రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ కొనసాగుతోంది

అంబటి రాంబాబు హత్యకు ప్రయత్నించారు

వైయస్‌ జగన్‌ ఫైర్‌

టీడీపీ గుండాలు మొత్తం విధ్వంసం చేసిన, గుంటూరులోని అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్‌ను సందర్శించిన శ్రీ వైయస్‌ జగన్ ఆ తర్వాత అంబటి రాంబాబు ఇంటి బయట మీడియాతో మాట్లాడారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు

ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు

స్వార్థం కోసం దేవుణ్నీ రాజకీయాల్లోకి లాగుతున్నారు

కేవలం దురుద్దేశంతోనే తిరుమల నెయ్యిపై ఆరోపణ

అదంతా అవాస్తవమని తేల్చిన ల్యాబ్‌లు. సీబీఐ

అయినా తప్పు ఒప్పుకోకుండా ఎదురుదాడి

అబద్ధాల ఫ్లెక్సీలు. వైయస్సార్‌సీపీపై నిందలు

ప్రశ్నిస్తే భౌతిక దాడులు. విధ్వంసం. అక్రమ కేసులు

శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడి

తప్పుడు సమాచారంతో రెచ్చగొట్టే ప్రయత్నం

ఆ హక్కు అసలు ప్రజాస్వామ్యంలో ఉంటుందా?

మరి మేము కూడా మీ ఫ్లెక్సీలు పెడితే ఎలా ఉంటుంది?

సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్‌ అని చెప్పి మోసం చేశారు

ఆ ఫ్లెక్సీలు మేము పెడితే ఊర్కుంటారా చంద్రబాబు?

సూటిగా ప్రశ్నించిన శ్రీ వైయస్‌ జగన్‌

అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజిని..

బొల్లా బ్రహ్మనాయుడు చేసిన తప్పేమిటి?

వారిపై, వారి ఇళ్లపై ఎందుకు దాడి చేశారు?

రాంబాబు, రమేష్‌ ఇళ్లల్లో దారుణంగా విధ్వంసం

పోలీసుల సమక్షంలోనే యథేచ్ఛగా దాడుల పర్వం

జోగి రమేష్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబులతో దాడి

రాంబాబు, రమేష్‌ ఇళ్లకు నిప్పు పెట్టడం హేయం

శ్రీ వైయస్‌ జగన్‌ ఆక్షేపణ

ఇప్పుడు తప్పు చేసిన ఎవ్వరినీ వదిలి పెట్టబోము

వచ్చేది మా ప్రభుత్వమే. వడ్డీతో సహా బదులిస్తాం

అన్నీ ఎంక్వైరీ చేయిస్తాము. కోర్టు బోను ఎక్కిస్తాము

ఈరోజు మీరు దారుణ విష బీజాలు నాటుతున్నారు

అవి రేపు వృక్షాలవుతాయి. మీ అధికారం శాశ్వతం కాదు

ఈ విషయం గుర్తుంచుకొండి. పద్ధతి మార్చుకొండి

శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

కాపు కులంలో అంబటి రాంబాబు టైగర్‌

ఏకంగా ఆయన్ను హత్య చేయాలని చూస్తారా?

5 కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు, ఆఫీసులో మొత్తం పగలగొట్టారు

ఇంట్లో మహిళలు ఉన్నారని కూడా పట్టించుకోలేదు

అంత దారుణంగా దాడి చేసి విధ్వంసం సృష్టించారు

సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు దాడుల పర్వం

పోలీసుల సమక్షంలోనే, వారి అండతోనే ఈ దారుణం

దగ్గర్లోనే ఎస్పీ ఇల్లు. కూతవేటు దూరంలో డీజీపీ ఆఫీస్‌

మా నాయకులు ఎంత ప్రయత్నించినా స్పందించలేదు!

ఇదేనా పోలీసులు వ్యవహరించే విధానం? వారి పని

మీ తప్పులను ప్రశ్నిస్తే అస్సలు సహించరా?

