ఫిబ్రవరి 5న వైయ‌స్ఆర్‌సీపీ భారీ ధ‌ర్నా

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కూటమి కుట్రలను నిరసిస్తూ పోతిరెడ్డిపాడు వద్ద ఆందోళన

కర్నూలు జిల్లా: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేలా కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ ఫిబ్రవరి 5వ తేదీన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ధ‌ర్నా, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించిన అనంతరం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్.వి. మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సంయుక్తంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ… రాయలసీమ దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమని అన్నారు. సీమ ప్రజల సాగు, త్రాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా వెనుక నుండి నీటిని తరలించే ఏర్పాట్లు చేశారని తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సీమకు నీరు అందుతుండగా, అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం తమ ప్రాంతానికి ప్రాజెక్టులు నిర్మించుకుంటోందని చెప్పారు.  సీమకు తరలిస్తున్న నీటిని అడ్డుకునేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఒప్పందంపై ఏపీ మంత్రులు ఒక్కరూ ప్రశ్నించకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. గ్రేటర్ రాయలసీమ కోసం ఎత్తిపోతల పథకం సాధించేవరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ పథకాన్ని నిలిపివేయాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమానికి సిద్ధమయ్యామని చెప్పారు.

స‌కాలంలో వేత‌నాలు ఇవ్వ‌డంలో స‌ర్కార్ విఫ‌లం:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడంలో విఫలమవుతోందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బుగ్గ‌న విమర్శించారు. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వయంగా ఆరోపణలు చేశారని, అయితే సీబీఐ విచారణలో అలాంటిది ఏమీ లేదని తేలిందని గుర్తు చేశారు. ఈ తప్పుడు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని తీవ్రంగా తప్పుబట్టారు. ఫిబ్రవరి 5న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద జరిగే ఈ నిరసన కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు, గ్రేటర్ రాయలసీమ వాసులంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు.

చంద్రబాబు పాలనలో ఒక్క కొత్త ప్రాజెక్టు లేదు:  
రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు పాలనలో సీమ ప్రజలకు ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదని నంద్యాల జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి  విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి హయాంలోనే సీమకు సాగు, త్రాగునీటి అవసరాల కోసం ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అనంతరం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీరు చేరకముందే తెలంగాణ ప్రభుత్వం నీటిని తరలిస్తుండటాన్ని అరికట్టేందుకే ఈ పథకం అవసరమైందని స్పష్టం చేశారు. సీమ ప్రజలకు అందాల్సిన 22 టీఎంసీల నీటిని అడ్డుకునేలా తెలంగాణ ప్రభుత్వంతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఎత్తిపోతల పథకం పూర్తి కాకపోతే రాయలసీమ ప్రాంతం తీవ్ర కరువుతో అల్లాడుతుందని హెచ్చరించారు. సీమకు న్యాయం జరగాలంటే ఈ పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద జరిగే నిరసన సభకు గ్రేటర్ రాయలసీమ ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కాట‌సాని పిలుపునిచ్చారు.

Back to Top