రాజోలు : అంతర్వేది దేవస్థానం పరిసర ప్రాంతాలు, పల్లిపాలెం, అంతర్వేది కర, గొంది, కేశవదాసుపాలెం గ్రామాలకు శాశ్వత త్రాగునీటి సదుపాయం కల్పించిన ఘనత పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదేనని రాజోలు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, మాజీ మంత్రి వర్యులు గొల్లపల్లి సూర్యరావు స్పష్టం చేశారు. ఈ అంశంపై నియోజకవర్గ నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన సూర్యరావు మాట్లాడుతూ.. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి గారు ప్రజల దాహార్తిని తీర్చాలనే సంకల్పంతో రూ.18 కోట్ల నిధులు మంజూరు చేసి త్రాగునీటి ప్రాజెక్టును ప్రారంభించి, పనులు పూర్తిచేయించారని గుర్తు చేశారు. అయితే వైయస్ జగన్ ప్రభుత్వంలో ప్రారంభమై, పూర్తి అయిన ఈ ప్రాజెక్టును తమ ఘనతగా చెప్పుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు యత్నించడం క్రెడిట్ చోరీకి నిదర్శనమని సూర్యరావు గారు ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన అభివృద్ధి పనులను రాజకీయ లాభాల కోసం వాడుకోవడం అన్యాయమని విమర్శించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే అంతర్వేది ప్రాంత ప్రజలకు త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని, ఈ నిజాన్ని ప్రజలు మరువరని ఆయన స్పష్టం చేశారు. వైయస్ జగన్ నాయకత్వంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి, ప్రతి ఇంటికి మౌలిక వసతులే లక్ష్యంగా పాలన సాగిందని తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు కర్రి పాపారాయుడు, రాష్ట్ర కార్యదర్శులు పాటి శివకుమార్, కటకంశెట్టి ఆదిత్య, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుబ్బల మనోహర్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నల్లి డేవిడ్, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి నేతల నాని, అడబాల జానకి, గొల్లపల్లి శ్రీధర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.