తాడేపల్లి: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘పరమశివుడి లింగోద్భవానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండగ.. పరమభక్తికి నిదర్శనం. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ఆచరించే ఉపవాసం, జాగరణ నిష్టాగరిష్టతను చాటుతాయి’ అని వైయస్ జగన్ అన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మల్లన్న స్వామివారి ఆలయం కొలువై ఉన్న పవిత్ర ప్రదేశం మన రాష్ట్రమని అభివరి్ణంచారు. మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం, జాగరణ చేసే భక్తులు భక్తి శ్రద్ధలతో శివార్చన, పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించిన వైయస్ జగన్.. రాష్ట్ర ప్రజలందరిపై ఆ పరమశివుడి అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు. ‘‘నియమ నిష్టలు, భక్తి శ్రద్ధలు, జాగరణతో పరమశివుడిని ఆరాధించే ఈ పవిత్ర మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ కూడా చేశారు. ‘‘ఆ మల్లికార్జునుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ!’’ అని వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.