అక్రమ కేసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

తిరుపతి :  వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల‌పై న‌మోదైన అక్ర‌మ కేసుల‌పై ఎంపీ గురుమూర్తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిరుప‌తి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో నమోదైన కేసులపై తిరుపతి ఎంపీ స్పందించారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరైన ఆయన అక్కడి నుంచే మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుబట్టారు. తిరుపతిలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలపై దాడులు జరిగినప్పటికీ, దాడి చేసిన వారిని వదిలిపెట్టి బాధితులపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం అన్యాయమని గురుమూర్తి అన్నారు. చట్టాన్ని వక్రీకరించి రాజకీయ కక్ష సాధింపులకు ఉపయోగించడం తగదని స్పష్టం చేశారు.

అలాగే సూళ్లూరుపేట నియోజకవర్గంలోని కలవకూరు గ్రామంలో ఇసుక అక్రమ రవాణాపై ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పై కేసు నమోదు చేయడం దుర్మార్గమని విమర్శించారు. మాజీ డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులను రిమాండ్‌కు పంపడాన్ని కూడా ఖండించారు.
పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం చేస్తూ, ఇటువంటి చర్యలను ఏ మాత్రం సహించబోమని ఎంపీ హెచ్చరించారు. అక్రమ కేసులు నమోదు చేసే అధికారులను కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. అన్యాయంగా నమోదైన కేసులను న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొని బాధితులకు న్యాయం చేస్తామని గురుమూర్తి తెలిపారు. నిజమైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం చేయడంలో విఫలమవుతూ, రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాన్ని దుర్వినియోగం చేయడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అక్రమ కేసుల్లో అరెస్టు అయిన వారందరికీ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని, న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఎంపీ గురుమూర్తి కోరారు.

Back to Top