ఉప్పలపాడు హైవే వద్ద పోలీసుల ఓవరాక్షన్

సోమశిల జలాశయ పరిశీలనకు వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

నెల్లూరు జిల్లా: అనంతసాగరం మండలం ఉప్పలపాడు హైవే వద్ద పోలీసుల ఓవరాక్షన్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సోమశిల జలాశయాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. సోమశిల జలాశయ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను పరిశీలించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు బయలుదేరగా, ఉప్పలపాడు హైవే వద్ద పోలీసులు వారిని ఆపి ముందుకు వెళ్లకుండా నిలువరించారు. ప్రజా సమస్యలపై పరిశీలన చేయడానికే వెళ్తున్నామని నేతలు వివరణ ఇచ్చినా, పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకోవడం తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రజల సమస్యలపై మాట్లాడటం, పరిశీలన చేయడం ప్రజాస్వామ్య హక్కు అని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షంపై పోలీసుల ద్వారా ఆంక్షలు, వేధింపులు పెరిగిపోయాయని ధ్వ‌జ‌మెత్తారు. సోమశిల జలాశయం రాష్ట్రానికి కీలకమైన ప్రాజెక్ట్ అని, అక్కడి పరిస్థితులను తెలుసుకోవడం ప్రజల పట్ల బాధ్యత అని కాకాణి పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని విమర్శించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, పోలీసుల తీరుపై స్పష్టత ఇవ్వాలని, ప్రజాస్వామ్య హక్కులను హరించే విధంగా వ్యవహరించవద్దని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ప్రయత్నాలు కొనసాగితే, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

Back to Top