తిరుమల లడ్డూలో జంతుకొవ్వు అవాస్తవం

భక్తుల మనోభావాలతో కూటమి నేతల చెలగాటం

వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి జి.శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి.

పాలనలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం

డైవర్షన్‌ కోసం దేవుడిని రాజకీయాల్లోకి లాగారు

అలా ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు యత్నం

వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి జి.శ్రీకాంత్‌రెడ్డి ఫైర్‌

టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అప్పుల కుప్ప

20 నెలల్లోనే రూ.3.10 లక్షల కోట్ల అప్పు చేశారు

ఒక్కటైనా సంక్షేమ, అభివృద్ధి పథకం అమలు లేదు

మరి అప్పు మొత్తం ఏమవుతోంది? ఎక్కడికెళ్తోంది?

సూటిగా ప్రశ్నించిన జి.శ్రీకాంత్‌రెడ్డి

అభివృద్ధి కంటే పబ్లిసిటీకే చంద్రబాబు ప్రాధాన్యం

టీడీపీ కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం

ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌తో కాలం వెళ్లదీత

అదే పనిగా జగన్‌గారి ప్రభుత్వంపై నిందల పర్వం

ప్రెస్‌మీట్‌లో జి.శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం

తాడేపల్లి: పాలనలో వైఫల్యాలు బయటపడుతున్న వేళ ప్రజల దృష్టి మళ్లించేందుకే దేవదేవుడిని కూడా చంద్రబాబునాయుడు రాజకీయాల్లోకి లాగారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆక్షేపించారు. ఆ దిశలోనే గత వైయ‌స్ఆర్‌సీపీప్రభుత్వాన్ని నిందిస్తూ, తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిపిన నెయ్యి వాడారని ఆరోపణలు, విష ప్రచారం చేశారని.. కానీ, అదంతా అవాస్తవమని ఇప్పుడు తేలిపోయిందని ఆయన వెల్లడించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కూటమి నేతలు భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడారని గుర్తు చేశారు.
    టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, 20 నెలల్లోనే రూ.3.10 లక్షల కోట్ల అప్పు చేశారని, అయినా ఒక్కటైనా సంక్షేమ, అభివృద్ధి పథకం అమలు లేదని చెప్పారు. మరి తెచ్చిన అప్పంతా ఏమవుతోందని? ఎక్కడికెళ్తోంది? అని నిలదీశారు. అభివృద్ధి కంటే పబ్లిసిటీకే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తారన్న ఆయన, కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, దీంతో ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌తో కాలం వెళ్లదీస్తున్నారని, ఆ దిశలోనే అదే పనిగా వైయ‌స్ జగన్‌గారి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జి.శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

ప్రెస్‌మీట్‌లో జి.శ్రీకాంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:

దేవుడిని రాజకీయాల్లోకి లాగడం అత్యంత దుర్మార్గం:
    రాజకీయ లబ్ధి కోసం చివరకు దేవదేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగడం అత్యంత దుర్మార్గమైన చర్య. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి.
    తమ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, విజయవాడ వరదల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబునాయుడు తిరుమల లడ్డూలో జంతు కొవ్వు ఉందని అవాస్తవ ఆరోపణలు చేశారు. పవిత్రంగా భావించే లడ్డూకు కల్తీ ముద్ర వేయడం ద్వారా హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిగిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) జరిపిన విచారణలో తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని తేలింది. అదే విషయాన్ని సిట్‌ తన ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చింది.

అయినా ఎదురుదాడి.. విష ప్రచారం:
    తిరుమల వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని స్పష్టంగా తేలినా, టీడీపీ కూటమి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరిస్తోంది. ఎదురుదాడి చేస్తూ, మళ్లీ దుష్ప్రచారం చేస్తోంది. అందుకే పలు చోట్ల ఫ్లెక్సీలు పెడుతోంది. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, ఆ నెయ్యిలో జంతు కొవ్వు లేదని సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా ప్రస్తావించినా, మళ్లీ అదే విషయాన్ని ఆ ఫ్లెక్సీలో రాసి, గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని, జగన్‌గారిని నిందిస్తున్నారు. ఇంకా ర్యాలీలు కూడా నిర్వహించమని పిలుపునివ్వడం సిగ్గుచేటు. లేనివి సృష్టించి, మీడియాను నమ్ముకొని దుష్ప్రచారం చేయడం దుర్మార్గం. మీడియా కూడా తన అంతరాత్మను అనుసరించి కనీస బాధ్యతగా వ్యవహరించాలి.

పాలనలో దారుణ వైఫల్యం:
    కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైయస్‌ఆర్‌సీపీ పాలనలో రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు వైయస్‌ జగన్‌ నేరుగా అందించారు. మొత్తం అప్పులు రూ.3.32 లక్షల కోట్లు మాత్రమే. కానీ కూటమి ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే రూ.3.10 లక్షల కోట్లు అప్పు చేసింది. మరి ఆ డబ్బంతా ఏమవుతోంది? ఎక్కడికెళ్తోంది? ఎందుకంటే రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకం, కార్యక్రమం అమలు కావడం లేదు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి.
    గత ప్రభుత్వం పక్కాగా అమలు చేసిన ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తంతో సహా, ఏ పథకాలు ఇప్పుడు లేవు. డ్వాక్రా సంఘాలను దెబ్బతీశారు. సున్నా వడ్డీ రుణాలు నిలిపేశారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. అన్నదాత సుఖీభవను చాలా అరకొరగా అమలు చేశారు. రూ.40 వేలకు బదులు రూ.10 వేలతో సరిపెట్టారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఊసే లేదు. చివరకు ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేసి పేదల ఆరోగ్య హక్కును కాలరాశారని జి.శ్రీకాంత్‌రెడ్డి ఆక్షేపించారు.

Back to Top