తిరుపతి: తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ కోర్టుకు సమర్పించిన ఛార్జి షీట్ లో నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదన్న వాస్తవం తేటతెల్లమైందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ... ఈ ఛార్జి షీట్ సాక్షిగా తిరుమల లడ్డూపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల దుష్ప్రచారం బట్టబయలైందన్నారు. తొలుత నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కల్తీ జరిగిందని ఈవో శ్యామలరావు చెబితే... కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఏకంగా జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు ఆరోపణ చేయడంతో పాటు ఈవో తో కూడా మరలా తప్పుడు ప్రకటన చేయించారని మండిపడ్డారు. మరోవైపు అయోధ్యకి పంపిన లక్ష లడ్డూలు కల్తీ నెయ్యితో తయారుచేసినవి చెప్పడం ద్వారా.... డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం దేవదేవుడి ప్రతిష్ఠను దిగజార్చి, కోట్లాది మంది హిందువుల మనోభావాలు కలుషితం చేశారని మండిపడ్డారు. అసలు జంతు కొవ్వే లేదన్న సీబీఐ నివేదికతో కూటమి కుట్ర బయటపడిందని తేల్చి చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారంలో రాజకీయపరమైన నేరం లేదని తేలిందన్న భూమన.. సిట్ ఛార్జి షీట్ లో టీటీడీ అధికారులు, సాంకేతిక నిపుణులు కుమ్మక్కయ్యారని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వాస్తవానికి 2013 నుంచే ప్రీమియర్ డెయిరీ, బోలేబాబా నెయ్యి సరఫరా చేస్తున్నాయని.. ఈ నేపధ్యంలో 2014-19 మధ్య నెయ్యి సరఫరాపై విచారణకు చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు. దమ్ముంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ చేశారు. వైయస్.జగన్ హాయంలో నెయ్యి నాణ్యత పరీక్షకు ఎన్ డి డీ బీతో ఒప్పందం చేసుకుని అత్యాధునిక పరిజ్ఞానాన్ని తెచ్చామన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశ్యంతోనే యజ్ఞాన్ని అపవిత్రం చేసే రాక్షసుల్లా చంద్రబాబు, పవన్ వ్యవహరించారని.. సీబీఐ నివేదికతో వీరి బాగోతం భయట పడిందన్నారు. బాబు దైవభక్తి ఓ నాటకమని, అధికారమే ఆయనకు కీలకమన్న భూమన వైయస్.జగన్ ని దెబ్బతీయడానికి జగన్నాధుడిపైనే విషం కక్కారని మండిపడ్డారు. పదవి కోసం పాతాళం కన్నా దిగజారిన వీరు పాపపరిహారం చేసుకోవాల్సిందేనన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వరకూ శుద్ధి చేయాలని, చంద్రబాబు గుండు చేయించుకుని, శ్రీ వెంకటేశ్వస్వామికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ● సీబీఐ ఛార్జి షీట్ లో బయటపడ్డ వాస్తవాలు... సీబీఐ నేతృత్వంలోని సిట్ తిరుమల ప్రసాదంపై కోర్టుకు తన నివేదికను సమర్పించింది. ఈ నేపధ్యంలో తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ అధికారులు, అధికార పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు మరొక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. (వివిధ సందర్భాల్లో టీటీడీ అప్పటి ఈఓ శ్యామలరావు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు తిరుమల లడ్డూ కల్తీపై మాట్లాడిన వీడియోలు ప్రదర్శించారు.) వైయస్.