రాజధాని ముసుగులో అంతులేని దోపిడి

దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్మాణ వ్యయం

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధ్వజం

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.

రాష్ట్ర సమగ్రాభివృద్ధి వైయ‌స్ఆర్‌సీపీ లక్ష్యం

మూడు ప్రాంతాలు అభివృద్ది చెందాలి

ప్రెస్‌మీట్‌లో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వెల్లడి

తాడేపల్లి: రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో అంచనాలు దారుణంగా పెంచేసి తెచ్చిన అప్పులన్నీ కమీషన్ల పేరుతో దోచుకోవడం తప్ప, సీఎం చంద్రబాబు చేస్తున్నదేమీ లేదని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో నిత్యం జరుగుతున్నది కంపచెట్లు తొలగించడం, గుంటల్లో నీరు తోడే పనులు మాత్రమేనని ఆయన తెలిపారు. మొదటిదశ భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా, రెండో దశ భూసమీకరణకు పూనుకోవడం దారుణమని తేల్చి చెప్పారు.
    రాష్ట్ర సమగ్రాభివృద్ధే తమ పార్టీ లక్ష్యమని, మూడు ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. జగన్‌గారి నామ జపం చేయకుండా కూటమి నాయకులకు రోజు గడవడం లేదని, అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టి, కేవలం కట్టుకథలతో డైవర్షన్‌ పాలిటిక్స్‌కు అలవాటు పడ్డారని  ధ్వజమెత్తారు. ఇంకా, నాడు జగన్‌గారు చేసిన మంచి పనులను తనవిగా చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు, నిర్లజ్జగా క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆక్షేపించారు.
ప్రెస్‌మీట్‌లో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఏం మాట్లాడారంటే..:

భూసమీకరణ పేరుతో దోపిడి:
    మొదటిదశలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేయని చంద్రబాబు ప్రభుత్వం.. ఎప్పుడో దశాబ్దం క్రితం కట్టిన రెండు బిల్డింగులు చూపించి రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందంటూ ఎల్లో మీడియా ద్వారా కట్టుకథలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తోంది. పాత పనులకు అంచనాలు పెంచేసి మళ్లీ టెండర్లు పిలిచి దోపిడీ చేస్తున్నారు. రాజధానికి మొదటి విడతలో భూములిచ్చిన రైతులకు ఇంతవరకు ప్లాట్లు ఇచ్చిన పాపాన పోలేదు. సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లినా అధికారులు వారిని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ రెండో దశ భూసమీకరణ పేరుతో మరింత భూదోపిడీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
    అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో నిత్యం కంప చెట్లు తొలగించడం, నీళ్లు తోడే పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఆ పనులకు దండిగా బిల్లులు చెల్లిస్తున్నారు. అంతకు మించి జరుగుతున్నదంతా అబద్ధం. భవిష్యత్తులోనూ అమరావతి అభివృద్ది జరగదని తెలుసు కాబట్టే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు అమరావతి కాకుండా, విశాఖ పేరు చెబుతున్నారు. విశాఖలో ఎంతో ఖరీదైన భూమిని ఎకరా కేవలం 99 పైసలకు ఇచ్చినట్లు అమరావతిలో ఎందుకు ఇవ్వడం లేదు? 
    అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీని, రైతులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే వైయ‌స్ఆర్‌సీపీ రాజధానికి వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అలా రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలన్నదే మా పార్టీ లక్ష్యం.

అప్పులు చేసి తెచ్చిన నిధులన్నీ ఏమయ్యాయి?:
     కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి 20 నెలల్లో ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకం, కార్యక్రమం అమలు చేయకుండానే ఏకంగా రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు. చివరకు ఎన్నికల్లో ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్‌సిక్స్, సూపర్‌ సెవెన్‌ పథకాలు కూడా గాలికొదిలేశారు. ఎక్కడా, ఏ అభివృద్ధి కనిపించడం లేదు. కనీసం రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేదు. మరి తెచ్చిన అప్పులన్నీ ఏమయ్యాయి? ఆ నిధులన్నీ ఎక్కడికి పోయాయి?.

అందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌:
    ఏటా 4 లక్షల ఉద్యోగాల చొప్పున, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి ఈ రెండేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చూపించాలి. పాలనలో చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందాడు. ప్రజలకు ఏ మేలు చేయక, చెప్పుకోవడానికి చేసిందేమీ లేక, కేవలం అబద్ధాలు సృష్టించి, ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. చంద్రబాబుకు దానిపై ఉన్న శ్రధ్ధ పాలనపై లేదు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై కేసులు పెట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది. 
    నిత్యం జగన్‌గారి నామ స్మరణ చేయడం, ఆయనపై బురద చల్లడం, దుష్ప్రచారం చేయడం ఒక తంతుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా, నాడు జగన్‌గారు చేసిన అభివృద్ధి పనులన్నింటినీ నిర్లజ్జగా తన ఖాతాలో వేసుకుంటూ, క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారు.

మంచి చేసినా ప్రచారం చేసుకోలేదు:
    వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని ప్రజలకు చెప్పుకోలేకపోయాం. చంద్రబాబులా ప్రజలకు అబద్ధాలు చెప్పలేదు. రెండేళ్లు కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఆపలేదు. 17 మెడికల్‌ కాలేజీలు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, 6800 గ్రామాల్లో సమగ్ర భూసర్వే పూర్తి చేశాం.
    ఇంకా మా హయాంలో బెల్ట్‌ షాపులు మొత్తం రద్దు చేసి, మద్యం షాప్‌లు, మద్యం విక్రయ వేళలు తగ్గిస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూముల ద్వారా మద్యం ఏరులై పారిస్తున్నారు. చివరకు రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, పవిత్రమైన తిరుమల లడ్డూను కూడా వివాదంలోకి లాగారు. రాష్ట్రంలో మార్పు మొదలైందని, చంద్రబాబు మోసాలను ఒక్కొక్కటిగా ప్రజలు గుర్తిస్తున్నారని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెప్పారు.

Back to Top