గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడక

ఆయనతో పచ్చి అబద్దాలు మాట్లాడించిన కూటమి ప్రభుత్వం

గణతంత్ర దినోత్సవ వేదికగా అబద్దాలు చెప్పించడం దుర్మార్గం

ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

ఎన్నికల మందు సూపర్ సిక్స్ పేరుతో భారీ హామీలు

ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అంటూ ప్రకటనలు

2 ఏళ్లు గడుస్తున్నా కానరాని జాబ్ క్యాలెండర్

ఒక్క నిరుద్యోగికీ అందని రూ.3వేల భృతి

యువతను దారుణంగా మోసగించిన కూటమి ప్రభుత్వం

అమరావతి రైతులకూ మొండిచేయి

మండిపడ్డ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

తల్లికి వందనం పథకంలోనూ కోతలే

30 లక్షల మంది విద్యార్థులు తల్లులకు మొండిచేయి

అరకొరగా అన్నదాత సుఖీభవ, ఉచిత సిలిండర్ పధకాలు 

డైవర్షన్ కోసమే పీ-4 పేరుతో కొత్త డ్రామా

ఏ ఒక్క వర్గానికీ మేలు చేయని చంద్రబాబు సర్కారు

ప్రత్యేక విమానాల్లో తిరగడం తప్ప సాధించిందేమీ లేదు

రాష్ట్రంలో లోపించిన శాంతిభద్రతలు

మహిళలకు కరువైన రక్షణ 

వైయ‌స్ఆర్‌సీపీని నిందించడమే హోంమంత్రి డ్యూటీ

కూటమి పాలనపై వెల్లంపల్లి శ్రీనివాస్ ఆక్షేపణ

తాడేపల్లి: ప్రజలకిచ్చిన హామీల అమల్లో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం... గణతంత్రదినోత్సవం సాక్షిగా గవర్నర్ తో పచ్చి అబద్దాలు మాట్లాడించారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడక అని ఆక్షేపించారు. ఎన్నికల మందు సూపర్ సిక్స్ పేరుతో భారీ హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. 
ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న చంద్రబాబు... 2 ఏళ్లు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ జాడే లేకపోగా.. నిరుద్యోగ భృతి ఊసేలేదని తేల్చి చెప్పారు. ఒకవైపు నిరుద్యోగులను  దారుణంగా మోసగించిన కూటమి ప్రభుత్వం.. మరోవైపు రాజధాని కోసం నమ్మి భూములిచ్చిన 
అమరావతి రైతులకూ మొండిచేయి చూపించడంపై మండిపడ్డారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ సహా అన్ని పథకాల్లోనూ కోత పెట్టిన చంద్రబాబు.. పీ 4 పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని తేల్చి చెప్పారు. ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ప్రజాధనం వృధా చేయడం తప్ప సాధించిందేమీ లేదన్నారు. రూ. 3 లక్షల కోట్లు అప్పు చేసినా... హామీల అమల్లో విఫలమై ప్రజలకు మొండిచేయి చూపించిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. 
 ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..

గవర్నర్ ప్రసంగంలో అబద్దాలు...

కూటమి ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ ప్రసంగం ద్వారా అబద్దాలు చెప్పించింది. అన్నీ సత్యదూరమైన మాటలే చెప్పించింది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని ఆయనతో చెప్పించారు. కూటమి నాయకుల పాలనంతా అబద్దాలతోనే సాగుతుంది. చివరకు గవర్నర్ గారితో కూడా నిజాలు చెప్పించే ప్రయత్నం చేయలేదు. ప్రధానంగా ఎన్నికల ముందు గెలవడానికి కూటమి నేతలు చెప్పిన పచ్చి అబద్దం సూపర్ సిక్స్. ఇందులో యువతకు20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ. 3 వేల నిరుద్యోగభృతి అని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 జనవరి, 2026 జనవరి గడిచిపోయాయి కానీ ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. కనీసం నిరుద్యోగభృతి కూడా ఇవ్వలేదు. కానీ గణతంత్రదినోత్సం సందర్బంగా గవర్నర్ గారి ప్రసంగంలో మాత్రం 20 లక్షలు ఉద్యోగాలిస్తున్నామని చెప్పించారు. మరోవైపు సీఎం చంద్రబాబు జాతీయ మీడియాతో ప్రతినిధితో మాట్లాడుతూ 23 లక్షల కోట్ల మందికి ఉద్యోగాలిచ్చామని చెబుతున్నారు. ఈ ఏడాది ఇదే అతిపెద్ద జోక్. తన వ్యాఖ్యలతో చంద్రబాబు రాష్ట్ర పరువును జాతీయ స్దాయిలో తీసేశారు.

