పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ ములాఖాత్  

నెల్లూరు జిల్లా: అక్రమ కేసులో నెల్లూరు సెంట్రల్ జైలులో నిర్బంధంలో ఉన్న పల్నాడు జిల్లా వైయస్ఆర్‌సీపీ  అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని అద్దంకి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ , వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మ నాయుడు , పార్టీ అధికార ప్ర‌తినిధి కారుమూరు వెంకటరెడ్డి  ములాఖాత్ అయి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదు చేసిన కేసులు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, వైయస్ఆర్‌సీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేయాలన్న ప్రభుత్వ కుట్రగా అభివర్ణించారు. ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తున్న నాయకులను అక్రమ కేసులతో జైలుకు పంపడం ప్రజాస్వామ్యానికి విఘాతమని మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  ఆరోగ్యం, మనోధైర్యం బాగున్నాయని, పార్టీ శ్రేణులకు ఆయన ధైర్యంగా ఉండాలని సందేశం పంపినట్లు నేతలు తెలిపారు. అక్రమ కేసులు, రాజకీయ వేధింపులకు వైయస్ఆర్‌సీపీ నేతలు ఏమాత్రం భయపడరని, ఇలాంటి చర్యలు పార్టీని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీపై జరుగుతున్న దాడులు, కేసులు, అరెస్టులు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలేనని వారు ధ్వ‌జ‌మెత్తారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా పార్టీ పోరాటం మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి త్వరలోనే బయటకు వస్తారని, పార్టీ శ్రేణులంతా ఆయనకు అండగా నిలవాలని వారు పిలుపునిచ్చారు.

Back to Top