ఎన్టీఆర్ జిల్లా : అన్యాయ కేసుల్లో అరెస్టై 83 రోజుల పాటు జైలులో నిర్బంధానికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ ను వైయస్ఆర్‌సీపీ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీ కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.అంబటి రాంబాబు మాట్లాడుతూ..జోగి రమేష్‌ను పూర్తిగా రాజకీయ కక్షతోనే అక్రమంగా 83 రోజుల పాటు జైలులో పెట్టారని అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకు జోగి రమేష్‌పై ఉన్న వ్యక్తిగత కక్ష తీరిందని వ్యాఖ్యానించారు. అన్యాయ కేసులో జైలుకు వెళ్లిన తర్వాత జోగి రమేష్‌పై ప్రజల్లో మరింత ఆదరణ, క్రేజ్ పెరిగిందన్నారు. రాజకీయ కక్ష సాధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను వాడుకుంటూ వైయస్ఆర్‌సీపీ నేతలపై కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారని ఆరోపించారు. ఇది అంతా ఒక పథకం ప్రకారమే జరుగుతోందని, కేసులు పెడితే వైయస్ఆర్‌సీపీ నేతలు భయపడిపోతారని చంద్రబాబు భావిస్తున్నారని అన్నారు. కానీ చంద్రబాబు ఎంత హింసిస్తే, అంతే పట్టుదలతో వైయస్ఆర్‌సీపీ బలోపేతానికి తాము సిద్ధపడతామని స్పష్టం చేశారు. జోగి రమేష్ భార్య, కొడుకులు, తమ్ముడు సహా కుటుంబ సభ్యులందరిపై కేసులు పెట్టి కుటుంబాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ అణచివేతలన్నీ చరిత్రలో లిఖించబడతాయని, రాబోయే రోజుల్లో వీటన్నింటికీ చంద్రబాబు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికార మదంతో వ్యవహరిస్తే కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. బెయిల్ తెచ్చుకున్న వెంటనే మరో తప్పుడు కేసు పెడతారని తాను ముందే చెప్పానని, చెప్పినట్టుగానే మరో కేసు పెట్టారని తెలిపారు. చంద్రబాబు జోగి రమేష్‌ను అరెస్టు చేయించి మరింత శక్తివంతుడిని చేశారని, అరెస్టులు, జైళ్లు వైయస్ఆర్‌సీపీ నేతలను ఏమీ చేయలేవని అన్నారు. ప్రజలు మళ్లీ వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, ఈ విషయాన్ని చంద్రబాబే ఐఏఎస్‌ల సమావేశంలో ఒప్పుకున్నాడని గుర్తు చేశారు. పనిచేస్తున్నా జనం సంతృప్తిగా లేరని చంద్రబాబు స్వయంగా చెప్పాడన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించేందుకు అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. రెడ్ బుక్ పేరుతో భయపెట్టాలని చూస్తున్నారని, అయితే ఆ రెడ్ బుక్‌కు తాము భయపడబోమని స్పష్టం చేశారు. వైయస్ఆర్ , వైయస్ జగన్ వెంట నడిచిన వాళ్లమని, లోకేష్ పెత్తనం చేస్తున్నాడని, టిడిపి పతనానికి లోకేషే నాంధి కాబోతున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూపై అబద్దపు ప్రచారం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అడ్డంపెట్టుకుని వైయస్ఆర్‌సీపీని దెబ్బతీయాలని చంద్రబాబు ప్రయత్నించాడని, తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని అబద్ధపు ప్రచారం చేశారని అంబటి రాంబాబు తప్పుపట్టారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిని దశలవారీగా తనిఖీ చేస్తారని, కల్తీ లేదని నిర్ధారించిన తర్వాతే వినియోగిస్తారని వివరించారు. వెంకటేశ్వర స్వామిని అడ్డంపెట్టుకుని నీచమైన రాజకీయాలు చేశారని, భవిష్యత్తులో చంద్రబాబు తప్పక అనుభవిస్తాడని హెచ్చరించారు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టే అర్హత చంద్రబాబుకు లేదని, ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలో నుంచి దించేసిన వ్యక్తి ఆయనేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రామారావును అడ్డంపెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడన్నారు. సంక్రాంతి సందర్భంగా తాను చేసిన నృత్యం ఆనంద తాండవమని, రాజకీయ వ్యంగ్యంతో చేసిన ఆ నృత్యాన్ని ప్రజలు ఆదరించారని చెప్పారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా తాను డాన్స్ చేశానని, తిట్టినా గేలి చేసినా భయపడని వ్యక్తినని, వైయస్ఆర్ శిష్యుడిగా, వైయస్ జగన్ సహచరుడిగా ఎప్పటికీ ప్రజల పక్షానే ఉంటానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. విడదల రజనీ, మాజీ మంత్రి మాట్లాడుతూ: నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌ను తప్పుడు ఆధారాలతో అక్రమంగా అరెస్టు చేసి 83 రోజులు జైలులో ఉంచారని విడదల రజనీ ఆరోపించారు. ఇంతటి అన్యాయం మరొకటి లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని విమర్శించారు. జోగి రమేష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టారని, ఆసుపత్రిలో కలిసేందుకు వెళ్లినందుకే ఆయన భార్యపై కేసు పెట్టడం దుర్మార్గమని అన్నారు. అరెస్టులు చేసి జైళ్లకు పంపి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ నేతల గొంతు నొక్కాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఈ అరాచకాలను గమనిస్తున్నారని, సామాన్యులకు సైతం న్యాయం జరగని పరిస్థితి ఉందన్నారు. అరెస్టులు, కేసులే మీకు గుణపాఠం చెప్పబోతున్నాయని హెచ్చరించారు. వైయస్ఆర్‌సీపీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని, వాటిని అమ్మేయడానికి పెద్ద స్కెచ్ వేస్తున్నారని ధ్వజమెత్తారు. తనను, తన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేశారని, రెడ్ బుక్ పేరుతో భయపెట్టాలని చూసినా తాము భయపడలేదని స్పష్టం చేశారు. మళ్లీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే తమ ఏకైక అజెండా అని విడదల రజనీ స్పష్టం చేశారు.