పోలీసులు, ప్రభుత్వాన్ని నిలదీసిన శ్రీ వైయస్‌ జగన్‌

చంద్రబాబుకు సుప్రీంకోర్టు అన్నా గౌరవం లేదు

సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ క్లీన్‌చిట్‌ ఇచ్చింది

అయినా నిస్సిగ్గుగా విచారణకు మరో కమిషన్‌

తన అనుకూలమైన వారితో విచారణ. అనుకూల నివేదిక

అందుకోసం పూర్తిగా దిగజారిపోయిన చంద్రబాబు

అలాంటి నాయకుడు ప్రపంచంలోనే ఎక్కడా ఉండడు

గుంటూరులో చురకలంటించిన శ్రీ వైయస్‌ జగన్‌

గుంటూరు: రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ కొనసాగుతోందని, గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబును హత్య చేయడానికి ప్రయత్నించారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అ«ధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. ప్రజాస్వామాన్ని దారుణంగా ఖూనీ చేస్తున్న సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని దురుద్దేశంతో దుష్ప్రచారం చేసిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, పవన్‌కళ్యాణ్‌ ఆరోపణలు, విమర్శల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన  ప్రతిష్టాత్మకమైన ఎన్‌డీఆర్‌ఐ (నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌), ఎన్‌డీడీబీ (నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు) స్పష్టమైన నివేదికలు ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు. అదే విషయాన్ని సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చిందని చెప్పారు.
    దేవుడి పేరుతో రాజకీయం చేశామని, తప్పు ఒప్పుకుంటూ క్షమాపణ కోరాల్సిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, పవన్‌కళ్యాణ్‌ ఎదురుదాడి చేస్తున్నారని శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు. పచ్చి అబద్ధాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ప్రస్తావించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా చేసిన మోసాన్ని చెబుతూ, తామూ అలాగే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఊర్కుంటారా అని ప్రశ్నించారు. తప్పులను ప్రశ్నిస్తే ఇలా దాడులు చేయడం అత్యంత హేయమని అభివర్ణించారు. తాము అధికారంలోకి వచ్చాక, ఇప్పుడు తప్పు చేసిన, చేస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోమని, విచారణ జరిపిస్తామని, కోర్టు బోను ఎక్కిస్తామని గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.     
ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..:

రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌:
    రాష్ట్రంలో ఈరోజు జంగిల్‌రాజ్‌ కొనసాగుతోంది. అది ఏ స్థాయిలో ఉంది అంటే ప్రజాస్వామ్యం ఎప్పుడో ఖూనీ అయిపోయింది. ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం ఈరోజు జరుగుతోంది. ఈరోజు అంబటి రాంబాబుపై జరిగిన దాడి అయితేనేమి, జోగి రమేష్‌ ఇంటి మీద దాడి విషయమైతేనేమి, విడదల రజిని మీద అటాక్‌ చేసిన విషయమైతేనేమి, బొల్లా బ్రహ్మనాయుడు మీద అటాక్‌ చేసిన విషయమైతేనేమి.. ఇవన్నీ ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఘటనలు మాత్రమే. అవి చూస్తే కూడా జంగిల్‌రాజ్‌ అన్నది ఏ స్థాయిలో ఉంది అన్నది ఇట్టే అర్థమయ్యే విషయం. 
    నేను అడుగుతున్నాను. అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్, భూమన కరుణాకర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు చేసిన తప్పేమిటి?.

శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా..!:
    చంద్రబాబునాయుడు అనే వ్యక్తి దాదాపు ఏడాదిన్నర నుంచి కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ, ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా కావాలని, కుట్రపూరితంగా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, గొడ్డు మాంసం కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, చేపనూనె కలిసింది అంటూ రకరకాలుగా చంద్రబాబునాయుడు,  ఆయన కొడుకు, చంద్రబాబుతో కలిసి ఉన్న పవన్‌కల్యాణ్‌.. ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేశారు. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా, దేవుడంటే కనీసం భయం, భక్తీ లేకుండా రాజకీయాల కోసం దేవుణ్ని ఉపయోగించడం మొదలు పెట్టారు. 

అవి పూర్తిగా అవాస్తవమని తేలింది:
    అయితే ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అని ఏకంగా ఎన్‌డీడీబీ (నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు), ఎన్డీఆర్‌ఐ (నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) రిపోర్టు ఇచ్చాయి. ఆ రెండూ కూడా కేంద్రానికి సంబంధించిన ల్యాబులు. వీళ్ల హయాంలో, వీళ్లు ఇచ్చిన టెస్ట్‌ శాంపిళ్లు. అవి టెస్ట్‌ శాంపిళ్లు కూడా. వాటిని అనాలసిస్‌ చేసి వాళ్లు సీబీఐ ఆధ్వర్యంలో అనలైజ్‌ చేసి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వు కానీ, పందికొవ్వు కానీ, చేప నూనె కానీ, ఇంకొకటి కానీ ఏవీ లేవని నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇచ్చాయి. అదే విషయాన్ని సీబీఐ సిట్‌ తన ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చి, అవే ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ సర్టిఫికెట్లు కూడా జత చేసి, క్లోజర్‌ ఇచ్చింది. 

ఒకవేళ వారు నిజంగా తప్పు చేసి ఉంటే..!:
    నేను అడుగుతున్నాను. ఒకవేళ వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి తప్పు చేసి ఉంటే వారి పేర్లు ఎందుకు చేర్చలేదు? వారు ఒకవేళ తప్పు చేసినట్టు ఆధారాలు ఉంటే, తప్పు నిజమే అయితే ఎందుకు అరెస్టు చేయలేదు?. వారు ఏ తప్పూ చేయలేదు కాబట్టి, సీబీఐ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఎటువంటి తప్పు జరగలేదు కాబట్టి, వారి పేర్లు ఛార్జ్‌షీట్‌లో పెట్టలేదు. అరెస్టు కూడా చేయలేదు. 
    అసలు ఈ వ్యవహారంలోకి సీబీఐ ఎందుకొచ్చింది? వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు తప్పు.. వీటి మీద విచారణ చేయండి అని పిటిషన్‌ వేశారు కాబట్టి. దానిపై స్పందించిన సుప్రీంకోర్డు సీబీఐ చేత విచారణకు ఆదేశించింది.

క్షమాపణ కోరాల్సింది పోయి.. ఎదురుదాడి!:
    తిరుమల నెయ్యిలో జంతుకొవ్వు కలపలేదని ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ ల్యాబ్‌ల సర్టిఫికెట్లు, సీబీఐ క్లీన్‌చిట్‌ తర్వాత.. చంద్రబాబునాయుడు, నారా లోకేష్, పవన్‌కళ్యాణ్, తమ తప్పుకు చెంపలేసుకుని శ్రీ వెంకటేశ్వరస్వామివారిని, ప్రజలను క్షమాపణ కోరాల్సింది పోయి.. అంతా కూడబలుక్కుని మళ్లీ మళ్లీ అవే అబద్ధాలు నిజమనిపిచ్చేలా చెప్పాలని, గోబెల్స్‌ ప్రచారం చేయాలనే దుర్భుద్ధితో, దురాలోచనతో వక్రీకరించి ఏకంగా ఫ్లెక్సీలు పెట్టారు.

మరి మేమూ ఫ్లెక్సీలు పెడితే?:
    అలా తప్పుడు సమాచారాలతో, తప్పుడు విషయాలతో కులమతాలను రెచ్చగొట్టే విధంగా, అబద్ధాలతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా?. మరి ఇదే మాదిరిగా మేము కూడా ఫ్లెక్సీలు పెడితే మీరు ఒప్పుకుంటారా?. ఇదే చంద్రబాబును. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అని ఎన్నికలప్పుడు మోసం చేశావు. ఇంటింటికీ బాండ్లు పంపించావు. ఎన్నికలు అయిపోయాక మోసం చేశావు అని చెప్పి ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటావా చంద్రబాబూ? అబద్ధాలు చెబుతూ, నిజాలు వక్రీకరిస్తూ అన్యాయాలు చేస్తున్న ఈ వ్యక్తి మీద, మేము కూడా ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటారా?.

ప్రశ్నిస్తే సహించలేకపోతూ ఏం చేస్తున్నారు?:
    దుర్భుద్ధితో ఫ్లెక్సీలు పెట్టి భావోద్వేగాలను రెచ్చగొడుతున్న చంద్రబాబును ఎవరైనా.. ఎందుకయ్యా అబద్ధాలు చెప్పావు. అన్యాయం చేశావు. ఎందుకయ్యా శ్రీ వెంకటేశ్వరస్వామివారి ప్రతిష్టను దెబ్బతీశావు అని గట్టిగా నిలదీస్తే, ప్రశ్నిస్తే ఆయన చేసింది ఏంటి? 
    అంబటి రాంబాబు మీద దాడి. అది కూడా ఏ రకంగా?. ఆరోజు (గత శనివారం) ఉదయం ఆయన గుడికి వెళ్లి, చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని పూజ చేసి బయటకు వస్తుంటే, గుడి నుంచి ఆయన ఇంటికి వచ్చే మార్గంలో ఏకంగా ఈ మాదిరిగా కట్టెలు పట్టుకుని పోలీసులను పెట్టుకుని, ఆయన్ను అడ్డుకున్నారు.
(అంటూ కర్రలు పట్టుకున్న టీడీపీ కార్యకర్తల ఫోటో చూపారు)
    కారులో ఉన్న రాంబాబును అడ్డగించి, కారును బాదుతూ, పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలు అంటూ బూతులు తిట్టారు. పక్కనే పోలీసులు ఉంచుకుని, ఒకేసారి అంత మంది చేతిలో కర్రలతో కారు మీద పడిన దుండగులు వచ్చి బూతులు తిడుతూ మీదకు రావడంతో ఆయన కాస్త ఘాటుగా స్పందించాడు. ఆ సందర్భంగా ఆయన నోటి నుంచి ఒక తిట్టు పదం అనూహ్యంగా వచ్చింది.
    నేను అడుగుతున్నా.. ఇదే చంద్రబాబును, ఇదే పవన్‌కల్యాణ్‌ను, ఇదే నారా లోకేష్‌ను.. మీరు తిట్టే తిట్లకు ఎటువంటి రియాక్షన్‌ అవసరం లేదు. మీ మీద ఎటువంటి అటాక్‌ లేకున్నా రొటీన్‌గా తిడుతున్నారు. ఇదేం కొత్తగా జరిగేది కాదు. మీరు తిడితే ఒకరకంగా ఉంటుంది. అంబటి రాంబాబు తన ప్రాణం మీదకు వచ్చినప్పుడు రియాక్షన్‌గా తిడితే మాత్రం ఇంకో రకంగా దాన్ని చిత్రీకరించారు.