జగన్ ని దెబ్బతీయడానికి జగమంతా కొలిచే శ్రీ మహా విష్టువుని వాడుకుని శిశుపాలుడే సిగ్గుపడేలా, కంసుడు చెవులు మూసుకునేలా, సమస్త రాక్షసులు నోళ్లు వెళ్లబెట్టేలా చంద్రబాబు తన మాటలు, చేష్టలతో తన వంతు పాడే ప్రసారమాధ్యమాల సాయంతో సెప్టెంబరు 18న మాట్లాడుతూ... లడ్డూలో అసలు నెయ్యి వాడలేదు, యానిమల్ ప్లాట్ వాడారు అని మాట్లాడారు. అంతకముందు జూలై 20న ఈవో శ్యామలరావు నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని చెప్పారు. చంద్రబాబు మాట్లాడిన తర్వాత మరలా అదే శ్యామలరావు అధికార పార్టీ బెదిరింపులకు భయపడి నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసినట్లుందని మాట్లాడారు. పురాణాకాలంలో మహర్షులు యజ్ఞం చేస్తుంటే... రాక్షసులు అందులో మద్య, మాంసాలు కలిపారనే కధలు చాలా విన్నాం. అంతకంటే నీచమైన స్థాయికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు దిగజారి తమ మాటల విషంతో... భగవంతుడ్ని తమ స్వార్ధ రాజకీయాలకు బలిపశువును చేసేలా దుర్మార్గానికి ఒడిగట్టారు. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను కలుషితం చేయడానికి ప్రయత్నించారు. కేవలం వైయస్.జగన్ ను రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ దుర్మార్గానికి ఒడి కట్టారు. ● రాజకీయ నేరం లేదన్న సిట్.. సిట్ తన రిపోర్ట్ లో ఎక్కడా రాజకీయపరమైన నేరం జరిగిందని ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. తద్వారా పూర్తిగా వాస్తవం లోకానికి స్పష్టీకరమైంది. సిట్ ఛార్జి షీట్ లో అధికారులు, సాంకేతిక నిపుణులు, డెయిరీ అధిపతులు కుమ్మక్కై నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిపి నెయ్యిగా మార్చారన్నది సీబీఐ ఇచ్చిన నివేదిక. నేను స్పష్టం చేస్తున్నదేమిటంటే... చంద్రబాబు ఇప్పుడు మరలా నాలుక మడతబెట్టి కల్తీ జరిగింది కదా అని మాట్లాడుతున్నాడు. 2019 -24 వరకు సీబీఐ విచారణ చేయించింది. ఈ విచారణ కోసం సుప్రీం కోర్టుకు టీటీడీ పూర్వ పాలకమండలి చైర్మన్ వై వీ సుబ్బారెడ్డి వెళ్లారు. చంద్రబాబు లడ్డూ వ్యవహారంలో నియమించిన సిట్ కాదని... సిబీఐ తో విచారణ జరిపించాలని ఆయన కోర్టు నాశ్రయిస్తే... సుప్రీంకోర్టు చంద్రబాబు మాటలను ఆక్షేపించి, మీరు మాట్లాడింది తప్పు కదా అని హెచ్చరించింది. ఆ తర్వాత తన ఆధ్వర్యంలో సీబీఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయించి విచారణకు ఆదేశించింది. ఒకవేళ చంద్రబాబు ఆధ్వర్యంలో సిట్ తో విచారణ చేసి, నివేదిక ఇచ్చి ఉండే... ఇటీవల తిరుమల కొండపై