ప్రకాశం జిల్లా : అద్దంకి నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ అశోక్ కుమార్ వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి నాటికి రోడ్లన్నీ అద్దంలా చేస్తామని ఇచ్చిన హామీ అమలుకాకపోవడాన్ని నిరసిస్తూ “చంద్రబాబు సంక్రాంతి హామీ – గుంతల గాయాలు” అనే పేరుతో ఈ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని పలు చోట్ల గుంతలతో నిండిన రోడ్ల వద్ద కార్యకర్తలతో కలిసి డాక్టర్ అశోక్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు. గుంతల రోడ్ల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, “సంక్రాంతి కల్లా రోడ్లన్నీ అద్దంలా చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పిన మాటలను తుంగలో తొక్కారు. అద్దంకి ప్రజలు గుంతల గాయాలతో అల్లాడిపోతున్నారు” అని విమర్శించారు. రోడ్ల దుస్థితి వల్ల సాధారణ ప్రజలతో పాటు వాహనదారులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. తాను రెండు రోజుల క్రితమే ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రకటించగానే ప్రభుత్వం హడావుడిగా స్పందించి, ఆర్ అండ్ బి మంత్రిని పిలిపించి స్థానిక మంత్రి ద్వారా కొన్ని రోడ్లకు శంకుస్థాపనలు చేయించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే స్వాగతిస్తాం కానీ ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు. ప్రతిపక్షంగా ప్రజల తరపున నిలబడి, వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో మరిన్ని ఉద్యమాలు కొనసాగిస్తామని డాక్టర్ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటికీ ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడం అత్యంత బాధాకరమని, ఈ అంశంపై కూడా పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.