తాడేపల్లి: అమరావతి పేరుతో వేల కోట్ల దోపిడీ జరుగుతుందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గారు ఇటీవల మీడియా సమావేశంలో అడిగిన న్యాయమైన ప్రశ్నలకు అసభ్య వ్యాఖ్యలతో కాకుండా, స్పష్టమైన వాస్తవాలతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి రైతుల సమస్యలు, వేల కోట్ల ఖర్చులు వంటి కీలక అంశాలపై వైయస్ జగన్ లేవనెత్తిన ప్రశ్నల నుంచి తప్పించుకోకుండా ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుందో.. అమరావతి ముంపు ప్రాంతం కాకుండా ఉండేందుకు లిఫ్ట్‌లు, రిజర్వాయర్ల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, కానీ చివరకు అమరావతి పేరుమీద ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని నిర్మాణంలో ప్రధాన భాగస్వాములైన రైతుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం దారుణమన్నారు. అమరావతిలో రైతులే టాప్ ప్రాయారిటీ అని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కొందరు మీడియా సంస్థలు, కూటమి నేతలు కుక్కల మాదిరిగా అరిచి జగన్ గారిపై విరుచుకుపడ్డారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అడిగినవి ప్రశ్నలే… తప్పులేంటి? మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అమరావతిపై వైయస్ జగన్ గారు మాట్లాడారని సజ్జల తెలిపారు. తొలి దశలో తీసుకున్న 50 వేల ఎకరాల భూములకు ఇప్పటివరకు రైతులకు న్యాయం జరగలేదని జగన్ ప్రశ్నించారని గుర్తు చేశారు. రోడ్లు లేవు, కనెక్టివిటీ లేదు, ప్లాట్లకు డెవలప్‌మెంట్ లేదు. ఇవేవీ చేయకుండా రెండో దశ భూ సమీకరణకు ఎందుకు వెళ్తున్నారని అడగడం తప్పా? అని ప్రశ్నించారు. చంద్రబాబు సృష్టించిన అమరావతి సమస్యల వల్ల రైతుల ప్రాణాలే పోతున్నాయని, రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు చెరువుల్లో ఇచ్చారన్నది వాస్తవం కాదా? అని జగన్ ప్రశ్నించారని తెలిపారు. డెవలప్ చేయని ప్లాట్లు ఎవరు కొనుగోలు చేస్తారని అడగడంలో తప్పేముందని సజ్జల నిలదీశారు. వేల కోట్ల అప్పులు… రైతులకు న్యాయం లేదు గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం అమరావతిపై ఖర్చు చేసింది కేవలం రూ.5 వేల కోట్లే అని సజ్జల చెప్పారు. తొలి దశనే పూర్తి చేయాలంటే లక్ష కోట్లకు పైగా ఖర్చవుతుందని, ఈ వేగంతో వెళ్తే ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందన్న ప్రశ్న జగన్ లేవనెత్తారని అన్నారు. ఇప్పటికే అమరావతి పేరుతో రూ.40 వేల కోట్లకు పైగా అప్పులు తెచ్చారని, కానీ ఆ డబ్బు కూడా ప్రాధాన్య పనులపై ఖర్చు పెట్టడం లేదని విమర్శించారు. రైతుల సమస్యలు తీర్చకుండా అనవసర ఖర్చులతో రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. సచివాలయం, భవనాల పేరుతో దోపిడీ 50 లక్షల చదరపు అడుగుల సచివాలయం అవసరమా? అని సజ్జల ప్రశ్నించారు. తెలంగాణలో కేవలం 10 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం నిర్మించారని, కానీ అమరావతిలో చదరపు అడుగుకు రూ.10 వేలకుపైగా ఖర్చు చేస్తున్నారని అన్నారు. దేశ నూతన పార్లమెంట్ భవనం సుమారు 7 లక్షల చదరపు అడుగుల్లో ఉంటే, ఇక్కడ 11 లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తామంటూ ఖర్చులు పెంచుతున్నారని ఆరోపించారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరుతో కమీషన్లు నొక్కేస్తున్నారని విమర్శించారు. అమరావతి..మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ రాయలసీమ లిఫ్ట్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు నానా వక్రీకరణలకు పాల్పడుతున్నారని సజ్జల అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై ఇప్పటివరకు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పలేదని, దాన్ని వదిలేసి జగన్ గారిపై అసభ్యంగా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని చంద్రబాబు ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’గా మార్చారని ఆరోపించారు. అమరావతి ప్రాంతానికి వైయస్ జగన్ గారు ఎప్పుడూ వ్యతిరేకం కాదని, అక్కడ కూడా అభివృద్ధి జరగాలని కోరుకున్నారని గుర్తు చేశారు. 2019కి ముందే వైయస్ జగన్ గారు అక్కడ ఇల్లు, పార్టీ కార్యాలయం కట్టారని, రాజధానిగా ప్రకటించిన తర్వాత అక్కడే నివసించారని చెప్పారు. ఇప్పటివరకు చంద్రబాబు అక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదని, అక్రమ నివాసమే మరో స్కామ్ అని విమర్శించారు. ప్రశ్నల నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు అమరావతి పేరుతో తెచ్చిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయో తెలియడం లేదని సజ్జల అన్నారు. మూడు నాలుగు కంపెనీలకే అన్ని పనులు కట్టబెట్టి, 4 శాతం ఎక్సెస్‌కు ఇచ్చారని ఆరోపించారు. గతంలో ఐటీ కేసులు ఎదుర్కొన్న కంపెనీలకే ఇప్పుడు పనులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు చెరువుల్లో ప్లాట్లు ఇచ్చిన వాస్తవాలపై, గుండెపోటుతో కుప్పకూలిన రైతు అంశంపై చంద్రబాబు నుంచి సమాధానం లేదని తెలిపారు. ఈ స్కామ్లను ప్రశ్నించడం తప్పా? అదే పని జగన్ గారు చేశారని స్పష్టం చేశారు. వాస్తవిక దృక్పథంతో సమాధానం చెప్పాలి రాజధాని ఎంపిక సమయంలోనే ప్రభుత్వ భూములు ఉన్న ప్రాంతంలో, రాష్ట్రానికి భారం కాని విధంగా రాజధాని ఉండాలన్న సూచన జగన్ గారు చేశారని సజ్జల గుర్తు చేశారు. పదేళ్లు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉన్నా, ఎందుకు వదిలేసి వచ్చారని ప్రశ్నించారు. ఆ సమయంలోనే రాజధాని నిర్మాణం పూర్తి చేసుకోవచ్చుకదా? అని నిలదీశారు. అమరావతి ముంపు ప్రాంతం కాకపోతే లిఫ్ట్‌లు, రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నారన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ–గుంటూరు మధ్య రాజధాని పెడితే సహజంగా అభివృద్ధి జరుగుతుందని, రాష్ట్రానికి పెద్ద భారం ఉండదని జగన్ గారు సూచించారని తెలిపారు. ప్రజలను దృష్టిలో పెట్టుకుని వైయస్ జగన్ అడిగిన ఈ ప్రశ్నలకు బూతులతో కాదు, వాస్తవాలతో చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందేనని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.