మందు బాటిళ్లు దొరికితే.. దాన్ని వీడియో తీసిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త, వార్తను షూట్ చేసి న సాక్షి ప్రతినిధి పైనా 152 ఏ కింద వీళ్లనే నేరస్తులను చేస్తూ.. దేశద్రోహం నేరం కింద కేసు బనాయించిన ఏపీ పోలీసుల తరహాలో.. ఇక్కడ కూడా వ్యవహరించి ఉండేవారు కనుకే లడ్డూ వ్యవహారంలో వై వీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు నిన్న దాని గురించి కూడా ప్రస్తావిస్తూ.. మనం సిట్ వేస్తే వైయస్ఆర్‌సీపీ నేతలు సుప్రీం కోర్టుకు వెళ్లారని ప్రస్తావిస్తున్నారు. వాస్తవాలు బయటకు రావాలనే మేం సుప్రీంకోర్టుకు వెళ్లాం. ● 2014-19 నెయ్యి సరఫరాపై సీబీఐ విచారణకు సిద్దమా? టీడీపీ,జనసేన, కేబినెట్ మొత్తానికి స్పష్టీకరించదల్చుకుంది ఒక్కటే... మీకు ధైర్యం ఉంటే, మీకు స్వామి వారి మీద భక్తి ఉంటే.. 2014-19 వరకు లడ్డూ ప్రసాదంపై విచారణ చేయమని సీబీఐను ఆదేశించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు సీబీఐ ఇచ్చిన నివేదికలో మాల్ గంగా, ఏఆర్,ప్రీమయర్, వైష్టవి డెయిరీలకు బోలేబాబా నుంచి కల్తీ నెయ్యి అందిందని చెప్పారు. 2013 నుంచి ప్రీమియర్ డెయిరీ, ఆల్ఫా డెయిరీనే 90 శాతానికి పైగా నెయ్యిని సరఫరా చేసింది. దీని మీద మా దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయి. దీనిపై సీబీఐ విచారణ జరగాలి. ప్రీమియర్ డెయిరీ కూడా బోలేబాబా నుంచే నెయ్యి సరఫరా చేసిందని స్పష్టంగా సీబీఐ తన ఛార్జి షీట్ లో స్పష్టీకరించింది. ఇదే ప్రీమియర్ డెయిరీ 2013 నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. దీనిపై సిబీఐ విచారణ చేయించే దమ్ము ఉందా? మా హయాంలో టెండరు నిబంధనలను సరళం చేశాం కాబట్టి ఈ రకమైన కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు. దానికి కారణం 2021లో కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనల వల్ల కొత్త కంపెనీలకు అవకాశం ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. కానీ గతంలో చంద్రబాబు హయాంలోనూ, ఇప్పుడూ బట్టర్ ప్రొక్యూర్ మెంట్ కి సంబంధించి, పాల ఉత్పత్తి సరిపోనంత ఉంటే.. బట్టర్ ను కొనుక్కోవచ్చన్న నిబంధనలు అలాగే ఉన్నాయి. కరోనా సమయంలో నెయ్యి అవసరం లేదు కనుక.. స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సహించాలన్న ఆలోచన ఆనాటి బోర్డుకు ఉన్నప్పటికీ కూడా అది ఫలితం ఇవ్వలేదు. కనుక నేను చైర్మన్ గా అయిన తర్వాత ఈ నిబంధనలను మరలా కఠినతరం చేశాం. ఈ మొత్తం వ్యవహారంలో సీబీఐ కోర్టుకి ఇచ్చిన తన నివేదికలో ఎక్కడా రాజకీయపరమైన నేరారోపణ చేయలేదు. నాతో పాటు వైవీ సుబ్బారెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇందులో ప్రమేయముందని ఎక్కడా సీబీఐ చెప్పలేదు. కేవలం అధికారులు, డెయిరీ యజమానాలు లాలూచీ పడ్డం ద్వారా ఈ నేరం జరిగిందని మాత్రమే చెప్పారు. అది కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా జంతుకొవ్వు, ఆవుకొవ్వు, పందికొవ్వు, చేప కొవ్వు వాడారన్న పదం ఒక్క చోట లేకపోగా.. యానిమల్ ఫ్యాట్ వాడలేదని స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ సంస్థను కూడా టెండర్లకు ఆహ్వానించారు. నిజానికి ఏపీడీడీసికి ఒక్క ఆవు కూడా లేదు. కానీ ఈ సంస్థ పాల ఉత్పత్తులు కొని వ్యాపారం చేస్తోంది. ప్రభుత్వ సంస్దే వ్యాపారం చేస్తుందనడానికి ఆ సంస్థ ఇచ్చిన ప్రకటనే సాక్ష్యం. వైయస్.జగన్ హయాంలో అడుగడుగునా స్వామి వారికి మేలు చేయాలన్న తపనతోనే ఎన్ డీ డీ బీ చైర్మన్ ని పిలిపించారు. వాళ్ల సహాయంతో రూ.50 కోట్ల నిధులతో గిర్, సాహివాల్ వంటి ఆవు పాల ద్వారా నెయ్యి ఉత్పత్తితో పాటు, వాటి ద్వారా పూర్తిగా ఆవుదూడలే ఉత్పత్తి అయ్యే చేసి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం కారణంగానే అప్పటివరకు అందుబాటులో లేని.. బీటా సైట్స్ టెరాలసిస్ టెస్ట్ ను వైయస్.జగన్ ఆదేశాలతో ఎన్ డీ డీ బీ వాళ్ల సహకారంతో ఈ టెస్ట్ మిషనరీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసి టెండర్లు పిలిచాం. మూడు టెండర్లలో ఎవరూ పాల్గొనకపోవడంతో ఈ ఆధునీకరణ కోసం ఎన్ డీ డీ బీ వాళ్లే టీటీడీతో ఒప్పందం చేసుకున్నారు. ఇదంతా మా హయాంలోనే జరిగింది. మీ హయాంలో ఒక్క మార్పూ లేదు. నెయ్యి ప్రామాణికతలను మెరుగుపర్చడానికి రూ.5.50 కోట్లతో మిషనరీ కొనుగోలుకు సంబంధించి టెండర్లు మా హయాంలో పిలిచాం. ఆ తర్వాత ఆ మిషనరీ కొనుగోలుకు దాత వచ్చాడు. మా ప్రభుత్వ గడువు ముగిసిన తర్వాత ఇప్పుడు మీ హయాంలో ఆ మిషనరీ ద్వారా బీటా సైట్స్ టెరాలసిస్ టెస్టులు ఇప్పుడు జరుగుతున్నాయి. మీ హయాంలో మీరు ఏమీ చేయకపోగా కేవలం మా పై నిందారోపణలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ● సాంకేతిక నిపుణులే దోషులన్న సీబీఐ.. ఇవాళ సీబీఐ దోషులుగా తేల్చిన సాంకేతిక నిపుణుల విబాగం జీఎం సుబ్రమణ్యం 2016-18 వరకు చంద్రబాబు హయాంలో ప్రొక్యూర్ మెంట్ జీఎంగా ఉన్నాడు. మరో నిందితుడు జగదీష్ కూడా 2018-21 వరకు అంటే చంద్రబాబు హయాంలోనే జీఎంగా ఉన్నాడు. విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర అనే టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ కూడా 2013 నుంచి ఇప్పటివరకూ ఉన్నారు .వాళ్లే దోషులు అని సీబీఐ తేల్చింది. ఈ కేసుకు వైయస్.జగన్ కు ఏం సంబంధం ఉంది చంద్రబాబూ? వైయస్.జగన్ యజ్ఞం చేస్తుంటే... అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రక్తం పోసే వ్యక్తులు. పవన్ కళ్యాణ్ అయితే అయోధ్యకు పంపించిన లక్ష లడ్డూల్లో చేప, ఆవు కొవ్వు కలిసిందని ప్రవచించారు. ఆ రోజు లక్ష లడ్డూల తయారీకి నెయ్యి సరఫరా చేసిన వ్యక్తే, ఈ రోజు చంద్రబాబు, బీఆర్ నాయుడు నేతృత్వంలో సభ్యుడైన సౌరభ్ బోరా అనే వ్యక్తే సరఫరా చేశారు. దానిమీద స్పష్టమైన ఆధారాలున్నాయి. ● సీబీఐ ఛార్జి షీట్ పై నోరు విప్పని డిప్యూటీ సీఎం.. కానీ నిస్సిగ్గుగా పబ్లిక్ మీటింగ్ లో కాషాయ వస్త్రాలు ధరించి పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం అపవిత్రమైపోయిందని.. విజయవాడ దుర్గమ్మ మెట్లు కడిగాడు. తిరుపతిలో వింతవింతగా మాట్లాడాడు. రహస్యంగా బూట్లు, బహిరంగంగా మెట్లు కడిగిన ఓ సనాతని.. పవనానంద సిట్ రిపోర్టు తర్వాత ఎందుకు మౌనం వహించావు. నోరు తెరిచి ఇప్పుడు మాట్లాడు. చంద్రబాబు నాయుడు దైవభక్తి ఒక నాటకం. జనక్షేమం అన్నది బూటకం, అధికారం అన్నది ఒక్కటే కీలకం. సంపాదనే ఆయనకు మూలం, ఆయనో స్వార్ధ కీటకం, హైందవ ద్రోహ రూపకం చంద్రబాబు. మా మీద నిందలు వేసి.. కేబినెట్ మీటింగ్ లో వైయస్ఆర్‌సీపీ మీద ఎలా దాడి చేయాలో డైరెక్టన్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో వైయస్సారీపీ తీవ్రంగా దాడి చేస్తుందని చెబుతున్నాడు. మీరు దాడి చేసింది వైయస్.జగన్ మీద, వైయస్ఆర్‌సీపీ మీద కాదు.. స్వయంభూ అయిన సాక్షాత్తూ శ్రీ మహావిష్టువు మీదనే దాడి చేశాడు. 140 కోట్ల మంది హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకునే శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం మీద, వైయస్.జగన్ ను దెబ్బతీయడానికి జగన్మోహనుడు, జగన్నాధుడు అయిన స్వామి వారిని పావుగా వాడిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ● ప్రభుత్వమే సమాధానం చెప్పాలి... ఈవో శ్యామలరావు 20-07-2025 నాడు 4 నెయ్యి ట్యాంకులను వెజిటబుల్ ఆయిల్ కల్తీ అయినందునే వెనక్కి పంపించామని చెబితే... చంద్రబాబు మాత్రం అది నెయ్యి కాదు యానిమల్ ప్యాట్ అని చెప్పాడు. చంద్రబాబు సీఎంగా ఉండగా,ఆ 4 ట్యాంకులను తిరస్కరించామని ఈవో చెబితే... మరలా అదే 4 ట్యాంకులు కొండకు తిరిగి వస్తే ఆ కల్తీ నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారని సీబీఐ తన ఛార్జి షీట్ లో కోర్టుకు సమర్పించింది. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి? ఇది మా ఆరోపణ కాదు, సీబీఐ కోర్టులో సమర్పించిన నివేదిక ఇది. మా హయాంలో ఇలాగే వచ్చిన 18 నెయ్యి ట్యాంకర్లను, చంద్రబాబు హయాంలో 14 ట్యాంకర్లను వెనక్కి పంపించడం జరిగింది. కానీ చంద్రబాబు హయాంలో బీటా సైట్స్ టెరాలసిస్ టెస్ట్ లేని కారణంగా అధికారులు, దొంగ డెయిరీ సంస్థలు టీటీడీని మోసం చేశాయి. ఈ మోసాన్ని నువ్వు మా మీద మోపి, భగవంతుడ్ని అప్రతిష్ట చేసే కార్యక్రమం చేశావు. ఇప్పటికీ సిట్ ఛార్జి షీట్ లో యానిమల్ ప్యాట్ కలవలేదని చాలా స్పష్టంగా రాశారు. 