సంస్కారంతో అంగీకరించారు:
    అలా తిట్టినప్పటికీ రాంబాబు ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఉదయం జరిగిన విషయమంతా వివరించి.. అంత మంది తన మీద పడి బండబూతులు తిట్టడంతో, తాను అలా తిట్టాల్సి వచ్చిందని చెబుతూ.. ఆయన పెద్ద మనిషి కాబట్టి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి నేను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. 
    అంటే తన మీద దాడి జరుగుతున్నా, తనను ఒకవైపు తిడుతున్నా, అప్పుడు భావోద్వేగంలో ఆయన రెండు తిట్లు తిట్టినందుకు ఇంటికొచ్చి బాధపడి ప్రెస్‌మీట్‌ పెట్టి మీడియా సమక్షంలో ఆయన దానికి వివరణ ఇస్తూ.. అప్పుడు నేను తిట్టకుండా ఉంటే బాగుండేది. అయినా దానికి నేను చింతిస్తున్నాను అని సంస్కారం కలిగిన వ్యక్తిగా మాట్లాడారు. 

అదే సంస్కారంతో క్షమాపణ కోరినా..:
    అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి. కానీ వాళ్లు ఏం చేశారు. దాన్ని వక్రీకరిస్తూ.. దాన్ని ట్విస్ట్‌ చేస్తూ.. ఏకంగా అంబటి రాంబాబును హత్య చేయడానికి.. ఏకంగా సాయంత్రం ఐదు గంటల నుంచి అర్థరాత్రి వరకు సాక్షాత్తూ ఎమ్మెల్యే గల్లా మాధవి తన మనుషులను వేసుకుని వచ్చి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారు. ఐదు కార్లు ధ్వంసం చేశారు. ఇంట్లో కిటికీల అద్దాలు, సామాగ్రి ధ్వంసం చేశారు. పక్కనున్న ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు. వారి ప్రాణాలకు నష్టం జరిగే విధంగా.. వారిని తిడుతూ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం. ఈయన ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు. సాక్ష్తాత్తూ రాంబాబు అన్న ఆఫీసును పగలగొడుతున్నప్పుడు తీసిన ఫొటో ఇది. అంబటి రాంబాబు అన్న ఆఫీసును కాలుస్తున్న ఫొటో ఇది.
(అంటూ మీడియాకు వారి ఫోటోలు చూపారు)

ఇది హత్యాయత్నం కాదా? కుట్రలో భాగం కాదా?:
    నేను అడుగుతున్నా.. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే సాయంత్రం  5 గం. నుంచి అర్థరాత్రి వరకు జరిగాయి. పోలీసుల సమక్షంలోనే ఐదు కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు, ఆఫీసు మొత్తం తగలబెట్టారు. ఇంట్లో అద్దాలు, సామాగ్రిని, ఆఫీసులో ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ఇంట్లో మహిళలు ఉన్నారని చూడకుండా లోపలికి వచ్చి ధ్వంసం చేశారు. నేను అడుగుతున్నా.. ఇది హత్యాయత్నం కాదా?. మరి పోలీసులు దగ్గరుండి చేయించారు. అది కుట్రలో భాగం  కాదా?.
    బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులు, తమ పని చేసి ఉంటే, ఈ మాదిరిగా జరిగేదా? ఇక్కడి నుంచి డీజీపీ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు ఎంత దూరంలో ఉన్నాయి. ఎస్సీ ఆఫీసు కూత వేటు దూరంలో ఉంది. ఎంత మంది డీఎస్పీలు లేరు. ఎంత మంది సీఐలు లేరు. మంగళగిరిలో డీజీపీ ఆఫీసు ఉంది. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలో మంగళగిరి ఉంది. అక్కడ పోలీసు బెటాలియన్‌ ఉంది. అయినా ఏ పోలీసు రాలేదు.
    మా పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ తదితర సీనియర్‌ నాయకులు ఇంటలిజెన్స్‌ డీజీకి, డీజీకి, చీఫ్‌ సెక్రటరీకి, ఎస్పీకి, ఐజీ ఇతర అధికారులు, వారి ఆఫీసులకు ఫోన్లు చేస్తే ఎవరూ ఎత్తలేదు. మరి ఇదంతా కుట్రలో భాగం కాదా?
    అంబటి రాంబాబు ఆఫీసు, ఇంటిపై పడి ఐదు కార్లు «ధ్వంసం చేశారు. ఆఫీస్‌కు నిప్పు పెట్టారు. ఇంట్లో అద్దాలు పగలగొట్టారు. ఇంట్లోకి చొచ్చకుని పోయారు. ఆఫీసులో సామాన్లు అన్నీ ఇరగ్గొట్టారు. ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారని చూడకుండా చేసిన పని ఇది. మరి ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా?.

