పార్టీ పటిష్టతకు అనుబంధ సంఘాలు, కమిటీల నిర్మాణం కీలకం

కాలపరిమితిలో పూర్తి చేసి డిజిటలైజేషన్ చేయాలి 

 మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు దిశానిర్దేశం

గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ సమావేశం 

గుంటూరు: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని బలమైన సంస్థాగత నిర్మాణంతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా అనుబంధ సంఘాలు, వివిధ కమిటీలను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేసి డిజిటలైజేషన్ చేయాలని పార్టీ అధ్యక్షుడు  శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా నియమించిన టాస్క్ ఫోర్స్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో అంబ‌టి రాంబాబు మాట్లాడుతూ..పార్టీ అనుబంధ సంఘాలు, కమిటీల నిర్మాణాన్ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు నిర్దేశించిన కాలపరిమితిలో పూర్తి చేస్తే పార్టీ మరింత పటిష్టంగా తయారవుతుందని తెలిపారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పార్టీని, ప్రభుత్వాన్ని అనుసంధానం చేసి ఎలా రెండోసారి అధికారంలోకి తీసుకువచ్చారో అదే ఆదర్శంగా తీసుకొని జగన్ 2.0 ప్రభుత్వ ఏర్పాటుకు ఈ సంస్థాగత నిర్మాణం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కార్యకర్తలను గుర్తించి వారికి వివిధ బాధ్యతలు, పదవులు ఇవ్వడం, కమిటీలను డిజిటలైజేషన్ చేయడం ద్వారా రాబోయే వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వంలో వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పించాలన్నదే పార్టీ అధ్యక్షుడి ఆశయమని చెప్పారు. ఆ దిశగా ఇప్పటి నుంచే పథకబద్ధంగా ముందుకు సాగడమే ఈ సంస్థాగత నిర్మాణాల లక్ష్యమని స్పష్టం చేశారు.

పొన్నూరు నియోజకవర్గంలో ఇప్పటికే ఎక్కువ భాగం అనుబంధ సంఘాలు, కమిటీల నియామక ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిందని, డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అంబటి మురళీకృష్ణ తెలిపారు. గత ఏడాదిన్నర కాలంలో స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చేపట్టిన అరాచకాలు, పోలీసుల ద్వారా జరిగిన దౌర్జన్యాలను పార్టీ కార్యకర్తలు తన వెనుక నిలబడి ధైర్యంగా ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అనుబంధ సంఘాల కమిటీలు పూర్తిగా ఏర్పాటు అయితే ఈ నిరంకుశత్వానికి మరింత బలంగా ఎదురుదాడి చేయగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా పార్టీ పరిశీలకులు  పోతిన మహేష్, అనుబంధ విభాగ కమిటీల టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే  టీజేఆర్ సుధాకర్ బాబు, తెనాలి, మంగళగిరి, తాడికొండ, గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు నియోజకవర్గాల సమన్వయకర్తలు అన్నబత్తిన శివకుమార్,  దొంతిరెడ్డి వేమారెడ్డి,  వనమా బాల వజ్ర బాబు,  బలసాని కిరణ్ కుమార్,  నూరి ఫాతిమా తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Back to Top