1971 ఆగష్టు 25వ తేదీన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు స్పూర్తి అయిన విశాల్ బిత్తి అనే ఎమ్మెల్యే ఆ నాటి ఏపీ అసెంబ్లీలో ఇలాంటి ప్రశ్న వేశాడు. ఆనాడు ప్రసారమాధ్యమాలు లేవు. అందులో దేవుడికి వాడే నెయ్యిలో ఆవుకొవ్వు, పందికొవ్వు కలిపారట నిజమేనా అని ఆనాటి దేవాదాయశాఖ మంత్రిని అడిగారు. ఇది 2024 సెప్టెంబరు 18న చంద్రబాబుకి గుర్తుకి వచ్చింది. మరలా అదే ఆరోపణను పేల్చి శ్రీవేంకటేశ్వరస్వామిని ముంచే కార్యక్రమం చేశాడు. చంద్రబాబు చేసిన ఈ మహా కుట్రకు సిబీఐ నిర్వీర్యం చేయడంతో దిక్కు తోచని చంద్రబాబు ... కొత్త అవతారం ఎత్తాడు. లడ్డూ విషయంలో మనమే గబ్బు పట్టిపోయామని తెలుసుకుని ఎదురుదాడి ప్రారంభిద్దామని తన కేబినెట్ మంత్రులతో రాజకీయ దాడికి పురిగొల్పుతున్నాడు. హైందవ సంస్కృతిని ప్రేమించే వాళ్లందరూ.. చంద్రబాబు ప్రసారమాధ్యామాలను, పవన్ కళ్యాణ్ నిర్మించిన కోట కూల్చడం ఖాయం. ● ప్రజలు చంద్రబాబు ద్రోహాన్ని ఎండగట్టాలి... దీనిమీద పండితులు, ఆగమ పండితులుతో దేవాలయంలో సంప్రోక్షణ చేయడం ద్వారా చంద్రబాబు మహా పాపానికి ఒడిగట్టాడు. లడ్డూలో కొవ్వు కలిసిందని .. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో దైవంతో సమానంగా పూజింపబడే నాలుగు అర్చక కుటుంబాలతో సంప్రోక్షణ చేయించారు. స్వాములు మీరు కూడా మేల్కోవాలి. చంద్రబాబు నీచ కార్యక్రమాలకు తలొగ్గొద్దు. ఈ రకమైన దారుణాలు ఇంకెన్నైనా చంద్రబాబు చేయగలడు. ఆయనకు కొంతమంది మఠాధిపతులు కూడా వంత పాడ్డం మన దౌర్భాగ్యం. సుప్రీం కోర్టు అక్షింతలు వేసినా లెక్క చేయకుండా వైయస్.జగన్ మీద, వైయస్ఆర్‌సీపీ మీద చంద్రబాబు అబాండాలు వేస్తూ.. నిరంతరం దాడి చేస్తూ మతాన్ని అడ్డుపెట్టుకుని హిందువులను రెచ్చగొట్టి, మతం, దేవుడి ద్వారా శ్రీ వేంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగి ఓట్లు దండుకునే కుట్ర చేస్తున్నాడు. దీనిమీద హిందుసమాజం వాస్తవాలను తెలుసుకుని, చంద్రబాబు ద్రోహాన్ని ఎండగట్టాలి. తిరుమల దేవస్థానంతో పాటు రాష్ట్ర ప్రతిష్టను కూడా దెబ్బతీసిన చంద్రబాబు... కేవలం ఒక్క వైయస్.జగన్ ను దెబ్బతీయడానికి ఇంతటి నీచానికి పాల్పడ్డం దారుణం. పదివి కోసం పాతాళం కన్నా కిందకు దిగజారి మాట్లాడే పాశవిక ప్రవృత్తి చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ లకే చెల్లిందని రుజువైంది. ఈ పాప పరిహారానికి ఇవాళ అమరావతి నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం వరకు రోడ్లన్నీ కడుక్కుంటూ రావాల్సిన అవసరం ఉందని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అదే విధంగా పాపపరిహారంగా చంద్రబాబు గుండు చేయించుకుని శ్రీ వేంకటేశ్వరస్వామికి క్షమాపణలు చెప్పవలసిన అవసరాన్ని సీబీఐ ఛార్జ్ షీట్ తెలియజేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ● అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ.. పీఠాధిపతులను, మఠాధిపతులను చంద్రబాబు బెదిరిస్తున్నాడు. శ్రీ వేంకేటేశ్వర స్వామినే తన రాజకీయాలకు వాడుకుంటున్న చంద్రబాబు మమ్నల్నేం చేస్తాడో అన్న భయాన్ని చంద్రబాబు వారిలో కలిగించాడని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.