విశాఖపట్నం: తెలుగుదేశం నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభి వేధింపులతో ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించిన జీవీఎంసీ మెకానికల్ సెక్షన్ ఎస్‌ఈ గోవిందరావు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఈ ఘటనపై ఉన్నతస్థాయి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని విశాఖ జిల్లా వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు డిమాండ్ చేశారు. పార్టీ నాయకులతో కలిసి నగరంలోని ఒక ఆస్పత్రిలో ఉన్న గోవిందరావు మృతదేహం వద్ద నివాళులు అర్పించిన అనంతరం అక్కడే ఆస్పత్రి బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్ఈ గోవిందరావుది ప్రభుత్వ హత్యేనని, ఒక కాంట్రాక్టు విషయంలో కూటమి నాయకులకు అనుకూలంగా నడుచుకోలేదనే కోపంతో నిజాయితీ గల అధికారి గోవిందరావును రివ్యూ పేరుతో అందరి ముందూ అనరాని మాటలతో పట్టాభి ఇబ్బందికి గురిచేశాడని చెప్పారు. సమాధానం చెబుతున్నా వినకుండా పట్టాభి అధికారం ఉందనే అహంకారంతో రెచ్చిపోయాడని ఆరోపించారు. గోవిందరావు మరణానికి కారణమైన పట్టాభిపై చర్యలు తీసుకోవాలని కెకె రాజు డిమాండ్ చేశారు. గోవిందరావు గుండెపోటుకు గురైతే నాయకులు అక్కడే ఉండి కూడా ఆయన కూతురు వచ్చేవరకు అంబులెన్స్‌ను ఏర్పాటు చేయలేకపోయారని కెకె రాజు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కెకె రాజుతోపాటు పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు మళ్ల విజయ ప్రసాద్, మొల్లి అప్పారావు, తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మాజీ మేయర్ శ్రీమతి గొల్ల గాని హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్ శ్రీ కట్టుమూరు సతీష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పల్లా దుర్గ తదితరులు ఉన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ● ఆస్పత్రిలో పట్టాభి, పల్లా శ్రీనివాస్ నవ్వులాట డంపింగ్ యార్డ్‌లో చెత్త నిల్వలు తరలించేందుకు పాత కాంట్రాక్టర్‌ను తొలగించి కొత్త వారికి బాధ్యతలు అప్పగించినట్లు ఎస్‌ఈ చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా, పట్టాభి నోరేసుకుని పడిపోయాడు. తమాషాలు చేస్తున్నావా.. అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. అధికార మదంతో గొంతు పెంచి మాట్లాడేసరికి ఎస్‌ఈ సమాధానం చెప్పలేక ఒత్తిడితో గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగానే ఎస్‌ఈ గోవిందరావు మృతి చెందారు. ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లిన పట్టాభి, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్.. గోవిందరావుకి సీపీఆర్ జరుగుతుంటే సంతోషంగా నవ్వుకుంటూ అక్కడున్న వారితో పలకరింపులు, పరిచయ కార్యక్రమాల పేరుతో కాసేపు సమయం గడిపేసి వచ్చారంటే వీరికి మానవత్వం ఉందని ఎలా అనుకోవాలి? తన కారణంగా ఒత్తిడికి గురై ఒక సీనియర్ ఉద్యోగి చనిపోతే టీడీపీ నాయకులు ఆస్పత్రిలో ఇలాగేనా వ్యవహరించేది? పట్టాభికి ఏ అధికారం ఉందని జీవీఎంసీ కమిషనర్, మేయర్‌లు లేకుండా జోనల్ కార్యాలయంలో రివ్యూ నిర్వహించారు? ● ఉద్యోగుల రక్షణకు చట్టం తేవాలి అధికారుల పట్ల కూటమి నాయకుల పెత్తందారీ పోకడలకు ఎస్ఈ గోవిందరావు మరణమే ఉదాహరణ. అధికార మదంతో ఉద్యోగులపై పడిపోవడం పట్టాభికి సర్వసాధారణ విషయం అయిపోయింది. గతంలోనూ ఒకసారి రివ్యూ పేరుతో అధికారుల మీద జులుం ప్రదర్శించాడు. ఉద్యోగుల పట్ల కూటమి నాయకుల దురుసు ప్రవర్తనతో వారు ప్రశాంతంగా పనులు చేసుకోలేకపోతున్నారు. ఉద్యోగులను ప్రజా సమస్యల పరిష్కారానికి కాకుండా నాయకుల వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటూ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. కూటమి నాయకుల అధికార అహంకారంతోనే ప్రభుత్వ ఉద్యోగి గోవిందరావు చనిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులున్నది ప్రజలకు సేవ చేయడానికే కానీ, అధికార పార్టీ నాయకులకు ఊడిగం చేయడానికి కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుసుకోవాలి. గోవిందరావు మరణాన్ని ప్రభుత్వ హత్యగానే వైయస్ఆర్‌సీపీ పరిగణిస్తుంది. గోవిందరావు మృతిపై ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థతో ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఆయన మృతికి కారణమైన స్థానిక కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, కొమ్మారెడ్డి పట్టాభిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి. అధికారులను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప వారు స్వేచ్ఛగా పనిచేసుకోలేరు.