హత్యాయత్నంతో సరిపెట్టలేదు!:
    ఈ దారుణం ఇంతటితో అగిపోలేదు. ఆ రాత్రి అంబటి రాంబాబును అరెస్టు చేశారు. చంద్రబాబుగారిని తిట్టాడని కేసు పెట్టి ఆయనను అరెస్టు చేశారు. అసలు ఆయన ఇంటిపై దాడి చేసి, విధ్వంసం సృష్టించి, హత్యకు ప్రయత్నించి, చివరకు ఆఫీసుకు నిప్పంటించారు. అవన్నీ ఈ ఎమ్మెల్యేగారు, ఆమె భర్త సమక్షంలో జరిగింది. మరి వారి మీద ఏం చర్య తీసుకున్నారు. సింపుల్‌గా స్టేషన్‌ బెయిలిచ్చి పంపించేశారు.
    అదే చంద్రబాబునాయుడుగారిని తిట్టినందుకు అంబటి రాంబాబు మీడియా సమక్షంలో వివరణ ఇచ్చారు. జరిగిన దానికి చింతిస్తూ, క్షమాపణ కూడా కోరారు. అయినా ఆయని ఇంటిపై దాడి చేశారు. అసలు మీరు మనుషులేనా?. ఇది జంగిల్‌రాజ్‌ కాదా?.
    రాంబాబును అక్రమంగా అరెస్టు చేయడమే కాదు. అర్థరాత్రి తర్వాత ఆయన్ను, నల్లపాడు స్టేషన్‌లో ముగ్గురు సీఐలు దారుణంగా హింసించారు. వేధించారు. ఇక మాజీ మంత్రిపట్ల ఆ విధంగా వ్యవహరించడం, టార్చర్‌ చేయడం ఏం న్యాయం?. మరి ఇది జంగిల్‌రాజ్‌ కాక మరేమిటి?.

జోగి రమేష్‌ ఇంటిపై పెట్రోల్‌ బాంబులు!:
    మరుసటి రోజు జోగి రమేష్‌ ఇంటిపై దాడి. అక్కడా మళ్లా పోలీసుల సమక్షంలోనే. అక్కడ ఏకంగా పెట్రోల్‌ బాంబులు. బాటిళ్లలో పెట్రోల్‌ పోసి వాటిని ఇంట్లోకి విసిరారు. మధ్యాహ్నం 2 గం. సా. 5 గం. వరకు విధ్వంసం సృష్టించారు. అప్పుడు అక్కడ దాదాపు 300–400 మంది వరకు పోగయ్యారు. వారంతా అక్కడికి వచ్చేటప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే అదంతా జరిగింది. వారు చూస్తూ ఉండిపోయారు. చివరకు పోలీసుల సమక్షంలోనే జోగి రమేష్‌ ఇంటికి నిప్పంటించే కార్యక్రమం చేశారు.
    దానికి ముందు రోజు విడదల రజిని గుడిలో పూజ చేసుకుని వస్తూ ఉంటే ఆమెను అక్కడే అడ్డగించి తిట్టారు. పోలీసుల సమక్షంలోనే ఆమెపై దాడికి యత్నించారు. ఇంకా ఆశ్చర్యం ఏమంటే.. తిరిగి ఆమె మీదనే కేసు పెట్టారు. అది కూడా ఏమని?. ఆమె గుడికిపోయి వారందరినీ అటాక్‌ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉందని. ఏమన్నా హద్దూ పొద్దూ ఉండాలి మాట్లాడటానికి. మరి ఇది జంగిల్‌రాజ్‌ కాదా?.
    ఇంకా బొల్లా బ్రహ్మనాయుడు చేసిన పాపం ఏంటి? చంద్రబాబునాయుడు, ఆయన కొడుకు, పవన్‌కళ్యాణ్‌కు జ్ఞానోదయం కలగాలని కోరుతూ పూజ చేయడానికి గుడికి బయలుదేరాడు. దారిలో ఆయన మీద కూడా అటాక్‌ చేశారు. అది కూడా పోలీసుల సమక్షంలోనే జరిగింది. కాకాణి గోవర్థన్‌రెడ్డి విషయం కూడా అంతే.

చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలు:
    అసలు తప్పు చేసేది చంద్రబాబు. తప్పుడు ఆరోపణలు చేసింది చంద్రబాబు. అవి తప్సుడు ఆరోపణలు అని చెప్పి దేవుడే మొట్టికాయలు వేసినట్టుగా ఏకంగా సీబీఐ సిట్‌ ఛార్జిషీట్‌ లోనే చెప్పినా, కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌లు నెయ్యిపై క్లీన్‌చిట్‌ ఇచ్చినా, దేవుడు, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఆయన చేస్తూ ఉన్న కార్యక్రమం ఏమిటి?. 
    ప్రతి విషయంలోనూ చంద్రబాబుగారు చేస్తోంది దుర్మార్గపు రాజకీయాలే. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా.
    సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అని ఎన్నికలప్పుడు మాట ఇచ్చాడు. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుంది అని చెప్పి, సంతకాలతో సహా హామీ ఇచ్చాడు.
    మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా? మీకు 36 వేలు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఇదిగో మీకు 15 వేలు. మీ ఇంట్లో రైతులు ఉన్నారా..ఇదిగో మీకు 26 వేలు. మీ ఇంట్లో చిన్నమ్మలు, పెద్దమ్మలు 55 ఏళ్ల వయసులో ఉన్నారా. వాళ్లకు 48 వేలు.  ఇంట్లో పిల్లలు ఉద్యోగం కోసం వెదుక్కుంటున్నారా? వారికి 36 వేలు. ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేసి.. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలు ఇచ్చి ఈ రోజు ఏమంటాడు?. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ చేసేశామంటాడు. అంతగా సిగ్గు లేకుండా అబద్ధాలు అడుతున్నాడు.

