చిత్తూరు జిల్లా: గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలో పూల అంగళ్లు కూల్చివేయడం టీడీపీ నాయకులు చేసిన దాష్టీకానికి నిదర్శనమని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కటిగా కదం తొక్కారు. పెనుమూరు బస్టాండ్ వద్ద దాదాపు 30–40 ఏళ్లుగా జీవనాధారంగా పూల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న పేద ప్రజల పూలంగళ్లను కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మంగళవారం శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ, పేదల పొట్టకొట్టే చర్యలు రాజకీయ నాయకుల లక్షణం కాదని, ఇది పూర్తిగా అధికార అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి జీవనం సాగిస్తున్న నిరుపేదల జీవనాధారాలను కూల్చి రాక్షసానందం పొందడం అమానుషమని తీవ్రంగా ఖండించారు. “అధికారం నేడు మీ చేతుల్లో ఉండొచ్చు… రేపు అది మారవచ్చు. కానీ మీరు సృష్టిస్తున్న దుష్ట రాజకీయ సంప్రదాయం ప్రజల్లో అశాంతిని పెంచడమే కాకుండా రాజకీయ కక్షలకు విత్తనాలు వేస్తుంది” అని హెచ్చరించారు. అధికార బలం ఉందని అన్యాయం చేస్తే, రేపటి రోజున అధికారం మారిన క్షణాన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని టీడీపీ నాయకులకు సూచించారు. పేద ప్రజల పక్షాన నిలబడటం వైయస్ఆర్‌సీపీ సిద్ధాంతమని, వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎల్లప్పుడూ బలహీన వర్గాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ తరహా చర్యలను ఇకపై సహించేది లేదని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రాక్షాయణి, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.