వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఖమ్మం జిల్లా అభిమానులు

 
తాడేప‌ల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఖమ్మం జిల్లాకు చెందిన వైయ‌స్ఆర్‌సీపీ అభిమానులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వైయస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన భారీ ర్యాలీ నేపథ్యంలో తమపై అక్రమంగా కేసులు నమోదు చేసిన వైనాన్ని వారు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

పుట్టినరోజు వేడుకల సందర్భంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించినందుకే ఖమ్మం జిల్లాలోని వైయ‌స్ఆర్‌సీపీ అభిమానులపై ఏకంగా 11 మందిపై క్రిమినల్ కేసులు పెట్టి, అందులో 8 మందిని 13 రోజుల పాటు రిమాండ్‌కు పంపినట్లు వారు వివరించారు. ఈ కేసుల వెనుక ఖమ్మంకు చెందిన ఓ మంత్రి, ఆయన తనయుడి ప్రమేయం ఉందని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్లు ప్రయోగించి తమను జైలుకు పంపారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన వైయస్‌ జగన్‌, తెలంగాణలో వైయ‌స్ఆర్‌సీపీఅభిమానులు, కార్యకర్తలు, పార్టీ క్యాడర్‌ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున అవసరమైన న్యాయసహాయాన్ని అందించేందుకు వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్‌ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ మీ వెంటే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నేత పుత్తా ప్రతాప్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ జగన్‌ను కలిసిన ఖమ్మం జిల్లా అభిమానుల్లో ఆలస్యం సుధాకర్‌, మర్రి శ్రీనివాస్‌, యర్రా నాగరాజు రెడ్డి, గంగారపు మురళీ, సరికొండ రామరాజు, గంగరబోయిన రవి, పగిళ్ళ నాగేష్‌, ముదిరెడ్డి శివారెడ్డి తదితరులు ఉన్నారు.

Back to Top