తప్పులు, అబద్దాలు మోసాలు ప్రశ్నిస్తే..:
    చంద్రబాబు చేస్తున్నది తప్పని, మోసమని ఎవరైనా ప్రశ్నిస్తే.. సోషల్‌ మీడియా యాక్టివిస్టులపైనా.. ప్రశ్నించే వారిపైన కేసులు పెట్టి జైలుకు పంపుతున్నాడు. అబద్ధాలు చెప్పేది ఆయనే. మోసం చేసేది ఆయనే. ఆ తర్వాత ఆయనను ఎవరైనా ప్రశ్నిస్తే.. వాళ్ల మీద అక్రమ కేసులు పెట్టి అక్రమ సాక్షాలు çసృష్టించి, జైలుకు పంపిస్తున్నాడు. చివరకు పిల్లలని కూడా చూడకుండా, సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై గంజాయి కేసులు పెట్టి జైలుకు పంపి వారి కెరీర్‌ నాశనం చేస్తున్నాడు.

చంద్రబాబు పాలనలో అన్నీ అక్రమాలే:
    చంద్రబాబు చేసేవన్నీ తప్పులే. చెప్పేవన్నీ అబద్ధాలే. చేసే వన్నీ మోసాలే.. ఆయన లిక్కర్‌ నడుపుతాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఆక్షన్‌ బాడీ.. చంద్రబాబుగారి టిడీపీ సైన్యానికి లాటరీలో ప్రైవేటు షాపులన్నీ కట్టబెడతాడు. ఆ ప్రైవేటు షాపుల ఆధ్వర్యంలోనే ఏకంగా ఎమ్మెల్యేలు దగ్గరుండి ప్రతి గ్రామంలో ఆక్షన్‌ పాడుతూ.. బెల్టు షాపులు అన్నీ నిర్వహిస్తున్నారు. లిక్కర్‌ షాపులç ³క్కనే ఇల్లీగల్‌ పర్మిట్‌ రూములు నడుపుతూ పెగ్గులతో లిక్కుర్‌ అమ్ముతున్నారు. ఇవన్నీ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు. అవి పక్క దోవలో చంద్రబాబుగారికింత. ఎమ్మెల్యేల కింత. వారి మాఫియా సైన్యానికింత అని లూటీ పద్ధతిలో పంచుకుంటున్నారు. బెల్టు షాపులు అమ్ముతున్నారు. ప్రతి గ్రామంలో ఒకటి కాదు. రెండు కాదు. పది వరకు బెల్టు షాపులు ఉన్నాయి. అంతటా లిక్కర్‌ ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. 
    అది సరిపోదన్నట్లు ఏకంగా ప్రతి ఐదు బాటిళ్లకు ఒక బాటిల్‌ నకిలీ. వీళ్లంతట వీళ్లే కుటీర పరిశ్రమను పెట్టి చీప్‌ లిక్కర్‌ వీళ్లే తయారు చేసి అమ్ముతున్నారు. ఆ కల్తీ లిక్కర్‌ తాగి ఇంజినీరింగ్‌ విద్యార్థులు నలుగురు చనిపోయారు. 
    నకిలీ లిక్కర్‌ను టీడీపీ నాయకులే తయారు చేస్తూ, సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయారు. తంబళ్లపల్లెలో టీడీపీ తరఫున పోటీచేసిన జయచంద్రారెడ్డి కల్తీ లిక్కర్‌ తయారు చేస్తూ ఎక్సైజ్‌ పోలీసులకు దొరికాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నదంతా ఇదే. ఎక్సైజ్‌ అధికారులకు, జయచంద్రారెడ్డికి వాటాలు పంచుకోవడంలో తేడాలొచ్చి దొరికిపోతే మా నాయకుడు జోగి రమేష్‌ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు.

జోగి రమేష్‌కు అది సాధ్యమా?:
    ఒకపక్క రాక్షస పాలన సాగిస్తున్న టీడీపీ నాయకులతో కలిసి మా పార్టీకి చెందిన జోగి రమేష్‌ కల్తీ లిక్కర్‌ తయారు చేయడం సాధ్యమేనా?  వీళ్లు నకిలీ లిక్కర్‌ తయారు చేసి చంద్రబాబునాయుడు తీసుకొచ్చిన బెల్ట్‌ షాపుల్లో జోగి రమేష్‌ అమ్ముతున్నాడని అక్రమ కేసు పెట్టారు. నకిలీ, కల్తీ లిక్కర్‌ తయారు చేసేది వారే, బెల్ట్‌ షాపులు తీసుకొచ్చింది వారే.. వాటిలో కల్తీ లిక్కర్‌ అమ్మకాలు చేసేదీ వారి మనుష్యులే. కానీ కేసు మాత్రం జోగి రమేష్‌ మీద పెట్టి జైలుకు పంపారు. 

