కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి

వైయ‌స్ఆర్‌సీపీ ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు

ఏలూరు జిల్లా : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించి పాలనలో ఘోర వైఫల్యాన్ని చూపుతోందని వైయ‌స్ఆర్‌సీపీ ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు విమర్శించారు. ధరల పెరుగుదల, సంక్షేమ పథకాల నిలిపివేత, నిరుద్యోగ సమస్యలు, ప్రజలకు అందాల్సిన మౌలిక సదుపాయాల లోపం వంటి అంశాలు కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన అన్నారు. పార్టీ శ్రేణులు గ్రామాలు, పట్టణాల్లో ప్రజల మధ్యకు వెళ్లి ఈ ప్రభుత్వ వైఫల్యాలను స్పష్టంగా వివరించాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం ఆగదని, ప్రజల గొంతుకగా నిరంతరం నిలబడుతామని దూలం నాగేశ్వరరావు స్పష్టం చేశారు. చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని జంగారెడ్డిగూడెంలో వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ నిర్మాణ సంస్థగత సమావేశం శుక్రవారం నిర్వ‌హించారు. చింతలపూడి నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ కంభం విజయరాజు అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన స‌మావేశంలో దూలం నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగిస్తోందని విమర్శించారు. పార్టీ శ్రేణులు గ్రామ గ్రామానికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, మండల–గ్రామ స్థాయిలో కమిటీల సక్రమ నిర్వహణ, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలపై ఉద్యమాలకు సిద్ధంగా ఉండడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త & రాష్ట్ర యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్ కుమార్, ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు వంకా రవీంద్రనాథ్ (ఎంఎల్సీ), మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాదరావు,  నగర  అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర, కర్పూరం గుప్తా  త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Back to Top