పథకాలన్నింటిలోనూ కోతలే...

వైయస్.జగన్ హయాంలో ప్రతి విద్యార్ధికి ఏడాదికి రూ15వేలు అమ్మఒడి పథకం కింద తొలి ఏడాదిలోనే అమలు చేశారు. కూటమి పాలన తొలిఏడాదిలోనే ఈ పథకాన్ని అటకెక్కించారు. ఆ తర్వాత రెండో ఏడాది రూ.15వేలకు బదులు రూ.13 వేలు ఇస్తామని చెప్పారు. ఆ రోజు ఇదే రూ.13వేలు  వైయస్.జగన్ ఇస్తుంటే నోటి వంకర్లుపోయిన నారా లోకేష్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. తీరా ఆ రూ.13వేలు కూడా ఇవ్వకుండా...తల్లికి వందనం అమౌంట్ రూ.9, రూ.8, రూ.7 వేలు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా పద్దతి లేకుండా జమ చేశారు. ఇందులో కూడా సుమారు 30 లక్షల మంది పిల్లలకు ఎగనామం పెట్టారు. అదే విధంగా రైతుల పరిస్థితి చూస్తే.. వారు పండించిన ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయింది. గిట్టుబాటు ధర రావడం లేదని వైయస్.జగన్ ప్రశ్నిస్తే... ఈ ప్రభుత్వ పెద్దలు కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకుంటున్నారు.

రైతులు సంక్రాంతి పండగ సంతోషంతో కాకుండా కన్నీళ్లతో జరుపుకున్న దుస్థితి కూటమి ప్రభుత్వంలో దాపురించింది. ఏడాదికి రూ.20 వేలు రైతుకు పెట్టుబడి సాయం అని చెప్పారు. ఎక్కడ చేశారో చెప్పాలి?
ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అని హామీ ఇచ్చారు. 20 నెలల కాలంలో 6 సిలిండర్లు  రావాలి, కానీ రాష్ట్రంలో ఏ మహిళలను అడిగినా నిజం చెబుతారు. ఏడాదికి 3 సిలిండర్లు ఇచ్చిన ఇళ్లు రాష్ట్రంలో ఒక్కటీ లేదు.   
వైయస్.జగన్ చేయూత పధకం ద్వారా ప్రతి ఏడాది రూ.18వేలు చివరకు ఎన్నికల సంవత్సరం కూడా అందిస్తే... మీరు మాత్రం మహిళాశక్తి పేరుతో ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చాడు. వైయస్.జగన్ హయాంలో  40 ఏళ్లు దాటితే ఇచ్చారు, మేం మాత్రం 18 ఏళ్లు దాటితే ఇస్తామని ఈ పెద్దమనిషి హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పీ-4 పేరుతో ధనవంతులు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని చెబుతున్నాడు. అది వాస్తవంలో సాధ్యమయ్యే పనా? దాన్ని గొప్పగా అమలు చేస్తామని గవర్నర్ గారితో చెప్పించారు. ఒక్క ఆడబిడ్డకైనా నెలకు రూ.1500 నిధి అందిందా? కూటమి నేతలు సమాధానం చెప్పాలి? మీరు సమాజంలో ఆర్ధికంగా ఉన్నతిలో ఉన్నవారిని భయపెట్టి పీ-4లో చేర్చారే తప్ప ఈ పథకం ఎక్కడా అమలు కావడం లేదు.

మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆర్టీసీలో 16 రకాల బస్సులుంటే.. కేవలం 6 రకాల బస్సుల్లోనే అవకాశం కల్పిస్తున్నారు. ఈ 20 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ఇది మా పథకం అని చెప్పగలరా? కోవిడ్ టైంలో రాష్ట్రం, దేశం విలవిల్లాడుతున్నా కూడా వైయస్.జగన్ హయాంలో ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేశారని ధైర్యంగా చెప్పగలం.
పెన్షన్ రూ.1000 పెంచామని చెబుతున్నారు. కానీ సుమారు 5 లక్షల మందికి పెన్షన్లు కట్ చేసి.. ఈ అమౌంట్ పెంచారు. వాస్తవానికి వైయస్.జగన్ ప్రభుత్వం రావడం కంటే ముందు 65 ఏళ్లకు పెన్షన్ ఉంటే.. ఆయన వచ్చిన తర్వాత దాన్ని 60 ఏళ్లకు తగ్గించారు. దాంతో పాటు ప్రతి మూడు నెలలకు సాచ్యురేషన్ విధానంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి మీరు కొత్త పెన్షన్లు ఇచ్చారో చెప్పాలి. ఎన్నికల్లో 50 ఏళ్లు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదు. 
మీరు పెంచిన అమౌంట్ ను తగ్గించిన పెన్షన్ల తో ఇస్తున్నారే తప్ప.. కొత్తగా మీరు చేసిందేమీ లేదు.
ఇచ్చిన హామీల్లో ఒక్క పధకాన్ని అమలు చేయని ఈ ప్రభుత్వం నిరంతరం ప్రచార ఆర్భాటాలు తప్ప చేసిందేమీ లేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ మూడు స్పెషల్ ఫ్లైట్లలో తిరగడం తప్ప చేసిందేమీ లేదు. దావోస్ వెళ్లి మీరు తీసుకొచ్చిన పరిశ్రమలేంటో చెప్పండి. దావోస్ వెళ్లి పెట్టుబడులు గురించి మాట్లాడాల్సిన మీరు అక్కడ కూడా వైయస్.జగన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగడం మీ అసమర్థతకు నిదర్శనం.  లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీకి రూ.5వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఉచితంగా కట్టబెడుతున్నారు. దీనివల్ల పేదలకు ఏం మేలు జరుగుతుంది? 

గవర్నర్ ప్రసంగం తప్పుల తడక.
ఆయన ప్రసంగం ద్వారా ప్రజలకు ఒరిగింది శూన్యం. కూటమి 20 నెలల పాలనలో అభివద్ధి, సంక్షేమం శూన్యం. విద్యార్ధులు, రైతులకు, ఉద్యోగులు, వ్యాపారులకు కనీస ప్రయోజనం లేదు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప ఒరిగిందేమీ లేదు. తన పార్టీ కార్యకర్త చనిపోతే స్పెషల్ ఫ్లైట్లలో వచ్చి పరామర్శించిన పవన్ కళ్యాణ్.. ఆయనకు చేసిందేమీ లేదు. ఇన్సూరెన్స్ డబ్బులివ్వడానికి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చారు..  కనీసం ఆ స్పెషల్ ఫ్లైట్ ఖర్చులు ఇచ్చినా ఆ కార్యకర్త కుటుంబం బాగుపడి ఉండేది.  ఏ వర్గం ప్రజలు కూడా కూటమి పాలనలో బాగుపడలేదు.
వైయస్.జగన్ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి కాలేజీల నిర్మాణం చేపడితే.. వాటిని పీపీపీ పేరుతో కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేస్తుంది.  వైయస్.జగన్ హయాంలో ప్రభుత్వ స్కూళ్లు విద్యార్ధులతో కళకళలాడుతుంటే... కూటమి పాలనలో వెలవెలబోతున్నాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ తన శాఖలో తప్ప అన్నింటిలోనూ వేలుపెడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహించడం తప్ప... కూటమి ప్రభుత్వం ఏం చేయలేదు. 
2014-19 వరకు మీరే అధికారంలో ఉన్నారు. 10 ఏళ్లు హైదారాబాద్ ఉమ్మడి రాజధానిగా అవకాశం ఉన్నా.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు రాత్రికిరాత్రే పారిపోయి వచ్చిన మాట నిజం కాదా?  ఆ రోజు ప్రభుత్వ భూముల్లో అమరావితి రాజధాని నిర్మాణం చేసి ఉంటే ఈ పాటికే పూర్తై ఉండేది. అమరావతిని నాశనం చేసింది చంద్రబాబే. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఇదంతా చేశాడు. రాజధానికి కోసం రైతులు వేలాది ఎకరాలు భూమిలిస్తే.. అవి సరిపోవన్నట్టు మరలా మరో 40 వేల ఎకరాలు భూ సమీకరణ పేరుతో వారిని మోసం చేయడం తప్పు కాదా? భూమిలిచ్చిన పాపానికి న్యాయం జరగక మీ సభల్లోనే రైతులు గుండాగి చనిపోతున్నా మీకు ఏం పట్టడం లేదు. రాజధాని నిర్మాణం పేరుతో దోచుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అడుగు రూ.3-4వేలు ఖర్చయ్యే చోట రూ.15 నుంచి రూ.20 వేల వరకు పెంచి.. కాంట్రాక్టులకు మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు దండుకుంటున్నారు. ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనిపించకుండా పోతున్నాడు. వారాంతం వస్తే అందరూ చలో హైదరాబాద్ అని స్పెషల్ ఫ్లైట్లలో క్యూ కడుతున్నారు. అందుకే రాష్ట్రం అధోగతి పాలైంది.

దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ శాంతిభద్రతకల పరిరక్షణలో అట్టడుగున ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీలను వేధిస్తున్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. హోమంత్రి అనిత తన శాఖ మీద సమీక్ష నిర్వహించిన పాపాన పోలేదు. నిత్యం వైయస్.జగన్ ను తిట్టడమే ఆమె పని. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద విపరీతంగా లైంగిక దాడులు జరుగుతుంటే మాత్రం హోం మంత్రి నోరు మెదపరు. 
ఇవాల్టి గవర్నర్ ప్రసంగం ద్వారా అయినా నిజాలు చెబుతారని ఆశిస్తే.. అన్నీ అబద్దాలే ఉన్నాయి. అన్ని పథకాలను అమలు చేశామని చెబుతున్నారు. విపరీతంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ పథకాలే అమలు చేయలేదు. మరోవైపు ఇప్పటివరకు కేవలం 20 నెలల్లోనే రూ.3.25 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. 
ఐదేళ్లలో మా ప్రభుత్వ హయాంలో ఇంతకంటే తక్కువ అప్పు చేశాం.. ఆ మొత్తం అంతా ప్రజా సంక్షేమం కోసం ఖర్చుపెట్టి పథకాలు అందించాం. కానీ కూటమి ప్రభుత్వం తానిచ్చిన హామీల అమల్లో పూర్తిగా వైఫల్యం చెందడమే కాకుండా గవర్నర్ గారి ప్రసంగం ద్వారా అబద్దాలు పలికించారని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రజల కిచ్చిన హామీల అమల్లో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయిని  ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చంద్రబాబు  చేసిన మోసాలను వైయ‌స్ఆర్‌సీపీ కచ్చితంగా ప్రజలకు తెలియజేస్తుందని తేల్చి చెప్పారు.

అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ..
తిరుమల లడ్డూ  వ్యవహారంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి లోకేష్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. పార్టీ కార్యాలయంలో చంద్రబాబు శ్రీ వేంకటేశ్వరస్వామివారిపై అబద్దాలు మాట్లాడ్డం బాధాకరం.  లడ్డూ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. వాస్తవాలు బయటకు రావడం ఖాయం.  తప్పుడు మాటలు మాట్లాడిన వారు, దీక్షలు చేసిన వారు పశ్చాత్తాపం చెందేలా నివేదిక ఉండబోతుంది. 

అసెంబ్లీకి ఎమ్మెల్యేలు హాజరు కాకపోతే.. నో వర్క్ నో పే విధానం ఉండాలన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ..  అసెంబ్లీ నిబంధనలపై  తెలుగుదేశం పార్టీ నేతలకు మాట్లాడే అర్హత లేదు. గతంలో 2014-19 కాలంలో 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టు కొని 4 గురికి మంత్రి పదవులు సైతం కట్టబెట్టినప్పుడు ప్రశ్నించడానికి ఈ స్పీకర్ నోటికి ఏమడ్డమొచ్చింది. అది రాజ్యాంగబద్ధమా? అసెంబ్లీ లో అడుగుపెట్టనని బయటకు వెళ్లిపోయిన చంద్రబాబు ఆ రోజు జీతం తీసుకోలేదా? మాట్లాడ్డానికి టీడీపీ నేతలకు సిగ్గూశరం ఉండాలి. కానీ స్పీకర్ హుందాతనాన్ని మర్చిపోయి మాట్లాడారు.

Back to Top