జంగిల్‌రాజ్‌కు పరాకాష్ట:
    ఆయనే (చంద్రబాబు) తప్పు చేస్తాడు. ఆయనే అబద్దాలు చెబుతాడు. ఆయనే అన్యాయం చేస్తాడు. ఆయన్ను ఎవరైనా ప్రశ్నిస్తే దొంగ సాక్ష్యాలు సృష్టించి జైలుకు పంపిస్తున్నాడు.
    మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ ల ఇళ్లమీద దాడులు. విడదల రజని కారు మీద, భూమన కరుణాకర్‌ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీద దాడులతో జంగిల్‌రాజ్‌ పరాకాష్టకు చేరింది.

కాపు కులంలో టైగర్‌ అంబటి:
    మాజీ మంత్రి అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌. విలువలున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్‌ చేయడమే కాకుండా నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఆయన్ను తీవ్రంగా దూషించి కొట్టారు. ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని అనుమానం కలుగుతుంది. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. 

రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ పాలన:
    చంద్రబాబు తనకు కావాల్సిన కొంతమందిని మాత్రమే సీఐలు, ఎస్సైలు, డీఎస్పీలు, డీఐజీలుగా నియమించుకున్నారు. ఎస్పీలు గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు. బీహార్‌ లో ఏం జరుగుతుందో తెలియదు కానీ, రాష్ట్రంలో వీరందరితో చంద్రబాబు జంగిల్‌ రాజ్‌ పాలన సాగిస్తున్నారు. దాదాపు 200 మంది సీఐలు, ఎస్సైలు, డీఎస్పీలను కూటమి  ప్రభుత్వం పక్కన పెట్టింది. అలా రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ పాలన సాగుతోంది.

విచారణ చేయిస్తాం. వడ్డీతో సహా చెల్లిస్తాం:
    ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. కళ్లు మూసి తెరిచేలోపు మరో మూడేళ్లు గడిచిపోతాయి. అప్పుడు వచ్చేది మా ప్రభుత్వమేనని ఖచ్చితంగా చెబుతున్నా. చంద్రబాబు నాయుడు, ఆయన కొడుక్కి, ఆయనకి కొమ్ము కాస్తున్న ఇతర పార్టీ నాయకులకు, కొంతమంది పోలీసు అధికారులకు కూడా చెబుతున్నా.. ఎల్లకాలం ఇలాగే అన్యాయం చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఖచ్చితంగా వీరికి మొట్టికాయలు పడతాయి.
    రేపు మా ప్రభుత్వం వచ్చాక ఈ అరాచకాలన్నింటి మీదా విచారణలు చేయిస్తాం. వడ్డీతో సహా చెల్లిస్తాం. అందర్నీ కూడా బోన్లలో నిలబెట్టి సాక్ష్యాధారాలతో సహా వారి యూనిఫాంలు విప్పిస్తాం. ఈ దారుణాల్లో భాగస్వాములైన కూటమి నాయకులు ఎవరున్నా వారిని జైలుకు పంపించి బాధితులకు న్యాయం చేసి తీరుతామని ప్రతి ఒక్కర్నీ హెచ్చరిస్తున్నాను.

మా కార్యకర్తలు ఈ తీరుగానే స్పందిస్తే..:
    రాష్ట్రంలో విషపు విత్తనాలు నాటుతున్నారు. ఈ సంస్కృతిని ఇప్పటికైనా ఆపండి. లేదంటే రేపొద్దున్న ఈ విషపు విత్తనాల కారణంగా, కూటమి నాయకులు చేస్తున్న అన్యాయాల కారణంగా గ్రామ స్థాయి నుంచి ప్రతి వైయస్సార్సీపీ కార్యకర్త, నాయకుడు దెబ్బతిని ఉన్నారు. రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ విషపు విత్తనాలు పెరిగి పెద్దవై చెట్టుగా మారినప్పుడు, మా నాయకులు, కార్యకర్తలు ఇలాగే స్పందిస్తే మీకు ఏం జరుగుతుందో ఆలోచన చేసుకోవాలని చంద్రబాబుని గట్టిగా హెచ్చరిస్తున్నా.

చేతనైతే ఇవన్నీ చేసి చూపండి:
    ఇప్పటికైనా దేవుడంటే భయం భక్తితో వ్యవహరించి బుద్ధి జ్ఞానం తెచ్చుకుని మంచి పరిపాలనతో ప్రజలకు మేలు చేసి వారి వద్ద మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు చేయాలి. చేతనైతే సూపర్‌ సిక్స్‌ సూపర్‌ సెవెన్‌ విషయంలో అబద్ధాలు చెప్పకుండా, మోసాలు చేయకుండా నెరవేర్చే కార్యక్రమం చేయాలి. కూటమి వచ్చాక నిర్వీర్యం అయిన స్కూళ్లను బాగుచేయాలి. 8 క్వార్టర్లకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్‌ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలి. పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే ఆలోచన చేయాలి. చేతనైతే ఆపేసిన మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేసి పేద, మధ్యతరగతి వారికి నాణ్యమైన వైద్యం అందించే కార్యక్రమం చేసి చూపించాలి. చేతనైతే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ కింద రూ. 10 వేలిచ్చి వదిలేశారు. పెండింగ్‌ రూ.30 వేలు కూడా తక్షణం చెల్లించాలి. వ్యవసాయాన్ని చక్కబెట్టే కార్యక్రమం చేయాలి. 
    కానీ వీటన్నింటి మీద ధ్యాస లేదు. అన్నీ అబద్ధాలు, మోసాలు. ప్రశ్నించే వారి గొంతులు నొక్కడమే. వీరికి వత్తాసు పలుకుతూ, తోడుగా ఉండి నడిపిస్తున్న కొంతమంది తొత్తులు లాంటి పోలీసులు, అధికారులకు జ్ఞానోదయం కావాలని కోరుకుంటున్నాను.

