కూటమి పాలనలో రాజకీయాలకు వేదికగా యూనివర్సిటీలు

యూనివర్సిటీల్లో మంత్రి లోకేష్ పుట్టిన రోజు వేడుకలు 

విద్యార్ధులను భయబ్రాంతులకు గురిచేస్తూ కార్లు, బైకులతో ర్యాలీలుఆగ్రహం వ్యక్తం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర

తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ 
ప్రెసిడెంట్ రవిచంద్ర.

పార్టీ కార్యాలయాల్లో ప్రొఫెసర్లు, విద్యార్ధులు పుట్టిన రోజు సంబరాలు

టీడీపీ కార్యాలయంలో విద్యార్ధులు రక్తదానమా?

సూటిగా నిలదీసిన విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర

కూటమి పాలనలో నిర్వీర్యమైన ఉన్నత విద్య

అధికారంలోకి రాగానే వీసీలను తొలగించిన ప్రభుత్వం

19 నెలలైనా ఇంకా భర్తీ కానీ వీసీ పోస్టులు

పాలకమండళ్లు సమావేశం సైతం నిర్వహించని వైనం

ఆంధ్రా యూనివర్సిటిలో విద్యార్ధుల ఆకలి కేకలు

ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం

మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి  

వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్ధి విభాగం డిమాండ్ 

తాడేపల్లి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను కూటమి ప్రభుత్వం రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మార్చడం పై వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున యూనివర్సిటీలో టీడీపీ కార్యకర్తలు..  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...  విద్యార్ధులను భయబ్రాంతులకు గురయ్యేంత భయంకరంగా యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద  కార్లు , బైకులతో కేడర్ ను సమీకరించి... భారీగా కేకులు కట్ చేయడాన్ని తప్పు పట్టారు. 
కూటమి పాలనలో ఉన్నతవిద్య పూర్తిగా  నిర్వీర్యమైందని... ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్ధుల ఆకలి కేకలే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే వీసీల తొలగించిన కూటమి ప్రభుత్వం
19 నెలలైనా ఇంకా భర్ చేయకపోవడం దారుణమన్నారు. చివరకు పాలకమండళ్ల సమావేశం సైతం నిర్వహించకపోవడం... ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని... దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..

● రాజకీయ కేంద్రాలుగా యూనివర్సిటీలు..

నాగార్జున  యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో  కేకులు కట్ చేసి బోధన, బోధనేతర సిబ్బంది కూడా పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఒక రాజకీయ నాయకుడైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పుట్టిన రోజు వేడులకను రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన యూనివర్సిటీల్లో ఎలా నిర్వహిస్తారు?. మీ రాజకీయ కార్యకలాపాలను విశ్వవిద్యాలయాలను ఎలా వాడుకుంటారు? యూనివర్సిటీ ప్రాంగణాల్లో భారీగా కార్లు, బైకుల హారన్స్ మోగిస్తూ... పెద్ద సౌండ్స్ చేస్తూ భయానక వాతావరణం సృష్టించడం దారుణం. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొంటారు? యూనివర్సిటీ విద్యార్ధులను టీడీపీ పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లి రక్తదానం చేయించడం తీవ్ర అభ్యంతరకరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు వేదికగా వాడుకోవడం శోచనీయం. 

● వీసీ పోస్టులను సైతం భర్తీ చేయని వైనం..

అధికారం చేపట్టిన వెంటనే అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను తొలగించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు ఆ పోస్టులను పూర్తిగా భర్తీ చేయలేదు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ వీసీ పోస్టును సైతం ఇంకా ఖాళీగానే ఉంది. ఒంగోలు ఆంధ్రకేసరి, అనంతరపురం ఎస్ కే యూనివర్సిటీలలోనూ వీసీ పోస్టులు ఖాలీగానే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఒక్క విశ్వవిద్యాలయంలో కూడా పాలకమండలి సమావేశం నిర్వహించలేదు. యూనివర్సిటీ ఆర్దిక వ్యవహారాలు ముందుకు నడవాలంటే.. పాలకమండలిలో నిర్ణయం తీసుకోవాలి. కానీ అలా చేయకుండానే విశ్వవిద్యాలయాలను ఈ ప్రభుత్వం ఎలా నిర్వహిస్తోంది? అంటే పాలకమండళ్లు ప్రమేయం లేకుండానే నారా లోకేష్ ఆధ్వర్యంలోని విద్యాశాఖ రాజకీయ పాలన సాగిస్తోందనడానికి ఇదే నిదర్శనం. 19 నెలలగా యూనివర్సీటీలకు స్వయం పరిపాలన లేకుండా రాజకీయ పాలన చేస్తోంది. గతంలో విద్యావేత్తలను విశ్వవిద్యాలయాలకు వైయస్.జగన్ వైస్ ఛాన్సలర్లుగా నియమిస్తే.. చంద్రబాబు పాలనలో యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తిని కోల్పోయాయి.
పైగా యూనివర్సిటీలను రాజకీయ కేంద్రాలుగా మార్చారు. క్యాంపస్ సెలక్షన్లు లేవు, యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ లేదు సరికదా.. విశ్వవిద్యాలయాలను సినిమా ప్రమోషన్లకు, నాయకులు పుట్టిన రోజు వేడుదలకు కేంద్రాలుగా వాడుకోవడం దుర్మార్గం. 

● యూనివర్సిటీలో ఆకలి కేకలు - పట్టని ప్రభుత్వం..

ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థులు  ఆకలి కేకలు మంత్రి నారా లోకేష్ కు వినపడలేదా? అసలు ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహణకు గీతం యూనివర్సిటీకి అప్పగించారా అన్నట్టు వ్యవహరిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారు?  టీడీపీ నాయకులు యూనివర్సిటీల్లోనూ బోధన, బోధనేతర సిబ్బందితో కలిసి పుట్టిన రోజు వేడుకలు పేరుతో నానా హంగామా సృష్టించడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం.
జేఎన్ టీ యూ అనంతరపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుల వేడుదల్లో వీసీ, రిజిస్ట్రార్ పాల్గొని నిర్వహించిన ఘటన విశ్వవిద్యాలయాలు రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చుతున్నారనడానికి నిదర్శనం. దీన్ని వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉన్నత విద్యామండలిని దిష్టిబొమ్మగా మార్చిన కూటమి ప్రభుత్వం... యూనివర్సిటీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూనివర్సిటీల సంక్షేమాన్ని గాలికొదిలివేయడమే కాకుండా... వాటిని రాజకీయాలకు కేంద్రబిందువుగా చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. వీటికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి.  ఇప్పిటికైనా ఇలాంటి విధానాలను విడనాడి.. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకోవడంతో పాటు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని రవిచంద్ర డిమాండ్ చేశారు.  లేని పక్షంలో వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం తరపున ఉద్యమం తప్పదని రవిచంద్ర హెచ్చరించారు.

Back to Top