ప్రామా­ణికంగా నోటిఫై చేసిన పంటలకు యూనివర్శల్‌ కవరేజ్‌ కల్పించింది. ఈ – క్రాప్‌ ప్రామాణికంగా ఏటా సగటున 1.08 కోట్ల ఎకరాల చొప్పున ఐదేళ్లలో 5.42 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్‌ కల్పించింది. ఏటా సగటున 50 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో రెండున్నర కోట్ల మంది రైతులకు బీమా రక్షణ దక్కింది. 

ప్రభుత్వ వాటాతో పాటు రైతుల తరపున రూ.3,022.26 కోట్లను ప్రీమియం రూపంలో కంపెనీలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం  చెల్లించింది. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో 30.85 లక్షల మందికి కేవలం  రూ.3,411.20 కోట్ల మేర బీమా పరిహారం మాత్రమే అందిస్తే.. 2019–24 మధ్య వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 54.55 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.7,802.08 కోట్ల మేర పరిహారాన్ని అందజేసి ఆదుకుంది. ఇక వైపరీత్యాల వేళ పంటలు దెబ్బతిని నష్టపోయిన 34.41 లక్షల మంది రైతులకు మరో రూ.3,261.60 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ (పంట నష్ట పరిహారం) జమ చేసింది. ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి సంబంధించిన ఇన్‌పుట్‌ సబ్సిడీని అదే సీజన్‌ ముగిసేలోగానే జమ చేసి అన్నదాతలకు ప్రతి అడుగులో తోడుగా  నిలిచింది.

జగన్‌ ప్రభుత్వంలో రూ.50 వేల నష్టపరిహారం వచ్చింది  
2022–23లో సుమారు 10 ఎకరాల్లో మిర్చి, పత్తి సాగు చేశా. అప్పట్లో వచ్చిన తుపాన్‌తో పంటలు దెబ్బతిని దిగుబడులు రాలేదు. నాటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా అమలులో ఉండటంతో అదే సీజన్‌లో నా అకౌంటులో సుమారు రూ.50 వేలు పంట నష్టపరిహారం అందింది. దీంతో నేను కోలుకుని మళ్లీ పంటలు సాగు చేసుకోగలిగా.  
    – రామిరెడ్డి, రైతు, బొడిచర్ల, మార్కాపురం మండలం,మార్కాపురం జిల్లా

బాబు ప్రభుత్వం నిలిపేసింది... 
20 ఎకరాల్లో వేసిన మిరప పంట అధిక వర్షాలతో దెబ్బతినగా వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.2.80 లక్షల బీమా పరిహారం వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేసింది. రైతులే కట్టుకోవాలన్నారు. ప్రీమియం భారం కావడంతో చెల్లించలేదు. ఖరీఫ్‌–24లో మిరప పంట దెబ్బతింది.. కానీ పైసా పరిహారం రాలేదు.  
    – గరికిపాటి పున్నారావు, చిననందిపాడు, పర్చూరు మండలం, బాపట్ల జిల్లా

ఉచిత పంటల బీమాతో భరోసా.. 
నాకు 2.50 ఎకరాలు పొలం ఉంది. వరి సాగు చేస్తున్నా. రెండేళ్లుగా వరుస వైపరీత్యాల వలన పంట దెబ్బ తినడంతో దిగుబడులు తగ్గిపోయాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో పైసా ప్రీమియం చెల్లించ కుండానే బీమా పరిహారం జమ చేసేవారు. ఉచిత పంటల బీమాతో భరోసాగా ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడంతో రైతులకు బీమా దూరమైంది. ఆర్థిక భారం తట్టుకోలేక నేను ప్రీమియం చెల్లించలేదు. ప్రీమియం చెల్లించిన రైతులకు సైతం రెండేళ్లుగా పరిహారం అందలేదు. ఆర్థికంగా చాలా నష్టపోయా. 
    –కె.పెంచలయ్య, నెల్లిపూడి గ్రామం, వాకాడు మండలం, తిరుపతి జిల్లా 

జగన్‌ హయాంలో రూ.2 లక్షల బీమా పరిహారం 
2021లో అధిక వర్షాలకు పంట నష్టం జరగడంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో  ఉచిత పంటల బీమా పథకం కింద పెద్ద మొత్తంలో పరిహారం అందించారు. ఐదు ఎకరాల్లో మిరప దెబ్బ తినడంతో ఉచిత పంటల బీమా కింద రూ.2 లక్షల పరిహారం జమ అయ్యింది. అంత మొత్తంలో పరిహారం వస్తుందని ఊహించలేదు. దీంతో పాటు అంతో ఇంతో పంట కూడా చేతికివచ్చింది. నాతో పాటు మా మండలంలోని మిరప రైతులకు లక్షలాది రూపాయల పరిహారం అందింది. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమా ఎత్తేసి ప్రీమియం భారం మోపడంతో రైతులు ఆసక్తి చూపించడం లేదు. ఇప్పుడు బీమా పథకాలు సక్రమంగా అమలు చేయడం లేదు. 
    – అశోక్‌రెడ్డి, రైతు, గడేకల్లు, విడపనకల్లు మండలం, అనంతపురం జిల్లా  

Back to Top