తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు

కూటమి నాయకులపై కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్‌లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల ఫిర్యాదు

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని పవిత్ర లడ్డూ ప్రసాదంపై కూటమి నాయకులు చేస్తున్న నిరాధారమైన, బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కళ్యాణదుర్గం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు, చేప నూనె కలిసిందంటూ ఆధారాలు లేకుండా ప్రకటనలు చేస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ అసత్య ప్రచారాల వల్ల సమాజంలో అశాంతి నెలకొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సోమవారం కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్‌లో సీఐకి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఫిర్యాదు అందజేశారు. భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న కూటమి నాయకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆధారాలు లేకుండా పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇటువంటి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను కించపరచడమే కాకుండా, సమాజంలో విభజనకు దారి తీస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ మండలాల వైయ‌స్ఆర్‌సీపీ కన్వీనర్లు ఐ. సుధీర్, గోళ్ళ సూరి, పాలబండ్ల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి యర్రంపల్లి కృష్ణమూర్తి, జిల్లా అధికార ప్రతినిధి గోపారం శ్రీనివాసులు, కౌన్సిలర్లు లక్ష్మన్న, పరమేశ్వరప్ప, మునిసిపల్ విభాగం అధ్యక్షులు మురళి, పార్టీ నాయకులు గాజుల అంజి, రాజేష్, గంగాధర్, రాము, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top