అనంతపురం: రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడేనని సింగనమల నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమ సమావేశంలో (గ్రామ–వార్డు స్థాయి కమిటీల ఏర్పాటు) ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైయస్ఆర్‌సీపీ ప్రతి కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా తన అండ ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలను కాపాడుకోవడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. గ్రామ కమిటీలను మరింత బలోపేతం చేసి, జగనన్న సైనికులంతా కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో సువర్ణ పాలన తీసుకురావాలని పిలుపునిచ్చారు. “ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, ప్రజలందరూ సంతోషంగా జీవించాలంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే” అని డాక్టర్ సాకే శైలజనాథ్ స్పష్టం చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి సమతుల్యంగా సాగిందని, ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరిందని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు మంచి చేస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, నేడు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తన మనుషుల కోసం సంపదను దోచుకోవడం తప్ప, ప్రజల కోసం ఒక్క మంచి పని చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఎలా దిగజారాయో ప్రజలందరూ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తప్పకుండా చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని గ్రామ–వార్డు స్థాయి కమిటీల నిర్మాణంపై చర్చించారు. పార్టీని గడ్డస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా అందరూ సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.