కర్నూలు: కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఎన్నికల్లో మభ్యపెట్టి మోసం చేస్తోందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఏలు, ఐఆర్‌ను ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు విడుదల చేయలేదని ఆమె విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. శుక్రవారం కర్నూలులో మీడియాతో మాట్లాడిన కల్పలతా రెడ్డి మాట్లాడుతూ.. “కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతో సహకరించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం డీఏలు, ఐఆర్‌ను ప్రకటించి విడుదల చేస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదు. వైఎస్ జగన్ హయాంలో ప్రతి సంక్రాంతికి ప్రభుత్వ ఉద్యోగులకు మేలు జరిగేది. ఇప్పుడు మాత్రం ఉద్యోగులను పట్టించుకునే పరిస్థితి లేదు” అని అన్నారు. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శత్రువుగా మారిందని ఆమె విమర్శించారు. “టీచర్లపై టార్చర్, పోలీసులకు పనిష్మెంట్, సచివాలయ ఉద్యోగులకు లక్ష సమస్యలతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఉద్యోగుల కోసం ప్రకటించిన మేనిఫెస్టోను కూడా తుంగలో తొక్కారు. ప్రస్తుతం రూ.34 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉండగా, ఐఆర్ అందిస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు” అని తెలిపారు. పీఆర్సీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని కల్పలతా రెడ్డి ఆరోపించారు. “డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గానీ, ఇతర మంత్రులు గానీ పీఆర్సీ అంశంపై మాట్లాడటం లేదు. పీఆర్సీ కమిటీని కూడా ఏర్పాటు చేయకుండా ఉద్యోగులను మభ్యపెడుతున్నారు. పీఆర్సీ చైర్మన్ నియామకానికే ప్రభుత్వం సిద్ధంగా లేదు” అని విమర్శించారు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్‌ను 27 శాతం వరకు అందించారని ఆమె గుర్తుచేశారు. “ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు ఐఆర్ అందించారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఐఆర్, డీఏలు, పీఆర్సీని వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం 16 నెలలు గడుస్తున్నా డీఏలు ఇవ్వలేకపోతోంది” అని అన్నారు. మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిలు ఎందుకు చెల్లించలేదని ఆమె ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతోందని, కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని కల్పలతా రెడ్డి వ్యాఖ్యానించారు.