ప్రతిఘటిస్తాం. పోరాడుతాం. ఎండగడతాం:
    ఇలాంటివి మళ్లీ జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. దానికి ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది. అవసరమైతే రాష్ట్ర వ్యాప్త బంద్‌కి కూడా పిలుపునిచ్చే దానికి వెనుకడుగు వేయం. ఇప్పటికైనా ఆపకపోతే ఇంకా అడుగులు వేగంగా పడుతాయి. ఇష్యూస్‌ పెద్దవి అవుతాయని చంద్రబాబునాయుడిని గట్టిగా హెచ్చరిస్తున్నా. ఈ ఘటనలపై ఎన్‌హెచ్చార్సీకి ఫిర్యాదు చేయబోతున్నాం. సుప్రీంకోర్టు తలుపులు కూడా తడుతాం. అన్నిరకాల పోరాటాలు చేస్తాం.

అలా అనుకుంటే చంద్రబాబు మూర్ఖుడు:
    వైయస్సార్సీపీ మీద ఈ రకంగా దాడులు చేస్తే కార్యకర్తలు భయపడతారని చంద్రబాబు అనుకుంటే చంద్రబాబు కన్నా మూర్ఖుడు ఇంకొకరు లేనట్టే. బంతిని ఎంత బలంగా నేలకేసి కొడితే అంతకన్నా నాలుగింతల బలంగా పైకి లేస్తుందన్నట్టుగా.. వైయస్సార్సీపీ కార్యకర్తలు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకలించి వేస్తారు. 

అలా దిగజారిన నాయకుడు ఎక్కడా ఉండడు:
    చంద్రబాబు అనే వ్యక్తి ఎలాంటి దుర్మార్గుడు, రాక్షసుడో ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిసిందని తాను చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పు అని స్పష్టంగా తేలడంతో, ఆధారాలతో సహా రుజువు కావడంతో ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి గ్లోబెల్స్‌ ప్రచారానికి తెర లేపారు. ఈ అంశంలో తానే ఓ కమిషన్‌ వేస్తామని చెబుతున్నారు. సీబీఐ చెప్పింది తప్పు, ఎన్‌డీడీబీ రిపోర్టు, ఎన్‌డీఆర్‌ఐ రిపోర్టు తప్పు అని చెప్పిస్తూ, తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి మరో కమిషన్‌ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. 
    అలా తాను చెప్పినట్టే నివేదిక రావాలని ఒత్తిడి చేసి, దానిని రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడిని ప్రపంచ చరిత్రలో వెతికినా దొరకడం కష్టం అని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

అడుగడుగునా అంతులేని అభిమానం. ఎక్కడికక్కడ కట్టడికి ప్రభుత్వం ప్రయత్నం. అయినా ఆగని అభిమాన తరంగం
    తాడేపల్లి నుంచి బయలుదేరిన శ్రీ వైయస్‌ జగన్‌కు అడుగుడుగునా ప్రజలు ఘనస్వాగతం పలికారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం, విధ్వంస పాలనతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు, జగన్‌ను చూసేందుకు పోటెత్తారు. దీంతో తాడేపల్లి నుంచి గుంటూరు, సిద్ధార్థనగర్‌లో ఉన్న రాంబాబు ఇంటికి చేరుకోవడానికి దాదాపు 6 గంటలు పట్టింది.
కుంచనపల్లి క్రాస్‌రోడ్స్, ఖాజా టోల్‌గేట్, మంగళగిరి బైపాస్, కాకాని, ఏటుకూరు బైపాస్‌ సర్వీస్‌ రోడ్, గుంటూరులోని కేవీపీ (వీఐపీ) రోడ్, చుట్టుగుంట, కలెక్టర్‌ ఆఫీస్, స్తంభాల గరువు, గుజ్జనగుండ్ల మీదుగా సిద్దార్ధనగర్‌లోని అంబటి రాంబాబు నివాసానికి శ్రీ వైయస్‌ జగన్‌ చేరుకున్నారు.
    మరోవైపు శ్రీ వైయస్‌ జగన్‌ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రతి చోటా ప్రయత్నించింది. ఎక్కడకక్కడ జగన్‌గారి వెంట వస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. పలు చోట్ల బారికేడ్లు అడ్డం పెట్టారు. ఒకటి, రెండు చోట్ల లారీలను కూడా రోడ్డు మీద అడ్డుగా పెట్టుకుని అడ్డుకున్నారు. అయినా జగన్‌గారి అభిమానులు, కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. ఆయన వెంట తరలి వచ్చారు. గుంటూరు నగరం జనసముద్రంగా మారింది. 

Back to Top