విశాఖపట్నం: విశాఖపట్నం శ్రీహరిపురంలో 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేష్ ఆధ్వర్యంలో, పీవీఎస్ హెల్పింగ్ హాండ్స్ ఛారిటబుల్ ట్రస్ట్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్వచ్ఛంద రక్తదాతలు హాజరై రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ శిబిరంలో ముఖ్య అతిథిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొని, రక్తదానం ప్రాధాన్యతపై మాట్లాడారు. రక్తదానం మహత్తర సేవ అని, ఒకరి రక్తం మరొకరి ప్రాణాలను కాపాడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ తరహా సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖుల సమక్షంలో స్వచ్ఛందంగా రక్తదానం చేసిన దాతలందరికీ ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. రక్తదాతలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు, సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి, డిప్యూటీ మేయర్, రాష్ట్ర మరియు మాజీ జిల్లా స్థాయి వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జివిఎంసీ కార్పొరేటర్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, నగర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.