తాడేపల్లి: మహిళా ఉద్యోగినిపై ఏడాదిన్నర కాలంగా అత్యాచారం, బెదిరింపులు, మానసిక హింసకు పాల్పడిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చర్యలు అత్యంత దుర్మార్గమని వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అధికార మదంతో ఎమ్మెల్యేలు మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రెస్‌మీట్‌లో వరుదు కళ్యాణి ఇంకా ఏం మాట్లాడారంటే.. ● కూటమి ఎమ్మెల్యేల బరితెగింపు “రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ కీచక పర్వం దేశం మొత్తం చూసింది. ఆయనపై విడుదలైన వీడియోలు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఒక మహిళా ఉద్యోగినిని ట్రాప్ చేసి, లోబరుచుకొని అత్యాచారం చేయడం, గర్భవతి అయ్యాక అబార్షన్ చేయించడం, బెదిరింపులు, దాడులు చేయడం చూశాం. ఈ ఘటనలు చూస్తే కూటమి ఎమ్మెల్యేలు ఎంత బరితెగించారో అర్థమవుతోంది. గత 20 నెలలుగా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఆ పార్టీ కార్యకర్తలు తప్పుడు పనులు చేస్తే చట్టం శిక్షిస్తుందనే భయం లేకుండా మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, వేధింపులు జరుగుతున్నా ఒక్కరిపై కూడా గట్టి చర్యలు లేవు. బాధితులపైనే తప్పుడు కేసులు పెడుతున్నారు. ● ఒక్క ఘటనలోనూ గట్టి చర్యలు లేవు ఇటీవలే మంత్రి సంధ్యారాణి పీఏ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగినిని దారుణంగా లోబరుచుకొని వేధించిన ఘటన చూశాం. ఆ మహిళకు న్యాయం జరుగుతుందేమో అనుకున్నాం. కానీ నిందితురాలు జైల్లో ఉంది, నిందితుడు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇదేనా మహిళలకు ఇచ్చే రక్షణ?. సంక్రాంతి సందర్భంగా స్టేజీపై డ్యాన్స్ చేస్తున్న మహిళను బట్టలిప్పి డ్యాన్స్ చేయమని ఓ ఎమ్మెల్యే పబ్లిక్‌గా చెప్పాడు. ఆ ఎమ్మెల్యేపై ఏం చర్యలు తీసుకున్నారు? రాప్తాడులో 14 ఏళ్ల దళిత బాలికపై ఆరు నెలల పాటు 14 మంది టీడీపీ కార్యకర్తలు అత్యాచారం చేస్తే సరైన చర్యలు లేవు. సత్యవేడు ఎమ్మెల్యే వేధింపులకు గురైన మహిళ న్యాయం కోసం పక్క రాష్ట్రంలో ప్రెస్‌మీట్ పెట్టాల్సి వచ్చింది. తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ మహిళను మోసం చేశాడు. శ్రీకాళహస్తిలో కోటా వినూత విషయంలో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి వ్యవహారం అందరికీ తెలిసిందే. తిరువూరులో, రాప్తాడులో, ఇతర ప్రాంతాల్లో మహిళలపై జరిగిన దారుణాలపై ఈ ప్రభుత్వం మౌనం పాటిస్తోంది. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరుల వేధింపులకు గురై ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వేధింపులతో ఓ మహిళా వీఆర్‌వో ఆత్మహత్యాయత్నం చేసింది. ఒక్క ఘటనలోనూ గట్టి చర్యలు లేవు. అందుకే కూటమి నేతలు అధికార మదంతో మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. ● పవన్ కళ్యాణ్..ముందు మీ ఎమ్మెల్యే తాట తీయండి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళా ఉద్యోగినిని ట్రాప్ చేసి, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, బెదిరించి, కొట్టి, ఐదుసార్లు అబార్షన్ చేయించాడు. లొంగకపోతే మూడేళ్ల కుమారుణ్ని చంపుతానని బెదిరించాడు. ఆమె ఎంత బాధపడి ఇవాళ వీడియోలతో బయటకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మహిళలపై చెయ్యి వేస్తే తాట తీస్తానని పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే మహిళను ఇంత దారుణంగా వేధించాడు. ముందు మీ ఎమ్మెల్యే తాట తీయండి. సుమోటోగా కేసు నమోదు చేయండి. అరెస్ట్ చేయించండి. ● చంద్రబాబూ.. సినిమా డైలాగ్స్ వద్దు ఎవరైనా మహిళ జోలికి వస్తే అదే చివరి రోజు అని చంద్రబాబు అంటారు. ఇన్ని ఘటనల్లో ఎవరికది చివరి రోజు అయ్యింది? సినిమా డైలాగులు కాదు… దోషులను శిక్షించాలి. ఇంకొకరికి భయం ఉండాలి. మహిళా హోం మంత్రి అనిత పదవి వైయస్ జగన్‌ను తిట్టడానికేనా? వైయస్‌ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడానికేనా? మహిళలపై ఇంత దారుణాలు జరుగుతుంటే హోం మంత్రి ఏం చేస్తున్నారు? జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు పెట్టండి. నడిరోడ్డుపై నడిపించండి. ● స్పీకర్ ఎందుకు స్పందించడం లేదు స్పీకర్ ప్రతి మీటింగ్‌లోనూ నో వర్క్, నో పే అంటూ ప్రవచనాలు చెబుతుంటారు. రాజ్యాంగంలోని సూత్రాల గురించి మాట్లాడుతుంటారు కదా?. ఈ ప్రభుత్వంలో కూటమి ఎమ్మెల్యే ఒక మహిళపై ఇంత దారుణంగా వ్యవహరిస్తే స్పీకర్ ఎందుకు స్పందించడం లేదు. ప్రతిపక్ష నాయకులపై మాత్రమే మీరు కామెంట్స్ చేస్తారా? మీ కూటమి ఎమ్మెల్యేల అరాచకాలపై స్పీకర్ స్పందించరా?. ● లోకేష్‌కు మహిళలపై గౌరవం ఉంటే శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలి లోకేష్ మహిళలంటే మాకు గౌరవం అని ప్రతీ మీటింగ్‌లో గొప్పలు చెబుతుంటారు. మరి మీ కూటమి ఎమ్మెల్యేలు మహిళలపై ఇలాంటి దారుణాలకు పాల్పడుతుంటే ఏ చర్యలు తీసుకుంటారు? అరవ శ్రీధర్‌ను సస్పెండ్ చేయాలి. ఎమ్మెల్యేగా డిస్‌క్వాలిఫై చేయాలి. ● బాధిత కుటుంబాలకు వైయస్ఆర్‌సీపీ వెన్నుదన్ను మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై వైయస్‌ఆర్‌సీపీ ఎప్పుడూ పోరాడుతోంది. మా అధినేత వైయస్ జగన్ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఈ ఘటనలో బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు వైయస్‌ఆర్‌సీపీ వెన్నుదన్నుగా ఉంటుంది. అరవ శ్రీధర్‌పై సుమోటోగా కేసు నమోదు చేయాలి. జనసేన నుంచి సస్పెండ్ చేయాలి. ఎమ్మెల్యేగా డిస్‌క్వాలిఫై చేయాలి. మహిళా కమిషన్ సుమోటోగా చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.